ఆదిత్యహృదయ స్తోత్ర పరమార్థమే "నిశిచరపరపతి సంక్షయం" నిశి చీకటి యందు సంచరించువారికి మూలమైన వానిని సంపూర్తిగా నాశనము చేయుట.
ఐతిహాసిక కథనము ప్రకారము రావణాసుని ఇంద్రియ వ్యామోహమనెడి అజ్ఞానమును నిర్మూలించుట.
రాత్రులందు సంచరించువారిని నిశాచరులుగా భావిస్తే నిశి అంటే చీకటి.కనుకనే అహర్నిశి అనే వాడుక పదమును మనము వింటూంటాము.
స్వామి నిర్మూలించదలచిన చీకటి కేవలము ప్రతి దినము మనము అనుభవించుచున్న సూర్యోదయమేనా లేక మరేదైన నిగూఢార్థము దాగి యున్నదా అన్న సందేహము రావచ్చును.
చీకటులు అనేకానేకములు కావచ్చును.అవి బాహ్యములుగా భావించే భౌగోళిగములు కావచ్చును.అంతరంగికములు లైన అరిధడ్వర్గములు కావచ్చును.దానికి కారణమైన ఇంద్రియ ప్రవృత్తులు కావచ్చును.
క్రమశిక్షణారాహిత్యముతో కలుగు అనారోగ్యమే కావచ్చును.అహంకారమే కావచ్చును.అజ్ఞానమే కావచ్చును.ఆత్మ తత్త్వమును కనుగొనలేని ద్వైత భావమే కావచ్చును.వాటన్నింటిని తెలియచేసేది విమర్శ ద్వారా ప్రకాశమునందించు స్వామి తేజము.అదియే,
సప్తసప్తి మరీచిమాన్-అంటూ ఏడు విధములైన కిరణములతో వ్యాపించే పరమాత్మ ప్రసన్నతా గుణము.
రశ్మిమంతము-సముద్యంతం గా ఆవిష్కరింపబడు అవ్యాజకరుణ.
వ్యోమనాథః తమోభేదః గా స్వామి అంతర్యామిత్వమును అందించు అద్వితీయ భావము.
నమస్తమోభినిఘ్నాయ అని వినిపించు వినుతులు.
జ్యోతిషాంపతి-జ్యోతిర్గణానాం పతిగా కీర్తించు కృతజ్ఞతాభావము.