Tuesday, April 28, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-03

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.మొదటి అనువాకము ఆహార సిధ్ధిని అందించుచున్న మాతృ స్వరూపము గాగ,రెండవ అనువాకము ఆలోచనా సిధ్ధిని అందించుచున్న పితృ స్వరూపము గాను భావించుచున్న వారికి,చమకమునకు వజ్ర మకుట సమానమైన మూడవ అనువాకము ఆచార్య స్వరూపముగా భావించుటలో ఎటువంటి సందేహము లేదనుటకు
 ఆకారమును-ఆలోచనను పుష్ఠివంతము చేసుకొనుచున్న జీవుడు వానిని యుక్తాయుక్త విచక్షణతో ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.
    .అందుకే "శంచమే-మయశ్చమే" అంటూ ఆర్తిగా అనువాకమును ఆరంభించాడు"



                శివుని అనుగ్రహముతో జీవుడు తన విశ్వసందర్శనములోని  వస్తువుల తారతమ్యములను గుర్తించాలనుకుంటున్నాడు.ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి సారములో-ఏవి నిస్సారములో,ఏవి క్షణికములో-ఏవి శాశ్వతములో,ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి అనుసరణీయములో-ఏవి పరిత్యజనీయములో,ఏవి ప్రియములో-ఏవి అప్రియములో,ఏవి అనుకూలములో-ఏవి ప్రతి కూలములో గమనించవలెనని,దానికి తనకు మార్గదర్శకుడైన గురువు ఆవశ్యకత ఎంతయో గలదని ,

 ప్రియంచమే-అనుకామశ్చమే-సౌమనసశ్చమే  వస్తువైవిధ్యమును ప్రస్తావించుచు,దానిని నిర్ధారించుటకు గురువును అనుగ్రహించమని అర్థిస్తూ,ప్రార్థిస్తూ" యంతాచమే" అంటూ ఆచార్యదేవోభవ అను ఆర్యోక్తిని అక్షరాల అనుసరిస్తున్నాడు.
 ఎవరు నేర్పాలో తెలుసుకొనిన తరువాత ఏమి నేర్పాలో కూడా తెలియచేస్తున్నాడు " సంవిచ్చమే" అంటూ వేదప్రమాణమును సన్నుతిస్తూ.

  దానివలన కలుగు ప్రయోజనమును కూడ అవగతము చేసుకొనిన జీవుడు "క్షమశ్చమే-ధృతిశ్చమే" అంటూ తన జ్ఞాన సముపార్జన ఉన్న సంపదను సంరక్షించుటకు దానికి కావలిసిన అత్యవసర సమయములలో ఎదుర్కొనగలుగు ధైర్యమును తద్వారా సామర్థ్యమును పెంపొందించ  గలుగు సూచనను చేయుచున్నాడు.

          సాధకుడు తన అభ్యర్థనలో పరమాత్మను కొన్నింటిని ఇమ్మనికోరుకోవాలి.మరి కొన్నింటినితొలగించమని వేడుకోవాలి అనే విషయమును గ్రహించి చీడ-పీడలను ఆటంకములను తొలగించమంటున్నాడు.














  తన విజ్ఞానము (గురువుచే అనుగ్రహింపబడినది) అవసరములకు మాత్రమే కాదు వాటికి కావలిసిన ప్రణాళికకు,వస్తు సామగ్రికి సంపాదించుకొనునట్లు చేయుటయే గాక,ఉదాహరణకు వ్యవసాయమునకు కావలిసిన నాగలి ఎద్దులు మిగిలిన పరికరము "సీరంచమే" అంటూ వివరిస్తూ,వాటికి      చీడ-పీడవంటి ప్రతిబంధకములను తొలగించమంటున్నాడు.

 ఏవిధముగా మానవుడు తన శక్తిసామర్థ్యములతో చెడును అడ్డగిస్తూ-మంచిని పెంపొందించాలో తెలియచేస్తున్నాడు.

   చెట్లకు వచ్చే చీడ పీడ మాత్రమే కాదు మానవాళిని పీడించు చిన్నచిన్న రుగ్మతలు-పెద్దపెద్ద వ్యాధులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాడు.

  ప్రస్తుతమునకే కాదు తన విజ్ఞాన సంపద-సత్ప్రవర్తన భావితరములకు కూడ చేరవలెనని ,తన నాయకత్వ లక్షనములు లక్షణోపేతములై
 కొనసాగాలని కోరుతున్న చమకముతో మరింత మమేకము అవుదాము.

  వర్గీకరణ సాధకునకు ఐహికము-ఆముష్మికము గుర్తించగలుగుచేయుచున్నన్న వేళ సర్వం శివమయం జగత్.

  ( ఏక బిల్వం శివార్పణం.)





CHAMAKAMU-ANUVAAKAMU02

  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.

  రెండవ అనువాకములో చమకము అర్థుల ఆలోచనా వైచిత్రిని,

  జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే అంటూ ప్రారంభించింది.కలయతీతి కాలం. పరిణామ స్వభావముగల కాలములో ఒక్కొక్క సారి అనుకూల పరిస్థితులు మరొక్కప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి.అప్పుడు వాటిని  ఎదుర్కోవాలంటే స్థితప్రజ్ఞత్వము కల నాయకుడు.పరిణితితో ఆలోచించగలిగి యుండాలి.సామర్థ్యముతో సమస్యలను పరిష్కరించుకోగలగాలి.

    అంతేకాదు అవసరమైన పరిస్థితులలో ఆగ్రహమును అంతర్ముఖముగా-బహిర్ముఖముగా తగిన మోతాదులో వ్యక్తము చేయగలిగి యుండాలి.ప్రకటిత కోపియై యుండాలి కాని ప్రకృత కోపియై వశుడు కారాదు అనే సత్యాన్ని "భామశ్చమే-మన్యశ్చమే " అంటూ మనకు చెబుతోంది.

వారసత్వమను ప్రక్రియకు నారుపోసి ముందు జాగ్రత్తగా మాకు మా ముందు తరములవారికి ప్రసాదించమని ప్రార్థనను ."వర్ష్మాశ్చమే" అంటూ.

  మానసికోల్లాసమునకు క్రీడలను పరిచయము చేస్తూనే అనగా ఈశ్వర లీలను గుర్తించు సామర్థము,దానిని పొందుటకు సత్యము-ధర్మము-శ్రధ్ధ,వేద సంహితాధ్యనము మొదలగు వానిని మతిశ్చమే-సుమతిశ్చమే అంటూ సూచిస్తున్న చమకముతో మరిన్ని మంచి విషయములతో మమేకము అవుదాము.

   సర్వం శివమయం జగత్.

   ఏక బిల్వం శివార్పణం.

CHAMAKAMU-ANUVAAKAMU01


  చమకము-ప్రథమ అనువాకము.
   ***************************
 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.రుద్రనమకము పరమాత్మ సర్వాంతర్యామిత్వమును,సర్వ సామర్థ్యమును వివరిస్తు విశ్వమే విశ్వేశ్వరుడు అను యథార్థమును సోదాహరణముగా మనకు వివరిస్తుంది.ఆ విషయము లోని మర్మమును అవగతము చేసుకోలేని మనము చేతులుచాచి చెంతకు చేర్చుకోవాలనే కరుణాంతరంగుడైన పరమాత్మను ఏమి అడగాలో,ఎప్పుడు అడగాలో,ఎందుకు అడగాలో,ఎలా అడగాలో తెలుసుకోలేని తమస్సులోనున్న మనలను కరుణించి,పరమాత్మ చమకము ద్వారా తానే మన బదులు అంతటా అవగతమవుతున్న పరమాత్మ అనుగ్రహమును ఆలంబన చేసుకొని,ఆధ్యాత్మిక సోపానములను అధిరోహించుటకు,మనము ఏమి అడగాలి,ఎప్పుడు అడగాలి,ఎవరికోసము/ఎందుకోసము అడగాలి,ఎలా అడగాలి తెలియచేయు వాత్సల్యమే చమకము.ఒకటి కాదు-రెండుకాదు,ఒకసారి కాదు-రెందు సార్లు కాదు,ఒక కాలమునకు కాదు విశ్వమంతయు విరాజమానమగుటకు అది కూడా,ఇది కూడా అహకాదు అలాకూడా,ఇలా కూడా,కాదు కాదు అప్పుడు కూడా/ఇప్పుడు కూడా,దానికి కూడా/దీనికి కూడా,నాకు కూడా/నా వంశమునకు కూడా ఇలా ప్రతి పదము తరువాత ఇంకా,ఇంకా,నాకు కావాలి అని కోరుటచే "చ" అని,నాకు కావాలి అని ప్రార్థించుటచే " మే" అని పదే పదే చమే ఆవృత్తమగుటచే చమకముగా ప్రసిధ్ధి చెందినది.జగద్రక్షకుని జాలిగుణమునకు చక్కని ఉదాహరణము.

  అంతే కాదు.చమకం మనలోని ఇంద్రియశక్తిని జాగృతము చేసి,భౌతిక వస్తువుగా చర్మచక్షువులకు గోచరించు,పరికరమును చైతన్యవంతముగా మలచుకొను దార్శనికతను అందచేస్తుంది.

 ఉదాహరణకు మన చర్మ చక్షువులు ఒక వెదురు గడను చూశాయనుకోండి.దానిని గురించి పెద్దగా పట్టించుకోము.కాని చైతన్యవంతమైన చక్షువు దానిని రూపాంతరముగా మలచుకొని ఉదాహరణకు ఒక నిచ్చెనగా మలచుకొని,ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే పరికరముగా ఉపయోగించకొనవచ్చును.కనుకనే,

  " అగ్నా విష్ణో సజోష" అంటూ అగ్ని-విష్ణు నామము గల చైతన్యవంతమైన-+ శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.

  ఇక్కడ మనము ఒక్క విషయమును గురించి కొంచము ఆలోచించాలి.అగ్ని-విష్ణు అను నామములుగల రెండు దివ్య శక్తులను ప్రార్థిస్తూ  సాధకుడు,వారిద్దరు కలిసి తమను అనుగ్రహించమనికోరుకుంటున్నాడని అంటున్నది చమకము.ఇవి స్వరూప నామములా-లేక స్వభావ నామముల.కేవలవ్యవహారిక నామములు మాత్రము కాదు.వారివి మంత్ర శరీరములు కాని మాంస శరీరములు కావు.వారు జాగృతమై వారి శక్తులను మనలోనికి,అనగా విశ్వములోనికి జాగృతము చేయమని వేడుకుంటున్నారు.

 అగ్ని అంటే కేవలము నిప్పు మాత్రమేనా? లేక ఇంకేదైన గౌణ నామమా.పెద్దలు ఏమని వివరిస్తారంటే మనలో నిద్రాణమై యున్న కుండలినీశక్తిని జాగృతపరచి,అది పైపైకి ఎగబాకి సహస్రారమును చేరునటు చేసి,                          అమృత కలశమునకు చిల్లి చేసి, ధారలు పడునట్లు చేయాలి.
అప్పుడు విష్ణు అను మరొశక్తి(వ్యాపకత్వశక్తి) దానిని విశ్వమంతయు వ్యాపించునట్లు చేసి తేజోమయము చేయాలి ఈ పనిని ఈ రెండు శక్తులు  పరమేశ్వరుని  అనుజ్ఞచే,  ఒకదానికొకటి సహకరించుకుంటూ చేయగలవు కాని విడివిడిగా కాదు.

 వాజశ్చమే అను మొదటి కోరిక.వాచకార్థమును పరిశీలిస్తే అన్నము/ఆహారము.అన్నము ఉన్నంత మాత్రమున చాలదు.దానిని భుజించుటకు అర్హతయైన ఆకలి ఉండాలి.అంతే కాదు ఆ అన్నము పోషకత్వమును కలిగి యుండాలి.తినువారికి దానిని ఇష్టముతో తినవలెనను కోరిక కలిగి యుండాలి.అంతే కాదు అన్నమునుంచిన పాత్ర శుచియై ఉండాలి.అన్నమును మితముగా తినగలుగు ఇంద్రియ నిగ్రహము ఉండాలి.ఆస్వాదించగలుగు మనసు,అరిగించుకొనగలుగు శక్తి ఉండాలి.అంతే కాదు అన్నప్రదాతకు కృతజ్ఞతను తెలుపుకోగల ఇంద్రియశక్తిని పొందకలిగి ఉండాలి.అన్నము పుష్కలముగా లభించుటకు మనము యజ్ఞము చేయకలిగి ఉండాలి.

    వాజశ్చమే

 అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.

    ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు  - అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని,లయింపబడుచున్నవని చెప్పుచున్నది.

    అన్నమే/ఆహారమే అన్నమయకోశములోనికి ప్రవేశించి ప్రాణముగా మారుచున్నది.మరల మరల ప్రవేశించుచు ప్రాణిని జీవింపచేస్తున్నదిచివరకు జీవికి ఈశ్వరత్వమును అందిస్తున్నది.

  పరమాత్మ సృష్టించిన రుద్రులు మనకు అందించే ఆహారముద్వారా మనకు ఆరోగ్యము-అనారోగ్యమును మన కర్మ ఫలితములను అనుసరించి అందిస్తుంటారు.

  యజ్ఞము అంటే హోమగుందములో చేసే క్రతువు ఒక్కటే కాదు.ఇంద్రియ యజ్ఞము-మానసిక యజ్ఞము నిరంతర నియమములతో చేయకలగాలి.

   కనుక పరమాత్మ నా శరీర దారుఢ్యమునకు,మానసిక స్థితప్రజ్ఞతకు కావలిసిన వస్తువులను ఆలోచనలను అనుగ్రహించి,నా యజ్ఞము సమర్థవంతమగునట్లు చేయుము అని అభ్యర్థిస్తున్నాడు "యజ్ఞేన కల్పతాం" అంటూ పరమాత్మను పరిశుధ్ధమైన మనసుతో.ఇంకా మరెన్నో మంచి విషయములతో చమకముతో మమేకము అవుదాము.

  సర్వం శివమయం జగత్

   ఏక బిల్వం శివార్పణం
.





TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...