కుర్యాత్ కటాక్షం కళ్యాణి-07
***********************
ప్రార్థన
****
"భవాని త్వం దాసే" మయి వితర దృష్టిం సకరుణా
మితిస్తోత్రం వాంఛనధియతి "భవానిత్వమితియః"
త దైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్పుట మకుట నీరాజన పదాం
శ్లోకము
****
న్యంకాకరే వపుషి కంకాల రక్తపుషి కంకాది పక్షి విషయే
త్వంకామనాం అయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజా
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతిం అంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం.
స్తోత్ర పూర్వ పరిచయము
***************
ప్రథమ శ్లోకములో తాంబూలరసమును ప్రసాదించి,కవితా వైభవమునుకోరిన మహాకవి,రెండవ శ్లోకములో మంత్ర సాధనము,మహర్షుల ఉద్ధరణమును విశ్లేషించారు.మూడవ శ్లోకములో సంసార సర్పమును సంహరించు ఆడముంగిసగా ఆరాధించారు.అమ్మ కరుణ ఒక రూపమును సంతరించుకున్నది.నాల్గవ శ్లోకములో అమ్మ నిధిత్వ-పృథుత్వ స్తన ప్రస్తావనము చేస్తూ,సకల చరాచర రూపముల స్థితికారిణిగా సంకీర్తించారు.అంటే సృష్టికారిణి-సృష్టి,స్థితికారిణి జగదంబయే అని వివరించారు.
తాను అరాధిస్తున్న స్తనములు అందింస్తున్న క్షీర ప్రాముఖ్యతను ఐదవ శ్లోకములో స్కందమాత తత్త్వము ద్వారా అవి,కేవలము ఆకలిని తీర్చునవి మాత్రమే కాదు సుమా,
" సదాశివుని సైతము ఆది భిక్షువుగా,జ్ఞాన వైరాగ్య సిద్ధులను" అనుగ్రహించమని అర్థించిన అమృతకలశములుగా దర్శిస్తూ,మనలకు దర్శింపచేస్తూ,కడుపు నిండిన వేళ కాంతిస్వరూపిణిగా తల్లిని వర్ణిస్తూ,కన్నుల పండుగ చేసారు ఆరవ శ్లోకములో.
ఆరు శ్లోకములలో,
సాధకుడు-వరము-ప్రార్థన-వరానుగ్రహ విధానము-వరప్రదానము వరప్రదాత జగదంబ అను అంశములు కనపడుతుంటాయి.తనకొరకు,తనకు
కావలిసినది ఏమిటి? దానిని ఎలా పొందాలి?దానిని అనుగ్రహించగల శక్తి ఎవరికి ఉంది? ఏవిధముగా అభ్యర్థించాలి?అని ఆలోచించిన సాధకుని తలపు ఒక విషయమును గ్రహించింది.
" దానిని పొందుటకు తానున్న సంసారము,తనకు-అమ్మకు మధ్య అడ్దుగాఉండినందున ఆ అడ్డును తొలగించివేసుకోవాలి".అంటే,
"తనను తాను చూసుకోవలెనన్న తన ముందర నున్న అద్దమును" మాయ అను మురికి కప్పివేసినది"
" యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థితా" నమోనమః.
.అద్దము ప్రతిబింబమును చూపు సమర్థతను కలిగియున్నదే.తాను తనప్రతి బింబమును చూసుకోవలెనన్న కుతూహలమును కలిగియున్నవాడే ,కాని అడ్దుపడుతున్నది మధ్యగా అద్దమును కప్పియున్న మాయ అను దుమ్ము.దానిని తొలగించుకొను ప్రయత్నమే ప్రస్తుత శ్లోక పరమార్థము.
పద విన్యాసము.
**********
1. భ్రమ యని తెలుసు-బ్రతుకంటె బొమ్మలాట యని తెలిసు
తెలుసు తెర తొలగుతుందని-తెలుసు తెల్లారుతుందని
అయినా
అన్నీ తెలిసి అడుసులోన పడి దొర్లుతుంటావు
ఓ! మనసా(ఆదిశంకరా చిత్రము)
ఆదిశంకరులు సౌందర్యలహరి స్తోత్రములో స్తుతించినట్లు,
అనేనాయం ధన్యో భవతి-నచతే హాని రియతా."
తల్లీ నీవు అనుగ్రహిస్తే నేను ధన్యుడిని అవుతాను,నీకు వచ్చే నష్టము ఏమిలేదు కదానీవు శిరోభూషణముగా ధరించినచంద్రరేఖ ఎటువంటి తారతమ్యమును చూపకుండా సమముగా తన వెన్నెలలను పంచుతున్నది.ఆ సిద్ధాంత ప్రకారము నా అర్హతను చూడక,నన్ను అనుగ్రహింపుము.నమోనమః.
ప్రస్తుత శ్లోకము,
"ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే
ఏ తద్ యో తం ప్రాహుః క్షేత్రజ్ఞా ఇతి తత్ విదః'
అభిధీయతే-పిలువబడుతున్నది.
శరీరం-అభిధీయతే
శరీరము పిలువబడుచున్నది
ఏ- తద్- శరీరం- అభిధీయతే
ఈ-శరీరము-పిలువబడుతున్నది
క్షేత్రం-ఏ తద్-శరీరం-అభిధీయతే
క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుచున్నది.
వేత్తి-క్షేత్రం-ఏ తద్- శరీరం-అభిధీయతే
తెలుసుకుంటారో-క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుతున్నదని
యః-వేత్తి-క్షేత్రం -ఏ తద్-శరీరం-అభిధీయతి
ఎవరైతే-తెలుసుకుంటారో-క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుతున్నదని
తం-క్షేత్రజ్ఞ-వారే క్షేత్రజ్ఞుడు.
.ఆ శక్తియే క్షేత్రజ్ఞ శక్తిగా సంభావించబడుతున్నది.
ఇంత చక్కటి సందేశమును మహాకవి,
1.
కిం-కారణం
కారణం-ఏమిటి?
అయసి-కిం-కారణం
పొందుటకు-కారణం-ఏమిటి?
కామనాం-అయసి-కిం-కారణం
కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?
వపుషి-కామనాం-అయసి-కిం-కారణం
శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?
రక్తపుషి-వపుషి-కామనాం-అయసి-కిం-కారణం
రక్తముచే పోషిపబడుచున్న-శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?
కంకాళ-రక్తపుషి-వపుషి-కామనాం-అయసి-కిం-కారణం
ఎముకలగూడు-రక్తసిక్తము అయిన -శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?
అంతే కాదు,
ని-అంక-ఆకరే-కంకాళ-రక్తపుషి-వపుషి-అయసి-కిం-కారణం
నిందలకు నిలయమై-బొమికలగూడై-రక్తపు వాగైన-శరీరముపై-కోరికలను -పొందుటకు-కారణం-ఏమిటి?
అశాశ్వతమైన శరీరమును శాశ్వతమనుకొని దానిపై కోరికను పెంచుకొనుటకు కారణమేమిటి ? ఓ ఉపాధి,
అట్టి ఉపాధి చివరకు,
విషయే-ఆహారముగా మారుచున్నది.
పక్షి-విషయే-
పక్షులకు-ఆహారముగా-మారుచునది.
కంక-ఆది-పక్షి-విషయే
రాబందులు-కాకులు-మొదలగు పక్షులకు ఆహారముగా మారుచున్నది.గ్రహించావా?
పరమేశ్వరియే,
క్షేత్రస్వరూపి-క్షేత్రేశి-క్షేత్రక్షేత్రజ్ఞ పాలినిగా తెలుసుకో.
' "జరాధ్వాంత రవిప్రభా-ముసలితనమను చీకటిని తొలగించు సూర్యుని వంటిది."
మృత్యు ద్వార-కుఠారికా-మృత్యు గుహను ఖండించు కత్తి వంటిది.అమ్మను స్తుతించు.
2.నిస్సంసయా-సంశయఘ్నీ
********************
సంశయములు లేనిది భక్తుల సంశయములను తొలగించునది జగజ్జనని.
. తల్లీ! స్థూల శరీరము-సూక్ష్మ శరీరము ఒకటేనా లేక వేర్వేరా?
వాటి ధర్మములు వేర్వేరా లేక ఒకటేనా? అను అనేకానే సందేహములు నా హృదిలో బండరాయి వలె కూర్చుని నన్ను సతమతముచేస్తున్నాయమ్మా..వాటిని పగులగొట్టి సత్యావిష్కారము చేయించగలిగిన పదునైన ఉలులు/ సుత్తులు నీ పాదపద్మములు.
గిరిజా-పద-గిరిజాదేవి పాదపద్మములు
ఝంకారి-పద-గిరిజా
ఝంకారమును చేయుచున్న(ప్రణవోపాసనము చేయుచున్న) గిరిజాదేవి-పాదపద్మములు
భృంగ తతిం- ఝంకారి-పద-గిరిజా
తుమ్మెదల సమూహములు-వాలి-ఝంకారముచేయుచున్న-గిరిజాదేవి-పాదపద్మములు
సుమనో-భృంగ-తతి-ఝంకార-పద-గిరిజా
సుమనస్కులైన దేవతలు అనే తుమ్మెదల సమూహము సేవిస్తూ/ఝంకారము చేస్తూ-ఉన్న గిరిజాదేవి-పాదపద్మములు
టంకాయమాన- సుత్తుల వంటివి.
నిశిత-టంకాయమాన-పదునైన సుత్తుల వంటివి
శిలా-టంకాయమాన-పద-గిరిజా
బందరాళ్లను ఛేదించే పదునైన సుత్తి వంటి పాదపద్మములు కల గిరిజాదేవి
శంకా-శిలా-టంకాయమాన-పద-గిరిజా
సందేహములనే బండరాళ్ళను పగులగొట్టగల పదునైనఉలులువంటి పాదపద్మములు నన్ను ఉద్ధరించును గాక.
3. అమ్మ మహనీయదయామూర్తి.
***************
రాకేందుముఖి.మచ్చలేనిచంద్రబింబము అమ్మ ముఖము.
అమ్మ క్షిప్రప్రసాదత్వమును ఆది శంకరులు,
భవాని త్వం దాసే--భవానిత్వం అను రెండు పదములతో చమత్కరించారు.
" భావానీ-భావనాగమ్యా" తలచినంత మాత్రముననే తరలివచ్చు "భావనా మాత్ర సంతుష్టా".
సాధకుడు అమ్మను భవానీ-త్వం-అమ్మా నన్ను ....
నీ దాసునిగానుగ్రహించమని అడగాలనుకున్నాడట. అనుకున్నాడట.
కానీ, అమ్మ
అడిగే లోపుననే వాడు నన్ను భవానిత్వమును అడుగుతున్నాడు.ఇచ్చేద్దామనుకుందట.
భవానిత్వం అంటే?
1.జడశక్తి-జడాత్మికా
చిఛ్చక్తి-చేతనారూపా
రెండునూ తల్లి శక్తులే యని గ్రహించుట.
2 రక్తపు వాగు నీ శరీరము-అశాశ్వతము అనుకున్న తెలివియే
అమ్మను రుధిర సంస్థితగా,రక్త వర్ణా-మాంసనిష్ఠా ఆ జగజ్జనని శక్తియే
యని గ్రహించగలుగుట.
3.ఎముకలగూడు మన-ఉపాధి అని భావించిన
మనమే అందులో అస్థి సంస్థితా శక్తిని అర్థముచేసుకొనగలగటము.
అంతేకాదు భవబంధ విమోచిని-పశుపాశ విమోచిని మనలోనే
ఉన్నదను భావనయే భవానిత్వం.దానిని గ్రహించినవాడే అమ్మ
దాసుడు.
ద్వంద్వాతీత స్థితి అను మకరందముతో అభిషేకించిన మహాకవి,
కంకాల,సంకాశ,కంకాది,ఝంకారి,పంకారి,న్యంకాకరే,కిం కారణం,శంకాశిలా,త్వంకామనా,అంకానుపేత,టంకాయమాన,సంకాశమాన,మొదలగు పదములలో బిందు పూర్వక "0కా"అను అక్షరమునుపునరావృత్తము చేసి,నాదభూషణ ములను అలంకరించారు.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
అమ్మ దయతో అర్చనకొనసాగుతుంది.