హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥ ప్రస్తుత శ్లోకములో పరమాత్మ హిరణ్యగర్భునిగా,అగ్ని గర్భునిగా,తపనునిగా,భాస్కరునిగా,రవిగా,అదితిపుత్రునిగా,శంఖునిగా,శిశిరనాశనునిగా వర్ణించారు.
హితమును-రామణీయకతను కలిగించునది హిరణ్యము.(కేవలము బంగారమను లోహము మాత్రమే కాదు.)జలమయిమైన సమయములో తన శక్తిని బీజముగా దానిలోనికి ప్రవేశింపచేసిన పరమాత్మ హిరణ్యగర్భుడు.స్థూల పినఃసృష్టికి కారణభూతుడు.
స్థూలములో నిండిన ఉపాధులలో తన చైతన్యమును నిబిడీకృతము చేసి వానిని చైతన్యవంతము చేసే అద్భుత శక్తియే అగ్నిగర్భుడు.
జడములలో కలిగించు ప్రతిస్పందన శక్తి యొక్క చైతన్యమే అగ్నిగర్భముగా కీర్తింపబడుతున్నది.
అదే విధముగా శిశిరః-శిశిరనాశనః అని శిశిరము అను పదమును రెండుసార్లు ప్రస్తావించబడినది.
శిశిర పదమును స్థూలములో అన్వయించుకుంటే ఋతు స్వరూప-స్వభావములను పోషణమునకు అనుకూలముగా అనుగ్రహించు పరమాత్మ అని అన్వయిస్తారు.
శిశిరమును పోషణరహిత-తన స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని /ప్రతిస్పందనములేని జడలక్షణముగా అన్వయించుకుంటే దానిని నశింపచేసే చైతన్యము ఆ పరమాత్మ.
అఖండ స్వరూపముగా తన తీక్షణతతో లోకములను తపించచేయు భాస్కరుడే-సాయంత్రమునకు తనకు తానుగా తన తాపమును తగ్గించుకొని లోకములను ఆహ్లాద పరచు శంఖుడు.సత్వగుణసంపన్నుడు.
ఆ పరమాత్మయే రవిగా ప్రస్తుతింపబడినాడు.
"రూయతే స్తూయతే ఇతి రవిః"
ఋతము అనగా స్వయంసంభవ శబ్దము/అపౌరుషేయమైన వేదము-నాదము.అటువంటి వేదమయుడు-వేదమంత్రములచే ప్రస్తుతింపబడువాడు.
రు-యు అను అక్షరములు ఋక్కులకు-యజుస్సులకు సంకేతముగా అన్వయించుకుంటే ప్రణవ స్వరూపము/ఓంకార స్వరూపమే సూర్యనారాయణుడు.
అఖండ స్వరూపమే అదితి అను సంకేత నామము.అదియే అద్వైతము.దానికి సమానమైనది/మించినది లేదు కనుక అదితేపుత్రః గా ప్రస్తుతింపబడుచున్నాడు.
తాపమును కలిగించునది-తాపమును నశింపచేయునది,నిక్షిప్తముగా దాగియున్నను ప్రత్యక్షముగా దర్శింపచేయు పరమాత్మ నీకు వందనములు.