ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-02
****************************
అలా ఆలోచనలతో తోటలోకి అడుగులు కదిపానో లేదో నా దృష్టి నిన్న నన్ను స్వాగతించిన గులాబీల మీద పడింది.
అంతే వేగముగా నన్ను అంతర్మథనములోనికి తోసివేసింది.
మొన్నటి రోజున అవి మొగ్గలు.అంతకు ముందు అవి చెట్టు లోపల ఎక్కడ దాగి ఉన్నాయో,వాటికి,వానిని దాచుకున్న ఆ గులాబీ మొక్కకే తెలియాలి.
నిన్న అరవిచ్చిన రేకులతో,విరబూసిన సోకులతో,రంగుల హంగును సింగారించుకొని,మురిసిపోతు విరిసినాయి.
ఎంతటి ఆస్వాదనీయము వాటి సౌందర్యము.
ఎంతటి ఆఘ్రాణనీయము వాటి పరిమళము.
ఒకేసారి తమ పరిపూర్ణతతో కన్నులను,పరిమళముతో మనసును ఆహ్లాదపరిచాయి.
ఇంతలోనే ఎంతమార్పు?
రేకులతో పాటు సోకులు నేలరాలినవి.
ఎక్కడికి పోయినది వాటి ప్రత్యేకతలైన రంగు-రూపు-పరిమళములతో కూడిన ఆకర్షణ?
మార్పుకు కారణమైన కూర్పును చేసినదెవరు?
వాటి అవస్థలను బట్టి లేత మొగ్గ,మొగ్గ,విసనమునకు సిధ్ధముగా నున్న మొగ్గ,అరవిరిసిన పువ్వు,వాడిన పువ్వు,నేలరాలిన పువ్వు గా నిర్మించి,నిర్ధారించినది ఏవరు?
వాటిని వాటికి ఇచ్చిన శక్తికే తిరిగి తీసివేసే అధికారము ఉంటుందా?
అయితే అవిఏవి వాటి స్వయం శక్తులు కావా? అందుకే అవి తమను వీడిపోతున్నపుడు నిస్సహాయమైనవా.నిర్వాణమో/నిర్యాణమో!
ఆ గులాబి మొక్క నాకు ముళ్ళు వద్దు కేవలము పూలు మాత్రమే పోయిస్తాను అని ఎందుకు అనుకోలేక పోయింది?
ఈ పూలు-ఈ పళ్ళు-ఈ మొక్కలు స్వయముగా ఆ అందమును-ఆకర్షణను పొందిలేవా? వాటి స్వంతమైతే అవి తమ నుండి దూర్మవుతుంటే అవి ఎందుకు నిస్సహాయముగా కనుమరుగవుతున్నాయి?
పువ్వులే కాదు పండ్లు కూడ,
పిందె-కాయ-పండు-మిగుల పండిన పండు-కుల్లిన పండు-వ్యర్థము ఇలా వివిధ దశలను పొందుతుఆదరించిన వారిచే త్యజించ బడుతున్నాయి?
వాటిలో ఆ పరిమాణమును-పరిణామమును కల్పించుచున్నదెవరు?
కనువిందునకు-కను మరుగునకు కారణమైనదెవరు?
పరిపరి విధములైన ఆలోచనలతో పరుగులు తీస్తున్న నా మనసుకు,
ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్" పరిష్కారమును చూపుతుందని ఆశిస్తున్న నన్ను,మనలను ఆ పరమేశ్వర కృప ఆశీర్వదించును గాక.
పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.