Thursday, January 25, 2018

MAANIKYA VAACHAGAR

" బ్రహ్మాండం వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై
కంఠే కాలాత్ కపర్దాః కలిత శశికళాః చంద్ర కోదండ హస్తాః
వ్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరా శాంభవామూర్తివేదాః
రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత భవా నః ప్రయచ్చంతు సౌఖ్యం."
చిదానందరూపా-మాణిక్య వాచగరు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు
"తిరువిలయడలు"ను అందించిన మాణిక్య వాచగరు
అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ
విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ
తడవుగ అడవిలో నక్కలు వెడలెను హయముల మాదిరి
విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి
బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా
శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
వధవురారు తిరువాచగమును రచించిన శివస్వరూపుడు.పాండ్య రాజైన వరగుణవర్మ మంత్రి.వైగై నదీతీరమున గల వధవూరులో జన్మించిరి.వీరి స్తుతులు "తిరుమియిదళ్" పురాణముగ ప్రసిద్ధి గాంచినది.మధుర సంభాషణలను సలిపెడివారు కనుక వధూవరూరు మాణిక్యవాచగరు గా కీర్తింపబడుచున్నారు.స్పురద్రూపియైన వీరు శివసేవక సంకేతముగ తలచుట్టు ఒక చిన్న గుడ్డను కట్టుకొని యుండెడివారు.కర్తవ్య నిర్వహణలో కడు నేర్పరి.
ఒకసారు రాజుగారు మాణిక్యునకు ధనమునిచ్చి రాజ్యమునకు కావలిసిన అశ్వదళమును తెమ్మని ఆదేశించిరి.స్వామికార్యమునకు వెళ్ళుచుండగా " అశ్వేభ్యో -అశ్వపతిభ్యో" ఎదురైనాడు,ఇంకెక్కడి అశ్వములు? తిక్క కుదిరింది అన్నట్లు ఆ ధనముతో గుర్రములను కొనక,తిరుప్పెరుంతరైలో పెద్ద శివాలయము నిర్మింపచేసి,నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండెను.విషయము తెలిసిన రాజు తన భక్తుని శిక్షించునని అడవి
నక్కలను గుర్రములను చేసి,
అశ్వశాల పంపినాడు ఆ ఆశ్రితవాత్సల్యుడు..చిన్న చిన్న చమత్కారాలు చిద్విలాస భాగములుగా ద్యోతకమవుతూ దోబూచులాడుతుంటాయి."ఓం నమః శివాయ".అక్కడ నిలువలేక అడవినక్కలు తమ నిజస్వరూపమును ధరించి అడవిలోని పారిపోయినవి.కాపు పాపములను హరించదలచనేమో.హర హర మహాదేవ శంభో శంకరా.విషయమును గ్రహించిన రాజు మాణిక్య వాచగరును పంచాగ్నుల మధ్య బంధించమని శాసించెను.భోళా శంకరునితో వేళాకోళములా?వైశ్వానరునిపై( అగ్నిని మూడవ కన్నుగ కలవాడు) అచంచల భక్తికి అగ్ని శత్రువు కాగలదా? గంగాధరుని యాన కావున గంగ ఉప్పొంగి మాణిక్య వాచగరు శివభక్తిని చిరస్మరణీయము చేసినది. రాజును సంస్కరించి ,సత్కృపను పొందునట్లు చేసినది. సదా శివుడు మాణిక్య వాచగరు సరసను కూర్చుండి భగవంతుని భక్తునికి గల సాన్నిహిత్యమును ఋజువు చేసినాడు. సమయమాసన్నమయినపుడు స శరీరముతో (అవశేషములను మిగల్చకుండ) శివము శివములో మమేకమైనది.ఈశానాం సర్వ విద్యానాం-ఈశ్వర: సర్వ భూతానాం.......మనందరిలో నిండి మమ్ములను కాపాడుచుండును గాక.
ప్రియ మిత్రులారా,
శివ సంకల్పముతో ప్రసాదింపబడిన పవిత్ర నాయనార్ల చరితలు( కొంతమందివి మాత్రమే) (విబుధ జనుల వలన విన్నంత/కన్నంత) కార్తిక మాసములో అందించుటకు ప్రయత్నించిన,ఏ మాత్రము సంశయించకుండ వెంటనే తమ గుంపు లోనికి అనుమతించిన పెద్దలు,గుంపు నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారములు.వారి సహకారము లేకపోతే నా అక్షరములు మిమ్ములను చేరి సంతసమందగలవా? ధన్యోస్మి. సభ్యులు వానిని చదివామని తెలియచేస్తు,తమ వ్యాఖల ద్వారా వాటిని మరింత సుసంపన్నము చేస్తున్నందుకు నా సవినయ ధన్యవాదములు."సర్వం శివమయం జగత్" సర్వసాక్షి యైన సదాశివుడు మన సరసనే యుండి,సన్మార్గము చూపుతు,సర్వాభీష్టములను నెరవేర్చును గాక.
సర్వేజనా సుఖినో భవంతు- సమస్త సమ్మంగళాని భవంతు.
స్వస్తి.

SOMASIRA NAAYANAR

చిదానందరూపా--సోమశిర నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు
తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు
పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు
పరహితమును కోరు అనిశమును పూజను మానడు
గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను
భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను
చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా
సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము.
ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు. పంచమ దంపతుల ప్రత్యక్షముగ తామే సోమ శిర(శిరమందు చంద్రుని ధరించిన వాడు) నాయనారు దివ్య చరితము. మంచి-చెడులు ఎంచి చూడగ మనుజులందున రెండు కులములు ....మంచి నేనౌతా అన్నారు గురజాడ వారు.అదేవిధముగా చండాల రూపము-అచంచల కరుణాప్రవాహమైన స్వామి అనేక రూపములలో,అనేక విధములుగ ప్రకటింపబడుతు మనలను మూఢత్వమునుండి ముముక్షుత్వము వైపుకు మరలించుటకు బయలుదేరుచున్నాడు
తిరువాంబూరులోని సోమశిర నాయనారు ఉత్తమ సంస్కారుడు.పరమ శివభక్తుడు.త్రిగుణాతీతుడై,త్రినేత్రున్ పొందినవాడు. పరిసరములు,.బ్రాహ్మణులు అగ్రకులజులమను అపోహలో ప్రభావితముచేయుచున్న సమయమునందు, కుల వివక్షను మరచి సర్వజనులను సదాశివుడే అనుకొనుచు,శివభక్తులను త్రికరశుద్ధిగ కొలిచేవాడు.
2. యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఎటువంటి ఫలితములను ఆశించక నిస్స్వార్థముగా చేయు యజ్ఞమును శివపూజగా భావించి,సంతృప్తితో నుండెడివాడు.
3.గురువుగారైన సుందరమూర్తి యందు అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను కలిగియుండెడి వాడు.గురుసేవకై తిరువూరు చేరిన సోమశిర నాయనారును పరీక్షించాలనుకున్నాడు.యాగ హవిస్సును స్వీకరించమని ప్రార్థించు సోమశిర ను పరీక్షించుటకై పంచమ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.పరమానందముతో వారిని సేవించి,హవిస్సును సమర్పణము చేసి,పులకించాడు నాయనారు.సమయము ఆసన్నమైనపుడు సద్గతి కలుగుతుందని దీవించి,అదృశ్యమయ్యారు ఆదిదంపతులు.అతిపవిత్ర మనసుతో అనుగ్రహించిన ఆదిదేవుని నిర్హేతుక కృపా కటాక్షము మనలందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

VIRALMIMDA NAAYANAR

"బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"
చిదానందరూపా-విరాల్మిండు నాయనారు
************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు
శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు
కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె
నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె
శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె
దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె
తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు
తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
నేను-నాది అను భావాలను అధిగమించిన (వాడు ) విరాల్ మిండ నాయనారు భగవంతుని సేవకన్న భక్తుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు.శివభక్తులకు గౌరవములేనిచోట క్షణకాలమైనను ఉండుటకు ఇష్టపడడు ఏ విధముగా శ్రీరామునికన్నా రామనామమహిమ గొప్పతనము శ్రీ రామాంజనేయ యుద్ధము ద్వారా ప్రకటింపబడినది కదా! ,విరాల్మిండ భక్తిలో సాత్వికతను దాచివేసి రౌద్రము తన ముద్రతో రుద్రుని మెప్పించింది.శివ భక్తులను సాక్షాత్ శివ స్వరూపముగా భావించి,వారిని గౌరవించుటలో చిన్న నిర్లక్ష్యమును కూడ సహించలేని విలక్షణుడు విరాల్మిండ నాయనారు.శివుని వ్యహారములు పాప పరిహారములో-పావన తారకములో తెలియాలంతే చర్మచక్షువులతో కథలుగా కాక,మనసులోతునుంచి వాని తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనము ప్రయత్నించాలి కదా!సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా.. ఒకనాడు సుందరారు, శివభక్తులను నిర్లక్ష్యము చేసి( తిరివారూరులోని) సరాసరి శివ దర్శనమును చేసుకొనునట్లు చేసి,అదిచూసి ఇసుమంతయు తాళలేని విరాల్మిండ అతనిని దూషించి, శివ భక్తుల పట్ల చేసిన అపరాధము (వారిని గౌరవించక-ప్రథమ దర్శనము చేయనీయక,శంకరుని చదరంగపు [పావుయైన సుందరారు)భక్తునితోపాటు భగవంతుని కూడా వెలివేస్తున్నానన్నాడు. "ఆట కదరా శివా! ఆట కద నీకిది అమ్మ తోడు".పావులు కదిలాయి.పావన తేవారములు ప్రకటింపబడినాయి. తప్పు తెలిసికొనిన సుందరారు తాను శివభక్తుల సేవకుడనని "తేవారముల"తో కీర్తించి విరాల్ నాయనారును శాంతపరిచాడు.శివ సంకల్పముచే తన ప్రతినను మరచి,తప్పుచేసిన వారిని తరుముతు తిరిగి ప్రవేశించిన విరాల్మిండ నాయనారును రక్షించినట్లు ఆ పరమేశ్వరుడు మనలను రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

MURUGA NAAYANAAR



" ఏలా లవంగి పూలతో జాజి చంపకములతో
మాలతి-మందారలతో మహేశ్వరుని పూజింగ రారె
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు-పొగడలు తెచ్చి
రంగుల రోజాపూలతో రామేశ్వరుని పూజింపగ రారె"
చిదానందరూపా-మురుగ నాయనారు
***********************************
కలనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
యోగుల స్వేదబిందువుల వేదపు పూలగా మారు
శివలీల చాటగ వేదికయైనది తిరువుకలూరు
చేతిలో పూలసజ్జ రమణీయము,చేయు జపము అనుసరణీయము
ఆనంద భాష్పాభిషేకము తోడుగ శివునకు పుష్ప యాగము
తిరుజ్ఞానిని మురుగను స్నేహము బంధించినది
జ్ఞాని పాణిగ్రహణము ప్రాణ నిష్క్రమణ పరీక్షయైనది
నిశ్చింతగ అందరు జోతల జ్యోతిని చేరినారుగా
శివసాయుజ్యమును పొందగ స్నేహము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
తమిళవైశాఖి మూలా నక్షత్రము పరమ పవిత్ర మురుగ నాయనారు గురుపూజా పుణ్యతిథిగా కీర్తించబడుతుంది.చోళరాజ్యములోని తిరుపుగలూరులో ప్రతిక్షణము శివ పంచాక్షరిని జపించుచు ,సుగంధ పరిమళ సుమములను సేకరించుచు,అందమయిన మాలలుగా అల్లుచు,మూడు పూటలా శివుని మూరల కొలది పూలమాలలను స్వామికి సమర్పించుచు,సంతసించుచుండెడి వాడు.పశుపతి నాయనారుకు స్నేహపాశమును బిగించ దలచి,జ్ఞాన సంబంధారును తిరుపుగలూరుకి రప్పించి,నాయనారు ప్రాణ మిత్రుని చేసెను. పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు,శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచు భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు.కాలగతిలో ఋతువులతో పాటు మానవదశలు-ఆశ్రమములు మారుట సహజమే కదా. తిరుజ్ఞానుకు కళ్యాణము నిశ్చయమైనది.కళ్యాణమునకు వివాహము.శుభము అను రెండు అర్థములు కలవు కదా.స్వామి లీలలు అర్థముచేసికొన గలమా? వివాహ నిమిత్తము స్నేహితుడుగా{ తోడుగా ఉంటు మేలుకోరువాడు కద స్నేహితుడు! ఆలయమునకు వచ్చిన వారిని జీవన్ముక్తులను చేయాలనుకున్నాడు ఆ లయకారుడు.కన్నుల పండుగ గా జరిగిన కళ్యాణ మహోత్సవము,వారి మానవ శరీర ధారణకు భరత వాక్యమును పలికించబోతుంది.కైవల్య కాలము కనికరించి వధూవరులను,మురుగనాయనారును అగ్నిప్రవేశముచేయమని ఆదేశించినది.పెరుమానం లోని ప్రాణ స్నేహితుని పరిణయము పరమపద సోపానమై,పరమేశ్వరసన్నిధికి చేర్చినది.శాప విముక్తులైనారు ఆ శివభక్తులు.శివోహం-శివోహం.,ఆలయమునకు వచ్చిన వారిని జీవన్ముక్తులను చేయాలనుకొన్నాడు..తక్షణమే జ్యోతులుగా స్వామిని చేరుకున్నారు.వారికీర్తిని చిరస్థాయి చేసిన ఆ నర్తనప్రియుడు మనలనందరిని రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.)

CHERAMAAN NAAYANAAR



" ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు"
ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన
మనసులో సంతసము కనుల జారు విధాన
కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ
ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.)
చిదానందరూపా-చేరమాన్ నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు
తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు
పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె
పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె
రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె
విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె
తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ
తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివుని ఆదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గోల్ పోరయాను తపోదీక్షను కోరి రాజ్యమును విడిచివేసెను.వారసులు లేనందునప్రజలు మన నాయనారును రాజ్య పాలన చేయమని వేడుకొనగా శివాజ్ఞగాభావించి, స్వీకరించి సుభిక్షముగా నుండునట్లు పరిపాలించుచుండెను.
చేరమాను శ్రద్ధాభక్తులకు మెచ్చి, సుందరేశుడు తనశిష్యుడు బాణాపతిరారు ద్వారా ఆశీస్సులను పంపాడు.మనో వాక్కాయ కర్మలను నటరాజార్పణము చేసిన నాయనారును కనకసభనుండి తన మువ్వల సవ్వడితో ఆశీర్వదించెడివాడు.ఒకరోజు మువ్వల సవ్వడి వినిపించలేదు.స్వామికి అపచారము జరిగినదేమో అని చింతించుచున్న నాయనారుతో స్వామి,తాను తన మిత్రుడు నంబి అరూరారు సంకీర్తనములో మైమరచి మువ్వలసవ్వడిచేయుటలో ఆలస్యము జరిగినదని చెప్పగానే కుదుటపడ్డాడు.
తనలో లీనముచేసుకోవాలనుకొన్నాడు.దానికి లీలగా సుందరారుని పిలిచి,చేరమాను సుందరారును అనుసరించునట్లు చేసి కైలాసమునకు రప్పించాడు కాని దేవుడు వరమిచ్చినా పూజారి కూడా ఇవ్వాలి అన్నట్లు ద్వార పాలకులు నాయనారును అడ్డుకున్నాడు.వడ్డించేవాడు మనవాడైతే విస్తరి ఎక్కడ వుంటేనేమి అన్నట్లు పరమేశ్వరుడు తన వాహనమైన కరుణా వీక్షణముతో తనదగ్గరకు పిలిపించుకొని లాలించినట్లు మనలందరిని లాలించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

SUMDARAARU NAAYANAARU

పిత పిరాయి సూడి."
చిదానందరూపా- సుందరమూర్తి నాయనారు
*******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
హాలాహలధరుని సఖుడు అలల సుందరారు
సదయ-ఇసయల సుతుడు ఇలను పేరు అరూరారు
నరసింగ మానై ఇంట పెరుగుచు,నగజపతిని నమ్మి కొలుచు
అల్లుడితడని పెండ్లిచేయ నందకవి సుందరారుని పిలిచె
తానొకటి తలచినవేళ దైవము వేరొకటి తలచు అని అన
తాళికట్టనీయకనే తగవుగ వానిని తన బానిసనియెగ
పితకు బానిసననియున్న పత్రము పెద్ద విచిత్రమునే చేసెగ
పినాకపాణి కృపనుపొందగ పిత అను పిలుపు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
నవ విధ భక్తులలోనిదైన సఖ్య భక్తితో శ్రీకృష్ణుని కొలిచినది కుచేలుడైతే,పరమేశ్వరుని కొలిచినది సమయాచారపరుడైన సుందరారు నాయనారు.జగద్రక్షణార్థము కేవలము 18 సంవత్సరములు మానవ శరీరమును ధరించిన మహా జ్ఞాని.క్షీరసాగర మథనమునందు జనించినహాలాహలమును తన అరచేత ధరించి పరమేశునకందించుటచే హాలాహల సుందరారు అని,కాల క్రమేణ అలల సుందరారు అని కీర్తింపబడుచున్నాడు.
సుందరారు మానవ శరీరమును ధరించుటకు రెండు కారణములను పెద్దలు ప్రస్తావిస్తారు.
1.కైలాసములో నున్నప్పుడు శివపూజకు పూవులను సేకరించు సమయమున,అక్కడకు పూలనిమిత్తమువచ్చిన పార్వతీదేవి చెలికత్తెలైన,కమలిని-అనిందితిని అను వారిని క్షణకాలము మోహదృష్టితో చూచినందులకు ఆగ్రహించినఆదిదేవుడుమానవుడై పుట్టి వారిని మనువాడమనుట.తప్పు తెలిసుకొని శరణువేడిన సుందరుని చూసి,శంకరుడు సాప పరిధిని తగ్గించుట.
2 రెండవది బాహ్యమునకు శాపము కారణమైనప్పటికిని,తద్వారా సుందరారు కీర్తనలను-కీర్తిని లోక పూజ్యము చేయుటకు అనుగ్రహము ఆగ్రహ మేలిముసుగును ధరించి మేలుచేసినది.
ఓం నమః శివాయ.
తిరునావలూరులో సదయ నాయనారు-ఇసయజ్ఞాని నాయనారులకు దైవానుగ్రహము వలనపుత్రుడుగా జన్మించిన సుందరారు నామధేయము నంబి అరూరారు
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం సమార్పణం'
అటువంటి ఏకబిల్వమే సదయ-ఇసయ-సుందర నాయనార్ల కుటుంబము. .
సుందరారు తాళికట్టు సమయమునకక్కడికొక పిచ్చివాడు చేతిలో ఒక పత్రముతో వచ్చి, పెండ్లిని అడ్డుకొనెను.వాని చేతనున్నపత్రమును పెద్దలకు చూపిస్తు,వీడు నా బానిస కనుక నేను వీడిని నాతో తీసుకొని పోతాను అని చెప్పెను.సాక్ష్యమైనపత్రమును చదువగా అందులో " నేను పితకు (పిచ్చివానికి) వాని వంశమువారికి బానిసనని త్రికరణగా అంగీకరిస్తున్నానని వ్రాసి,సుందరారుచే సంతకము చేయబడి ఉన్నది.సంతకము సరిపోవుటతో చేయునదిలేక వారు పెండ్లికొడుకును తనతో తీసుకొనిపోవుచున్న పిచ్చివానిని వాని ఇల్లుచూపమని వెంబడించిరి.కొంతదూరము సాగిన తరువాత వారిరువు గుడి దగ్గర అదృశ్యమైనారు."ఓం నమః శివాయ."
" నా మనసంతా నిండె శివ పదమె
గురువై నడిపించె శివ పథమే' అని కీర్తించుచున్న సుందర నాయనారును ఆనందపరచుచున్న ఆ మహాదేవుడు మనందరిని శివ పథము వైపు నడిపించును గాక.
( ఏక బిల్వం శివార్పణం)

SADAYA NAAYANAAR



" నమే మృత్యుశంకా నమే జాతి భేదా
పితా నైవ నేనైవ మాతాన జన్మ
న బంధుః నమిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూప శివోహం శివోహం."
చిదానందరూపా-సదయ నాయనారు.
******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
సదయ నాయనారు సదాశివుడనుటయే సత్యము
అగణిత భక్తిప్రపత్తుల ఆరాధన అనునిత్యము
సుదతి-సుతుడు-సృష్టియు శివకుటుంబీకులే అని అను
సుతుని దత్తతనిచ్చియు శివాధీనమే తాను అను

చింతను దరిరానీయక సంతసమున తానుండును
చిదానంద సరస్వతిచే సంతత వినుతులనందును
గతజన్మపు ఘనతలు తోడుగ గణనీయతనొందగ
అగణిత గుణ సంపన్నుని సుందరారును మనకందీయగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

" మాతాచ పార్వతీ దేవి-పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్త్యాశ్చ స్వదేశో భువనత్రయం"
శెళిక్కర్ అందించిన పెరియ పురాణము ప్రకారము ఆదిసైవుదైన అరూరారుకు దైవానుగ్రహముగా జన్మించినవాడు సదయ నాయనారు.తిరుమురైవడిలోని సదయ నాయనారు ధర్మపత్ని ఇసయజ్ఞాన నాయనారు.దైవాంస సంభ్హొతురాలు.వీరు వీరి కుమారుడు సుందరారుల నాయనార్ల కుటుంబము శివుని అత్యంత ప్రీతిపాత్రమైనది.
వీరి ఔన్నత్యమును మరింత ప్రకటింపబడుటకై సదాశివుడు తేజోవంతుడైన సుందరారును,రాజైననరసింగ మునైయార్ దత్తతస్వీకారమును అడుగగా,
" అంతామిధ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువునిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెందక....
...........................పరమసంతోషముతో అంగీకరించి సంతోషముగా అప్పగించి,ప్రశాంతముగ పరమేశ్వర ధ్యానమునకు ఉపక్రమించెను.నిశ్చల భక్తి తత్పరతచే నిటలాక్ష సాయుజ్యమునొందిన,సదయ నాయనారు సత్కథా పఠనము మనందరిని సదాశివుని కృపకు పాత్రులను చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

KOTTALI NAAYANAAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."
చిదానందరూపా-కోట్టలి నాయనారు-31
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి
గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి
నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల
తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల
శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను
వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను
తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ
భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ
చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు.
అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులతో శివుని చేరిన ధన్యాత్ముడు.
ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది అని తెలిసిన నాయనారుకోత్తిలి నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి కలుగకుండ చూడమని అన్న పూర్ణేశ్వరుని అర్థించేవాడు.
ఆదిదేవుడు ఆ నాయనారు భక్తి-ప్రపత్తులను లోకవిదితము చేయాలనుకున్నాడు.రాచ కార్యమును కల్పించి,రానున్న ఫలితములను దరహాసముతో చూస్తున్నాడు.స్వామి కార్యము స్వకార్యమునకన్న ఒక మెట్టెక్కినది.అజ్ఞాబద్ధుడైన నాయనారు అన్న ప్రసాదమునకై ధాన్యపురాశులను అయినవారనుకొనే తన బంధువులకిచ్చి,స్వామి దేవాలయములకు పంపించమని కోరి,ఊరు వెడలి వెళ్ళెను.కపర్దికి కావలిసినదదే కదా.క్షణాలలో కరువు కోరలు చాచి,బంధువులు మాట తప్పునట్లు చేసినది.స్వామికైంకర్యము స్వార్థ కైంకర్యమైనదని తెలుసు కొనిన నాయనారు తాళలేక,వారందరిని శివాపరాధమునకు,శిక్షగా తన కరవాలమునకు బలిచేసెను.
ప్రత్యక్షమై వారిని పునర్జీవితులను చేసి,నాయనారును కటాక్షించిన సదాశివుడు సర్వవేళల మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

SERUTTANAAY NAAYANAAR

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ
పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే"
చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు.
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు
సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు
కామేశుని ఆన కాన కాదనలేని విధంబున
కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున
లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ
హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక
అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి
ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.
భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-నయనము,రస-నాలుక(మకరందము) మకరందముతో తుమ్మెదలు ఝుంకార వినబడునట్లు చేయు పంచేంద్రియ ప్రతిరూపములైన పూలు, తాము పంచ భూతేశ్వరుని పాదపద్మలయందు నిలిచి పరవశించాలనుకొనుట సమంజసమేకదా.
" ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మని రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలె హరు సేవకు
పొద్దు పొడవకముదె పూలిమ్మని."
అంటూ ఉదయముననే శేరు తునాయ్ నాయనారు పరమభక్తితో పూలమాలలల్లి పరమేశ్వరార్పితము చేసి పరవశించేవాడు. పొన్న-పొగడ-జిల్లేడు-తుమ్మి-ఉత్తరేణి-చెంగల్వ-మందార మొదలగు పుష్పములతో కాని,తత్ ఋతు పుష్పములతో గాని పరమేశుని అర్చిచిన సహస్ర గోదాన ఫలితము తథ్యమని నమ్మువాడు శేరుతనాయ్ నాయనారు,పార్వతీదేవియే చెప్పినదని పలు సుగంధపుష్పములను( అనాఘ్రత పుష్పములను) మాలలల్లి,మల్లేశుని అలంకరించి పులకరించేవాడు.తిలకిస్తున్న స్వామికి చిలిపి ఆలోచన వచ్చింది.రాణిని కథావస్తువు
చేసి,కథను ముందుకు నడిపించాడు . రాణినాసిక తాను ఏమి ఆశించిందో ఏమో,పుష్ప సుగంధమును ఆస్వాదించకుండా ఉండలేకపోయింది.పరిసరములను గుర్తించలేని పరవశముతో పూసువాసనను పీలుస్తు,నాయనారు కంట బడింది.కాలరుద్రుడైనాడు నాయనారు,రాణి ముక్కును కోసివేసాడు.కేకలు వినిన రాజు,జరిగిన విషయము తెలిసికొని,ఆ పూవును నాసికకు అందించిన చేతిని నరికి,జరిగిన అపరాధమునకు మన్నించమని శివుని వేడుకున్నాడు.
కరుణాంతరంగుడైన సాంబ శివుడు కటాక్షించి వారిని ధన్యులచేసెను.మరల మరల పుష్పించునట్లు చేయుట అనగా కరుణను మరల మరల వర్షింప చేయుటయే కదా.అట్టిపరమేశ్వరుడు మన హృదయములను అనాఘ్రాణిత సుమములను చేసి,ఆశీర్వదించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

KALIKAMBA NAAYANAR

" చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగ తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు."
చిదానందరూపా-కలికాంబా నాయనారు
*******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కపర్ది భక్త విధేయుడు కలికాంబా నాయనారు
కడుభాగ్యము కలిగినదని కల్మషమెరుగక కొలుచువాడు
వానిభక్తి పరీక్షించ తలిచాడు పరమేశుడు
వాని పూర్వ సేవకుని అతిధిగా పంపించాడు.
తన-పర భేదమును మరచినాడు తన్మయత్వములోన
అతని భార్య సేవకుడని అతిధిపూజ చేయలేదు
అమాంతముగా ఆమెచేతులు నరికి తనపూజను కొనసాగించాడు
అహమును తొలగించుటకు అవిటితనము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
" సభాభ్యో సభాపతిభ్యో నమోనమ:" సభను నిర్వహించేవాడు-సభాసదులు రెండుగా మనకు తోచు చున్నను రెండింటిలో నున్న వాడు శివుడొక్కడే అని నమ్మి కొలుచువాడు పెన్నగడం లోని కలికాంబ నాయనారు.ఆయన ధర్మపత్ని కూడ పరమ శివభక్తురాలు.అనుకూలవతి.
నంది-భృంగి తన ద్వారపాలకులుగా సేవిస్తుంటే, తాను బాణుని శోణపురికి కాపరిగ ఉన్న పరమేశుని లీలలు పరమ మనోహరములు."విశ్వేభ్యో-విశ్వ పతేభ్యో" అయిన సామి తన లీలను పునర్వ్యక్తీకరించుటకు పావులను కదపసాగాడు.మహామాయ కలికాంబ మదిలోని విజ్ఞతను కప్పివేసింది హృదయ రాజీవము రజోగుణ పూరితమైనది..కపిలేశ్వరుడు కదిలాడు నాయనారు ఇంటిలో పనిచేసి మానేసిన సేవకుని ఆకృతిలో.రసవత్తరమైన ఆట మొదలైనది.అతిధినిసేవిస్తూ అమితానందమును పొందుతున్నాడు నాయనారు.కాని అదేమి చిత్రమో యజమానురాలినన్న భావము సామ్రాజ్యమేలుచుండగా అతిథిని, సేవకుడిగా గుర్తించి,సేవకుని అర్చిచుటకు అహము అడ్డుగోడగా మారింది.ఈశ్వరభావము ఆమె కన్నులకు ఇసుమంతైనను కలుగనీయలేదు అమెలో ఆ మూడు కన్నుల వాడు..కలిగితే కథ మరోలా ఉండేది కదూ." బుద్ధిః కర్మానుసారిణి" అని అంటారుకదా.భర్త మాటను పెడచెవినిపెట్టి, శివభక్త పూజలో పాల్గొనలేదు.కమలాక్షునర్చించు కరములు కరములు-చేయనప్పుడు అవి నిష్ప్రయోజనమేనని తక్షణమే ఆ చేతులను నరికివేసి తన పూజను కొనసాగించెను నాయనారు. నిశ్చలభక్తికి సంతసించి నాయనారు దంపతులను అనుగ్రహించిన నాగాభరణుడు మనలనందరిని అనుగ్రహించుగాక.
(ఏక బిల్వం శివార్పణం.).

POOGAL CHOLA NAAYANAAR

" నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః."
చిదానందరూపా-పూగళ్ చోళ నాయనార్-22
కలయనుకొందునా నిటలాక్షుడు కలదనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పూగళ్ చోళరాజు పాశుపతేశ్వర స్వామిభక్తుడు
కరూరు రాజులను సామంతులుగ చేసిన కార్యదక్షుడు
మనసు వజ్రకఠినము రాజ్యధిక్కారమునకు
కప్పము కట్తలేదని ఆడిగళ్ కోటను ముట్టడి చేసెను
ఆ మనసే పుష్ప కోమలము శైవ సత్కార్యములకు
పూజించెనుగ ఎరపాతు నాయనారును పెద్దమనసుతో
ఖండిత శత్రుతలలలో శివ భక్తుని శిరము కానబడియెగ
ఖండోబాకు ఆత్మార్పణమంటు అగ్నిప్రవేశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
పూగళ్ చోళ నాయనారు చోళదేశములోని ఉరైయూరు రాజు,రాజధర్మమును సమర్థవంతముగా నిర్వర్తించుచు,శివుని-శివభతులను పరమప్రీతితో సేవించేవాడు.చోళ నాయనారు తనసామంతురాజైన ఆదిగల్ తనకు కప్పము కట్టలేదని తన సైన్యమును దండెత్తమని ఆదేశించెను కాని శివభక్తులకు హానిచేయవలదని సూచనను ఈయలేదు.వారు రాజాజ్ఞగా దండెత్తినంతనే ఆదిగన్ భయపడి వెన్నుచూపెను.మిగిలిన సైన్యముతో పోరి వారిని వధించి,తమ రాజు సంతసించునని ఆదిగల్ ధనరాశులను,చంపినవారి శిరములను తీసుకొని వచ్చి చోళ నాయనారు ముందుంచారు.
రాజు ధర్మపాలనకు శివభక్త లాలనకు మధ్యన గలమర్మమును జగద్విఖ్యాతముచేయాలనుకున్నాడు .తెచ్చిన తెగిన శిరములలో , విబూది రేఖలతో ప్రకాశించే ఒక శివభక్తుని శిరమును చూసి హతాశుడైనాడు.అయ్యో ఎంత ఘోరము జరిగినది.
"కిం వా‌உనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
ఙ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్"
ఓ పరమేశా!నా అజ్ఞానమును క్షమించుము.గుర్రములు-ఏనుగులు-సైన్యము-రాజ్యము మొదలగు అశాశ్వతములను మోహించి,నీ ఎడ ఘోర అపరాధమును చేసితిని.పశ్చాతపుడై ఒక బంగరు పళ్ళెమునందు ఆ పవిత్ర శిరమును పెట్టి,దానిని తన తలమీద అత్యంత భక్తిశ్రద్ధలతో పెట్టుకొని,శివ పంచాక్షరి మంత్రమును జపిస్తు అగ్నిప్రవేశము చేసిన ఆ నాయనారుకు ముక్తినొసగిన ఆ కార్తీక దామోదరుడు మనందరిని అనుగ్రహించుటకు అనురక్తిని చూపును గాక.
( ఏకబిల్వం శివార్పణం.)

KANCHAARA NAAYANAR

" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ."
చిదానందరూపా-కంచార నాయనారు
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కంచార నాయనారు చోళదేశ సేనాపతి
శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది
యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె
దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును"
విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె
విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె
సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా
కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు.
" ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు."
భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుటకు ముందుకొచ్చాడు ఆ నందివాహనుడు. జడలు కట్టినకొప్పును అలంకరించుకొన్నాడు. ఓం కపర్దినేచ నమో నమ: అంతటితో ఆగక కొన్ని కేశములను యజ్ఞోపవీతమును చేసుకొని అలంకరించుకొన్నాడు,నమో వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని సన్నుతులందువాడు.ఒక మహావ్రతుని రూపుదాల్చి నాయనారు ఇంటికి వేంచేశాడు.మహదానంద పడిన నాయనారు శివుని పూజించి,తనకుమార్తెను పిలిచి సాధువుకు నమస్కరించమని స్వామి దీవెనలు అందుకోబోతున్న తన బిడ్డను చూసి దొడ్డ సంబరమును పొందాడు." ఆనతి నీయరా శివా" అంటు మైమరచిపోయాడు.
కపర్డిగా వచ్చిన సాధువు ఆశీర్వచనమునకై వంగిన వధువు కబరీ బంధమును (కేశ సంపద-జడ) చూసి తనను తాను వ్యుప్త కేశుడిగా (కేశములు లేని వాడిగా) భావించుకొని,నాయనారుతో అమ్మాయి కేశ సంపదను తాను మోహించానని,దానితో పంచవటిని నిర్మించుకుంటానని,
కనుక తనకు ఇయ్యమని కోరాడు."శివ శివ! అమంగళము ప్రతిహతమగుగాక"!. ధూర్జటి చెప్పినట్లు అన్నీ తన దగ్గరనే ఉన్నను ఆత్మార్పణశక్తిని పరీక్షించుచు మైమరచిపోతుంటాడు ఆ జడల రామలింగేశ్వరుడు..ఏ మాత్రము ఆలోచించకుండా తక్షణమే కోసి, దానిని శివార్పణము చేస్తూ "జటాజూట ధారి-శివా చంద్రమౌళి,నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష అని ప్రార్థించిన మన కంచార నాయనారు కుమార్తెను దీర్ఘ సుమంగళిగా దీవించిన ( ఆమె కేశపాశము తిరిగి వచ్చేసింది) జటలలో గంగమ్మను బంధించిన భోళా శంకరుడు మనలందరిని తన కరుణతో బంధించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.) .

TIRUNAALAI POEVAR NAMDANAAR NAAYANAAR

" నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!"
చిదానందరూపా-తిరునాలై పోవార్ నాయనారు
******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరునాలై పోవార్ నాయనారు తిరిపమెత్తువాని భక్తుడు
"గీతం సమర్పయామి" అంటు సంగీత సామాగ్రినిచ్చెడివాడు
తిరువంకూరల్ శివదర్శనమునకు అడ్డమైనది నందివాహనము
శిరముని వంచి ఆదర్శమైనది విడ్డూరముగ నందనారుకు
తిరునాలైపోవార్ అనగా రేపువెళ్ళువాడు అని అర్థము
శివయానై వెళ్ళెను చిదంబరమునకు కనకమహాసభ దర్శనార్థము
చిన్నకులమువాడన్న వాదును చెరిపెను,శివ కులములోనికి చేర్చెను
అగ్నినేత్రుని జ్యోతిగ కొలువగ అగ్నిస్నానమె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
కులము అనే పదమునకు నాలుగుగా పనిని బట్టి విభజించిన విభాగము గాను,సమూహముగాను మనము అన్వయించుకుంటే మహాశివుడు అన్ని విభాగములలోను,అన్ని విభాగ సమూహములలోను స్థూల-సూక్ష్మ రూపములలో నిండియున్నాడనుటకు నిదర్శనమే కదా పరమ భక్తాగ్రేసర నందనారు పుణ్య చరితము.విచక్షణ మరచిన పెద్దలు అంటరానితనమను ముద్రను తగిలించినను, తగవులాడక, అనేక శివ క్షేత్రములను తన్మయత్వముతో దర్శించుచు,"శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణిః" అను శ్రుతిని అనుసరించి,తన స్వామిని ఆరాధిస్తున్న నాగులకువానిని ఆదరిస్తున్న స్వామికి సంగీతము ఎంతోఇష్టమైనది కావున దేవళములలో భేరి-మృదంగము-వీణ తీగెలు మొదలగు సంగీతోపకరణములను సమర్పించి పులకించిపోయే వాడు.
చిక్కబడ్డ భక్తి చక్కదనమును తెలియచేయాలనుకున్నాడు ముక్కంటి.తిరువంకూరులోని స్వామి దర్శనాభిలాషను కలిగించాడు నాయనారుకు."విఘ్నేశ్వరును పెళ్ళికి అన్నీ విఘ్నాలే" అన్నట్లు స్వామిని చూడాలంటే నంది అడ్డముగా నిలిచినది. పరితప్తుడైన తన భక్తుని ధ్యానమునకు మెచ్చి,క్షిప్త ప్రసాదుడైన (త్వరగా అనుగ్రహించేవాడు) స్వామి పరీక్ష చాలనుకొని,నందిని కొంత పక్కకు తొలగమన్నాడు.తన సర్వస్యమైన స్వామి ఆనను,అనుగ్రహముగా భావించి,కొంచము పక్కకు వంగినది నంది వాహనము. నంది వంగుటకు కారణమైన తిరునాలై నందనారుగా ప్రసిద్ధికెక్కాడు.ఓం నమః శివాయ.
కాలాతీతుడైన శివుడు కాల చక్రమునుతో తోడుగా కోరికలను చట్రములను బిగించి తిప్పుతుంటాడు.అదే జరిగింది మన నందనారు విషయములో." సంఙా రంభ విజృంభితుడు " ఆ సదా శివుడు.కనకమహా సభలో నాట్యమును చూడాలనే కోరిక బలీయము కాసాగింది నాయనారుకు.కులవ్యవస్థ అంతరార్థమును తెలియని అపార్థము పడగ విప్పింది .నందనారు అడుగులను కదలనీయలేదు.తిల్లై బ్రాహ్మణ వర్గముగా మారి వీల్లేదంది.ఘటనాఘటన సమర్థుడు అగ్ని నేత్రుడు నందనారును అగ్ని పునీతునిగా అనుగ్రహించ దలిచాడు.
అగ్ని ప్రవేశమును చేసిన నందనారుని విభూతి రేఖలతో,యజ్ఞోపవీతముతో,జుట్టు ముడితో ,వినూత్న తేజవంతుని గా ఆశీర్వదించిన ఆ సుందరేశ్వరుడు మనలనందరిని పునీతులుగా చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

TIRU NAVUKKARUSARU



" గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం 
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్"
చిదానందరూపా-తిరునవుక్కరసారు.
****************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
మనసులోని చీకట్లను తరిమేసే మరుల్ నీకియారు
అచంచల భక్తులలో అతనికెవరు సాటిరారు
వ్యాధి దరిచేరి అప్పారును రాజధిక్కారిగ మార్చినది
కఠిన శిక్షరూపమై బండతో పాటుగ కడలిలో ముంచినది
తేవారములే నాయనారును కడతేర్చే పరిహారములైనవి
పశ్చాత్తాప పల్లవ గుణభారవీహారముగా మార్చినది
తిరువాయుమూరుకు తిరిపెమెత్తువాడు రమ్మనుట
వాగీశనాయనారు ముక్తికి వ్యాధియే కారణమగుట
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చుగాక.
మరుల్ నీకియారు అనగా చీకట్లను పారద్రోలేవాడు.భావి సూచకముగా తండ్రి సార్థక నామధేయుడవుతాడని ఆ పేరును పెట్టారేమో.తల్లితండ్రులను కోల్పోయిన బాలుని అక్క తిలకవతి తల్లియై సాకింది.తిలకవతి శివభక్తురాలు.తమ్ముడు శివుని నమ్మకపోయినా శివ వైభవములను నిరంతరము చెబుతుండేది.మరుల్ నీకియారు శివ దూషణ చేస్తూ మూర్ఖ వాదనలను చేసేవాడు.ఇలా వుండగా శూలవ్యాధిసోకి ఎంత ప్రయత్నించినను తగ్గలేదు.నిరాశతో కృంగిన నాయనారు పశ్చాత్తాపముతో పరమేశుని పాదములను పట్టుకున్నాడు
. "భువంతయే వారివస్కృతాయౌషధీయాం పతయే నమో నమః"
సర్వ వ్యాధులను హరించు భిషక్కు (వైద్యుడు) పాదము పట్టిన వ్యాధిని ఉపశమింపచేశాడు.
స్వామి కరుణను పొందిన నాయనారు అతిశయ భక్తితో తేవారములను కీర్తించుటను విని ఆకాశవాణి నాయనారును "తిరునవుక్కరసారు గా కీర్తించినది అనగా మధురమైన వాక్కు గలవాడు అని,వాగీశుడిగా కీర్తింపబడతాడని దీవించింది.
కటాక్షించిన సామియే కఠిన పరీక్షను తలపెట్టినాడు.రాజోద్యోగులు మహరాజుకు నాయనారును అపరాధిగా,రాజద్రోహిగా చిత్రిస్తూ చాడీలు చెప్పారు.రాజు విచారనకు రమ్మంటే తిరస్కరించేటట్లు చేసాడు ఆ తిక్క సంకరుడు.కోపించిన రాజు రాజాజ్ఞ ధిక్కారమునకు శిక్షగా గుదిబండకు నాయనారును కట్టి సముద్రములో పడవేయమన్నాడు.వారు శిరసావహించారు.శివ శివ నీ లీలలు ఎంచ నేనెంతవాడిని.సంసారపు గుదిబండనుండి నన్ను విముక్తుని చేయదలచావా అంటు సాంబశివుని ప్రార్థించాడు.క్షిప్ర ప్రాది కరుణతో చవి పుష్పమయ్యింది .పూలపడవ గా మారిపోయింది. పల్లవ రాజును శివ భక్తుని చేసినది.నాయనారును ఆశీర్వదించిన ఆ సదాశివుడు మనందరిని ఆశీర్వదించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

GUGGILAM KALASA NAAYANAR

" దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం
ధూపం దాస్యామితే దేవా గృహాన పరమేశ్వర."
చిదానందరూపా-గుగ్గిలము కలశ నాయనారు.
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కాముని చంపినవానికి చేయు ఆ గుగ్గిలపు సేవ
క్షామమునింపగ ఇంటను,తినుబండారములను
చేకొని రావగ,చేత తాళితో శివ శివ అనుచు,భక్తి
నిగ్గుతేల్చగ కదిలెను ఆ, బుగ్గిపూతలవాడు
గుగ్గిలమునమ్మువానిగా బిగ్గరగ అరచుచు, సమీపించగ
మొగ్గును చూపి కలయ, గుగ్గిలమంతయు పొందె తాళితో
లింగము వంగిన వేళను, తాళక తనమెడ ఉరిబిగించె
స్వామి ఆలింగనమును పొందగ ఆ గుగ్గిలము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతను తీర్చుగాక.
సంబరేను చెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చిచు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు.
దేవతలు అసురులు అమృత కలశముతో తిరుక్కడవూరికి వచ్చారట.ఆ కలశమును నేలపై ఉంచి ,స్నానము చేయుటకు నదికి వెళ్ళి వచ్చు సరికి ఈశ్వరేచ్చగా ఆ కలశము లింగముగా మారిపోయినదట.మార్కండేయుని మృత్యుంజయుని చేసిన అభిరామాదేవి సహిత అమృతేశ్వర స్వామి మనగుగ్గిలపు కలశ నాన్యనారుని భక్తిని మథించి లోకపూజ్యతను ప్రసాదించాడు.
సుగంధధూపములు దశాగంతో వేయబడునవి.జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములను సుగంధభరితము చేయుచు చేయు అర్చన ఆ నాయనారుది.తనభార్య మాంగల్యమును అమ్మి గుగ్గిలమును కొని దానిని స్వామికి అర్పించుచు పరవశించు శివ ధ్యానీ.పాలున్ బువ్వ యు పెట్టెదన్ అని ధూర్జటి ప్రస్తావించిన శివుడు వాత్సల్య లక్ష్మి లీలావచనములన్నట్లు నాయనారు కుటుంబమును సర్వైశ్వర్యములతో తులతూగునట్లు చేసినాడు.ఇదిలా ఉండగా నాయనారు భక్తికి పతాక సన్నివేశమన్నట్లు సద్యోజాతుడు గొడగూబ అన్న ఒక చిన్ని బాలికచేత ఒక తుమ్మిపువ్వునుంచి తనకు పెట్టమన్నాడు.లింగము చాలా ఎత్తుగానున్నది పాపకు అందదు.నింగిని తాకు జటలున్నవాడు కిందికి వంగి పువ్వును స్వీకరించాడు.లింగము వంగినదని దానికి ఇనుపగొలుసులు కట్టి ఏనుగులచే లాగించ సాగారు.ఉబ్బు లింగనికి దెబ్బ తగిలిందని,ఆగొలుసు తన మెడకు బిగించుకున్న గుగ్గిలపు నాయనారును అనుగ్రహించిన ఆ సదా శివుడు మనందరిని అనుగ్రహించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

ERIPATA NAAYANAR

"కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ"
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కనుగానక కమ్మిన మైకము హానిని చేయనీయక
పరశును చేతదాల్చి పరమేశుని భక్తుల సేవచేయు
తా చేసిన పాప-పుణ్యముల తడబడనీయక
చూసిన శివాపరాధమును చివాలున గొడ్డలి విసిరివేయు
ఏనుగు చేసిన ఘోరము ఎదకోయగ ఆ ఎరిపాతకు
ఏమరుపాటును సేయక ఆ కరినే తను హతమార్చెను
కామ సంహారుని కొలువగ తానును సంహారమునెంచు కొనియెగ
గజవదనుని తండ్రిని చేరగ గజమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అనగానే సర్వస్య శరణాగతికి వశుడై సిరికిం చెప్పకనే వచ్చినాడు గజప్రాణ రక్షణ ఉత్సాహముతో.ఇక్కడ అహంకారములేదు.అంతరించినది.కాని ఆ జాతికిచెందిన ఏనుగు అహంకరించి శివభక్తులను అహంకారముతో ఘీంకరించి,శివ భక్తులను తుదముట్టించినది.బుద్ధిః కర్మానుసారిణి అని కద సూక్తి.ఒక కరి రక్షింపబడినది.మరొకకరి శిక్షింపబడినది.ఇదియే పరమేశ్వర లీల.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు. శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రాజును రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.

POOSALAR NAAYANAR

మదాత్మనే గుణైకసింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ
నామశోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతరప్రధానబంధవే నమః శివాయ"
చిదానందరూపా-పూసలర్ నాయనారు-

కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
మానస మందిరమునకు మంచిముహూర్తమును ఎంచుకొని
శంఖుస్థాపన చేసెను మహనీయుడు పూసలర్ నాయనారు.
కావలిసిన హంగులనన్నీ మనమున సమకూర్చుకొని
మహేశ్వరుని మందిరమున నిలుపగ నిశ్చయించెను
కంచిలో రాజును కట్టించెను బృహదీశ్వరాలయమును
ఇరువురి సమయము ఒకటిగ చేసెను చిక్కుగ శివుడు
కథమారగా రాజుకు సర్వము అవగతమాయెగ
మదనాంతకు చేరగ మానసపూజయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
భక్తి ప్రకటితముగము-అప్రకటితముగను విరాజిల్లుతుంది.వింతలను చూపుతుంది.ప్రకటిత భక్తి పరమపదమునందిస్తుంటే అప్రకటిత భక్తి పరమాద్భుతముతో కూడిన పరమానందానికి పాత్రులను చేస్తుంది.గమనము వర్వరు దారులలో చేసినా గమ్యము మాత్రము ఆ పరమేశ్వరుని సన్నిధియే.మహా భారతములో పరమభక్తి తత్పరుడైన భీమిని అప్రకటిత భక్తిని అనురక్తితో అర్జుననకు తెలియచేసాడట పరమాత్మ.ఒకసారి అర్జుననకు గుట్టలు గుట్టలుగా హరినామస్మరణ చేస్తూ నిర్మాల్యమును ఎత్తిపోస్తున్నవారు కనిపించారట.అదిచూసి విస్తుపోయిన అర్జునుడు తనకంటే స్వామిని నిరంతరము కొలిచే ఆ భక్తుని గురించి ప్రశ్నించాడట.దానికి పరమాత్మ నవ్వుతొ నీ అన్నగారైన భీముడు చేయు మానసపూల పూజా నిర్మాల్యము అది అన్నాడట.వాసుదేవ నమోస్తుతే-వామ దేవ నమోస్తుతే.
పూసలర్ నాయనారు దివ్య చరితములో ఒకేరాజ్యములో, ఒకే దేవునిపై ప్రకటిత-అప్రకటిత భక్తి ఆదిదేవుని అర్చిస్తూ,ఆతని చిద్విలాస లీలను మకు అందచేస్తు తానును ధన్యమైనది.
పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు.మానసికోపాసన సమాధి స్థితిని,ఆత్మ దర్శనమును త్వరితము చేస్తుంది.పూసలర్ పరమేశ్వరునికి మందిరమును నిర్మింపదలచాడు.పైకము తగినంత తనదగ్గర లేదు.పరమేశ్వర సంకల్పమేమొ !మానస మందిర నిర్మాణమునకు పూసలారు మనమున అనుగ్రహ బీజమును నాటినాడు ఆ శివుడు.అది మొలకెత్తి పెద్దదగుటకు తన కటాక్షమను గంగను కురిపించినాడు.అనుకూలతకు అన్ని హంగులను సరంజామలను పూసలారు తాను సమకూర్చుకున్నానని భావించేలా చేశాడు.ఇంకేం మంచి సమయమున మానసికముగా శంఖుస్థాపన చేసి తనకు నచ్చిన విధముగా నందివాహన మందిరమును నిర్మించి,స్వామి ప్రతిష్ఠకు స్థిర ముహూర్తమును నిశ్చయించుకొని,స్వామికి విన్నవించాడు కరుణించి విచ్చేయమని స్వామిని పూసలారు.
అప్రకటిత భక్తి అనిశము ఈశుని సేవిస్తుంటే నేనున్నానంటు ప్రకటిత భక్తి పందెము వేస్తూ కాడపరాజు రూపములో కంచిలో బృహదీశ్వరాలమును బ్రహ్మాండముగా నిర్మింపచేసి,స్వామి ప్రతిష్టకు అదే ముహూర్తమును సుముహూర్తముగా నిర్ణయింపచేసినది.
పరీక్షపెట్టు పరమేశ్వరుడు వాడే- కటాక్షించు సర్వేశ్వరుడు వాడే ఆసక్తికరమైన ఆటను ప్రారంభించాడు.అభ్యర్థించిన తన భక్తుడైన రాజుకు స్వప్న సాక్షాత్కారమునందించి ముహూర్తమునకు రాలేని తన నిస్సహాయతను వివరించాడు.నిర్ఘాంతపోయాడు రాజు.మేల్కొని తాను పూసలర్ నాయనారు నిర్మించిన ఆలయమును దర్శించవలెనని తిరునినాపురమునకు వెళ్ళి పూసలారును దర్శించి శివలీలా విశేషములను కొనియాడుతూ చిరస్మరణీయులైన వారిని కరుణించిన సదాశివుడు మనందరిని కరుణించును గాక..
( ఏక బిల్వం శివార్పణం.) 

TIRUMOOLA NAAYANAR

" అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న వా బన్దనం నైవ ముక్తి న బంధః
చిదానంద రూపః శివోహం శివోహం."
చిదానందరూపా-తిరుమూల నాయనారు
**************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అగణిత భక్తితత్పరుడు అగస్త్యమహాముని దర్శనార్థము
అడుగులు వేయసాగె దక్షిణదిశగ,మార్గ మధ్యమున
కావేరి స్నానమాచరించి,దేవర సేవకు బోవుచుండగా
కాపరిలేడని గొల్లుమను గోవులమందను చూచె జాలిగా
సకలదేవతా సాధుజీవులకు సంతసమును తానందీయగ
ప్రాణములేకయున్న మూలరు కాయము ప్రవేశించెగ
చెట్టున పెట్టిన సాధుకాయము కనికట్టుగ మాయమాయె
పరమపదంబును పొందగ పరకాయ ప్రవేశమె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.
తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవులను దుఖః విముక్తులను చేయ దలిచాడు. ఆది శంకరుల వారిని స్మరించి,నిష్కాముడై తన శరీరమును చెట్టు తొర్రలో పెట్టి మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు. కాపరిని చూసి గోవులు సంతసించాయి.గ్రామమునకు తిరిగి వెళ్ళిన నాయనారు,కాపరి భార్య చింతనను ఆధ్యాత్మికత వైపు మళ్ళించాడు.రావి వృక్షము క్రింద తీవ్ర తపమును ఆచరించాడు.సమాధి స్థితిలో మూడువేల సంవత్సరాలుండి,సంవత్సరమునకొకసారి బహిర్ముఖుడై ఒక పద్యమును చెప్పుచు,మూడువేల పద్యముల "తిరు మందిరము"ను అందించిన తిరుమూల నాయనారును అనుగ్రహించిన సదా శివుడు మనందరిని అనుగ్రహించు గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

PASUPATI NAAYANAR

" న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం "
చిదానందరూపా-పశుపతి నాయనారు
**********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పశుపతి రుద్ర నాయనారు పుట్టెను తిరువరియూరునందు
పురుతశి నక్షత్రంబున గురుతర పూజలనందు
కంఠములోతు నీటను అకుంఠిత భక్తిని కొలుచువాడు
ఉత్కంఠత నిండగ నమక-చమకములను పలికెడివాడు
నమ్మిన భక్తిమార్గమున మూడు సంధ్యలను వందనములిడు
కమ్మని స్తవములు తెమ్మెరలై ముక్కంటి ముంగిటనుండు
లాలనచేయగ దలచి పశుపతి, పశుపతిని పిలిచెగ
నీలకంఠుని పొందగ కంఠపులోతు నీరు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
" గంగేచయమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలస్మై సన్నిధికురు."
అని భావిస్తూ శుద్ధోదక స్నానముతో తనలోని శివునిని,బాహ్యములోని శివునిని స్నానమును సమర్పించుటసనాతన సంప్రదాయము.
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియ శివః-అని ఆర్యోక్తి.సాక్షాత్ జల లింగమైన జంబుకేశ్వరునకు అభిషేకములు అవసరమా? ఆయన చల్లదనమునకువచ్చినలోటేమిటి?మంచుకొండ ఇల్లాయె! కట్టి పడేసిన గంగమ్మ కనుసైగ చేస్తే కదిలి ముంచేస్తుందాయె.యోగేశ్వరుని అల్లుకున్న యోగ సాస్త్రాలైనపాములు శీతలత్వముతో అనరతము సేవిస్తూనే ఉన్నాయాయె.అదియే శివ చమత్కారము.అగ్నినిమూడో కన్నుగా,హాలాహలమును కంఠాభరనముగా ధరించిన స్వామి నిత్యాభిషేకములను నిరతిశయ ప్రీతిని చెందుతాడనుట నిర్వివాదాంశము.నిర్హేతుక కృపను వర్షించు స్వామి తనను నీట ముంచిన భక్తులను, వారిలో నున్న శివునికై తాము నీటిలోమునిగి సేవించినను అదరముతో తనదరిచేర్చుకుంటాడనుటకు నిదర్శనమే పశుపతి నాయనారు.ఎంత నీరు తోడినను తిరిగి అదే మట్టమునకు చేర్చు తెల్లనేరేడులో దాగిన చల్లనైనస్వామి తన లోని భువన భాండములను అనిశము చల్లబరచుటకే అభిషేకములకు ఆనందపడతాడు కాని తన కొరకు ఏమీ కోరుకోడు అని గ్రహించిన పశుపతి తనలోని శివుడు,అతని లోని బ్రహ్మాండములు ఎప్పుడుచల్లగా ఉండాలని తాపత్రయపడేవాదు.శివ పూజగా కంఠములోతు నీటిలో మునిగి,నమక చమకములను అత్యంత భక్తితో పఠించెడి వాడు.
కూసిని నీళ్ళు పోస్తే ఖుష్ అవుతాడట శబ్బాషు శంకరుడు.(శ్రీ తనికెళ్ళ్ భరణి గారు.)తొండము నిండా నీళ్ళు నింపి ఆది-అంతము లేని ఆ శివునికరుణను పొందినది దంతి.చెంబును దొంగిలించుటకుచెంబులోని నీటిని అప్రయత్నముగా లింగముపై పోసినందులకు చేరినాడు దొంగ ఆ జంగమదేవరను.త్రి సంధ్యావందనములను చేసిన ఆ పశుపతిని ,తనలోని పశుపతికి నీటిని అందించినవానిని పాశ విముక్తుని చేసిన స్వామి మన సంసార పాశములను తొలగించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

IYARVAGAI NAAYANAR



" అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః 
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ."
చిదానందరూపా-ఇయర్వగై నాయనారు
*************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు
లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు
బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు
అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు
శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా
నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక
( ఏక బిల్వం శివార్పణం.)

ADIPATTA NAAYANAR

" మనో బుద్ధ్యహంకార చిత్తా నినాహం
నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రేః
నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపా శివోహం-శివోహం."
చిదానందరూపాఆదిపత్త నాయనారు
************************************
ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో
మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని
ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు
ఏమాయెనొ ఏమో మడుగున చేపలన్నియు వీనిని మాయదారి జాలరివాడు
మనలను కాపాడుకొందమనుచు మడుగువీడి పోవగా,రోజుకొక
మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక
భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ
పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ
తాత్సారముచేయక పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ
విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.
"పత్రం-పుష్పం-ఫలం-తోయం' వీనిలో దేనినైనా భక్తితో సమర్పిస్తే,పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తాడని పెద్దలు చెబుతారు.జలచరములైన జలపుష్పములను నిష్ఠగ సమర్పించి శివసాయుజ్యమును పొందిన బెస్త ఆదిపత్త నాయనారు."మత్స్య-కూర్మ-వరాహస్య-నారసింహస్య-వామన అన్న సూక్తినాధారముచేసుకొంటే ప్రళయానంతరము స్వామి ధరించిన మత్స్యావతారము అత్యంత మనోహరము.బాహ్యమునకు నాగ పట్టాణము దగ్గరనున్న నూలైపాడులో జన్మించిన ఆదిపత్త నాయనారు తాను పట్టిన చేపలలో ఒకదానిని క్రమము తప్పక శివనైవేద్యముగా నీటిలోని జారవిడిచేవాడు.సూక్ష్మమును చూస్తే హరిని సేవించి హరునికి దగ్గరగా చేర్చేవాడు.హరిహరతత్త్వమే ఆదిపత్త నాయనారు.
నిజ భక్తులను పరీక్షించుటయే నీలకంఠుని లీల.వరుసగ కొన్నిరోజులు ఆదిపత్త వలలో ఒకే ఒక చేప పడసాగింది.ఆహారమునుగురించి గాని,తనఆదాయమును గురించి గాని ఆలోచించకుండ నియమ ప్రకారము పడిన చేపను పరమేశ్వరార్పణము చేసేవాడు.పస్తులుండుటకుచింతించలేదు.పంతము అంతము చూడాలంటు త్రిపురాంతకుడు ఒకనాడు వలలో ఒకేఒక పసిడి చేపను పడవేసెను.ప్రలోభములను దరిచేరనీయకుండ
నిష్కళంక పూజగా దానిని పరమేశ్వరార్పణము చేసాడు నాయనారు.పరిణితి చెందిన భక్తిలో పరీక్షలకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా.ఏ వేదంబు పఠించె లూత ,ఏ వేదంబు పఠించె ఆదిపత్త నిను చేర నిశ్చలభక్తి సోపానమని తెలియచేసిన ఆదిపత్త నాయనారును మెచ్చి అనుగ్రహించిన ఆ ఆదిదేవుడు మనందరిని ఆనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

TIRUTONDA NAAYANAR



వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః
ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ 
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో "
చిదానందరూపా-తిరు తొండ నాయనారు.
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరు కురిప్ప తొండ నాయనారు నియమము
రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము
మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో
వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో
అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన
తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే
తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ
తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ
చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక.
తిరుకొరిప్పు తొండనాయనారు
వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు.స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రపరచుటకు అనుమతినివేడుకొన్నాడూ.తనకొకటే కౌపీనము ఉన్నందున(ధరించినది కాక) సంధ్యాసమయమునకు తన కౌపీనమును శుభ్రపరచి అందచేసెదెననిన అంగీకరింతునన్నాడు ఆ యోగి.సూర్య ప్రభల్తో చుర్రుమంటున్న వాతావరణమును చూసి,షరతుకు అంగీకరించాడు శివుడు.
" పవి పుష్పంబగు- అగ్ని మంచగు" అన్న ధూర్జటి మాట ప్రాపునకే కాదు పరీక్షకు కూడా నిజమే అవుతుంది. మన సక్కియనాయనారు రాళ్ళ పూజను పుష్పార్చనగా మార్చగలిగినది ఆ సదాశివుని కరుణయే కదా.ఉత్తర గర్భముననున్న పరీక్షిత్తుపై చేసిన దుష్ట ప్రయోగము మంటలు కక్కుతు అగ్ని వలె తాకబోవ పరమాత్మ తనలీలగా మంచుగా మార్చి శిశువునకు చల్లదనమును అందించెను కదా.విరోధాభాసమైన విశ్వేశ్వరుడు అదే విధముగా భానుని బాధ్యతను తొలగించి వరుణునికి వర్షించమన్నాడు.పరమేశ్వర లీలల పరమార్థమును తెలుసుకొనెననుట వెర్రిమాట.వజ్రము పువ్వుగా మారినట్లు శివుని లీలగా ఎండ వానయై కౌపీనమును తడిపేసినది.అన్నమాట నిలుపుకోలేదని తనతలను బండకు కొట్టుకున్న నాయనారును, అడ్డుకొని రక్షించిన అడ్డనామాలసామి మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...