అమ్మా!!! నన్ను మన్నించు.
************************
పదినెలల వ్యవధిలో,తన గర్భ పరిధిలో
పాపలా మారు నన్ను కనుపాపలా చేరుతూ
పుట్టగానే నన్నుచూసి ముసిముసిగా నవ్వావు
పదినెలల వ్యవధిలో నీ గర్భ పరిధిలో
రూపమే తెలియని నేను పాపగా మారుతూ
పుట్టగానే నిన్నుచూసి కసికసిగా యేడ్చాను
ముద్దొస్తూ పెరగాలని చనుపాలగా మారావు
యెద్దేవా చేశాను నా పాలబడ్డావని
నోరు కాలుతుందంటూ గోరుముద్ద పెట్టావు
నోరుజారి నేనేమో గోరుచుట్టువన్నాను
నిదురకై జోకొడుతూ జోలపాట పాడావు
చీదరగా చీకొడుతూ జోరీగవన్నాను
సుడిగుండములను దాటించగ ఈతగా మారావు
గుదిబండవని చాటుతూ రోతగా అన్నాను
కడుపులో తన్నినా,కడవరకు తన్నినా
చిలిపి చేష్టలన్నావు,చిరునవ్వే నవ్వావు
కల్లమాట కాదు,కానేకాదు వమ్ము
తల్లడిల్లనీదు నిజంగా నన్ను నమ్ము
మసక తొలగిపోయింది,అసలు తెలుసుకొమ్మంది
మాధవ నివాసమైన నీ మధుర గర్భవాసినై
తల్లీ తరియించనీ తరతరముల సాక్షిగా.
No comments:
Post a Comment