***************************
శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.రుద్రనమకము పరమాత్మ సర్వాంతర్యామిత్వమును,సర్వ సామర్థ్యమును వివరిస్తు విశ్వమే విశ్వేశ్వరుడు అను యథార్థమును సోదాహరణముగా మనకు వివరిస్తుంది.ఆ విషయము లోని మర్మమును అవగతము చేసుకోలేని మనము చేతులుచాచి చెంతకు చేర్చుకోవాలనే కరుణాంతరంగుడైన పరమాత్మను ఏమి అడగాలో,ఎప్పుడు అడగాలో,ఎందుకు అడగాలో,ఎలా అడగాలో తెలుసుకోలేని తమస్సులోనున్న మనలను కరుణించి,పరమాత్మ చమకము ద్వారా తానే మన బదులు అంతటా అవగతమవుతున్న పరమాత్మ అనుగ్రహమును ఆలంబన చేసుకొని,ఆధ్యాత్మిక సోపానములను అధిరోహించుటకు,మనము ఏమి అడగాలి,ఎప్పుడు అడగాలి,ఎవరికోసము/ఎందుకోసము అడగాలి,ఎలా అడగాలి తెలియచేయు వాత్సల్యమే చమకము.ఒకటి కాదు-రెండుకాదు,ఒకసారి కాదు-రెందు సార్లు కాదు,ఒక కాలమునకు కాదు విశ్వమంతయు విరాజమానమగుటకు అది కూడా,ఇది కూడా అహకాదు అలాకూడా,ఇలా కూడా,కాదు కాదు అప్పుడు కూడా/ఇప్పుడు కూడా,దానికి కూడా/దీనికి కూడా,నాకు కూడా/నా వంశమునకు కూడా ఇలా ప్రతి పదము తరువాత ఇంకా,ఇంకా,నాకు కావాలి అని కోరుటచే "చ" అని,నాకు కావాలి అని ప్రార్థించుటచే " మే" అని పదే పదే చమే ఆవృత్తమగుటచే చమకముగా ప్రసిధ్ధి చెందినది.జగద్రక్షకుని జాలిగుణమునకు చక్కని ఉదాహరణము.
అంతే కాదు.చమకం మనలోని ఇంద్రియశక్తిని జాగృతము చేసి,భౌతిక వస్తువుగా చర్మచక్షువులకు గోచరించు,పరికరమును చైతన్యవంతముగా మలచుకొను దార్శనికతను అందచేస్తుంది.
ఉదాహరణకు మన చర్మ చక్షువులు ఒక వెదురు గడను చూశాయనుకోండి.దానిని గురించి పెద్దగా పట్టించుకోము.కాని చైతన్యవంతమైన చక్షువు దానిని రూపాంతరముగా మలచుకొని ఉదాహరణకు ఒక నిచ్చెనగా మలచుకొని,ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే పరికరముగా ఉపయోగించకొనవచ్చును.కనుకనే,
" అగ్నా విష్ణో సజోష" అంటూ అగ్ని-విష్ణు నామము గల చైతన్యవంతమైన-+ శక్తులను ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది.
ఇక్కడ మనము ఒక్క విషయమును గురించి కొంచము ఆలోచించాలి.అగ్ని-విష్ణు అను నామములుగల రెండు దివ్య శక్తులను ప్రార్థిస్తూ సాధకుడు,వారిద్దరు కలిసి తమను అనుగ్రహించమనికోరుకుంటున్నాడని అంటున్నది చమకము.ఇవి స్వరూప నామములా-లేక స్వభావ నామముల.కేవలవ్యవహారిక నామములు మాత్రము కాదు.వారివి మంత్ర శరీరములు కాని మాంస శరీరములు కావు.వారు జాగృతమై వారి శక్తులను మనలోనికి,అనగా విశ్వములోనికి జాగృతము చేయమని వేడుకుంటున్నారు.
అగ్ని అంటే కేవలము నిప్పు మాత్రమేనా? లేక ఇంకేదైన గౌణ నామమా.పెద్దలు ఏమని వివరిస్తారంటే మనలో నిద్రాణమై యున్న కుండలినీశక్తిని జాగృతపరచి,అది పైపైకి ఎగబాకి సహస్రారమును చేరునటు చేసి, అమృత కలశమునకు చిల్లి చేసి, ధారలు పడునట్లు చేయాలి.
అప్పుడు విష్ణు అను మరొశక్తి(వ్యాపకత్వశక్తి) దానిని విశ్వమంతయు వ్యాపించునట్లు చేసి తేజోమయము చేయాలి ఈ పనిని ఈ రెండు శక్తులు పరమేశ్వరుని అనుజ్ఞచే, ఒకదానికొకటి సహకరించుకుంటూ చేయగలవు కాని విడివిడిగా కాదు.
వాజశ్చమే అను మొదటి కోరిక.వాచకార్థమును పరిశీలిస్తే అన్నము/ఆహారము.అన్నము ఉన్నంత మాత్రమున చాలదు.దానిని భుజించుటకు అర్హతయైన ఆకలి ఉండాలి.అంతే కాదు ఆ అన్నము పోషకత్వమును కలిగి యుండాలి.తినువారికి దానిని ఇష్టముతో తినవలెనను కోరిక కలిగి యుండాలి.అంతే కాదు అన్నమునుంచిన పాత్ర శుచియై ఉండాలి.అన్నమును మితముగా తినగలుగు ఇంద్రియ నిగ్రహము ఉండాలి.ఆస్వాదించగలుగు మనసు,అరిగించుకొనగలుగు శక్తి ఉండాలి.అంతే కాదు అన్నప్రదాతకు కృతజ్ఞతను తెలుపుకోగల ఇంద్రియశక్తిని పొందకలిగి ఉండాలి.అన్నము పుష్కలముగా లభించుటకు మనము యజ్ఞము చేయకలిగి ఉండాలి.
వాజశ్చమే
అన్నము ఇది పరబ్రహ్మ స్వరూపము.అన్నము అనగా బియ్యమును ఉడికించగా ఏర్పడిన పదార్థము మాత్రమే కాదు.
ప్రతి మనిషికి అన్నమయకోశము-ప్రాణమయ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన మయ కోశము-ఆనంద మయ కోశములుంటాయి. తైత్తరీయోపనిషత్తు - అన్నము వలనే భూతజనములు జనించుచున్నవై,జీవించుచున్నవని,
అన్నమే/ఆహారమే అన్నమయకోశములోనికి ప్రవేశించి ప్రాణముగా మారుచున్నది.మరల మరల ప్రవేశించుచు ప్రాణిని జీవింపచేస్తున్నదిచివరకు జీవికి ఈశ్వరత్వమును అందిస్తున్నది.
పరమాత్మ సృష్టించిన రుద్రులు మనకు అందించే ఆహారముద్వారా మనకు ఆరోగ్యము-అనారోగ్యమును మన కర్మ ఫలితములను అనుసరించి అందిస్తుంటారు.
యజ్ఞము అంటే హోమగుందములో చేసే క్రతువు ఒక్కటే కాదు.ఇంద్రియ యజ్ఞము-మానసిక యజ్ఞము నిరంతర నియమములతో చేయకలగాలి.
కనుక పరమాత్మ నా శరీర దారుఢ్యమునకు,మానసిక స్థితప్రజ్ఞతకు కావలిసిన వస్తువులను ఆలోచనలను అనుగ్రహించి,నా యజ్ఞము సమర్థవంతమగునట్లు చేయుము అని అభ్యర్థిస్తున్నాడు "యజ్ఞేన కల్పతాం" అంటూ పరమాత్మను పరిశుధ్ధమైన మనసుతో.ఇంకా మరెన్నో మంచి విషయములతో చమకముతో మమేకము అవుదాము.
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం
.
No comments:
Post a Comment