సౌందర్య లహరి-సీస ప్రాకారము
పరమపావనమైనది నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఊహాతీత విభవమైనది సీసప్రాకారము
అతిమనోహము మనసుకు ఆహ్లాదకరము
సౌరభ సంభరిత సంతాన వృక్ష వాటికలు
సిద్ధులు-యోగులు అచట సంతత తపోధనులు
జ్యేష్ఠ-ఆషాఢముల నాయకుడు గ్రీష్ముడు
శుక్రశ్రీ-శుచిశ్రీలతో కొలువుతీరి ఉన్నాడు
శ్రీమాత సంకల్పిత శ్రీకర దర్శనములతో
సీసప్రాకారపు ప్రవేశము అమ్మ ఆశీస్సులైనవేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
సీస ప్రాకారము సప్తయోజన విస్తీర్ణముతో,మథుర రస ఫలములు గల సంతానవాటికతో శోభిల్లుతుంటుంది.గ్రీష్మ నాయకుని భార్యలైన (జ్యేష్ఠ-ఆషాఢ మాసములు) శుక్రశ్రీ-శుచిశ్రీలు సంసార తాప ఉపశమనమునకై సంసారవాటిక తరుమూలములలో సేదతీరుతుంటారు.అచ్చటి ప్రాణులు చల్లని నీరు త్రాగుతుంటారు.లెక్కించలేనంతగా నున్న అమరులు-సిద్ధులు-యోగినీ యోగులు తల్లిని సేవిస్తుంటారు.గ్రీష్మ తాపమును తగ్గించుకొనుటకై నవ విలాసినులు శరీరమునకు సుగంధమును పూసుకొని,పరిమళ పుష్పమాలలను అలంకరించుకొని, తాటియాకు విసనకర్రలను వీచుకొనుచు విలాసముగా తిరుగుతుంటారు.తల్లి కనుసన్నలలో ప్రత్యక్షదైవమైన సూర్య భగవానుడు ప్రచండుడై కిరణములను ప్రసరించు,నిస్తుల వైభవమును విస్తుబోయి చూచుచున్న సమయమున ,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment