ఓం నమః శివాయ-37
**********************
సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు
జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి
చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు
పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి
.పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి
మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి
విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి
.వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి
పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత
మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని
కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే హెచ్చరించలేవని
నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా
శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.
ప్రకృతి నమః శివాయ-వికృతి నమః శివాయ
రాకయు నమః శివాయ-పోకయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః ఆతార్యాయచ-ఆలాద్యాయచ." రుద్రనమకం.
సంసారమునుండి తరింపచేయు తత్త్వజ్ఞానము లభించినను ,దానిని ఉపేక్షించి,మరల సంసార భ్రాంతిని పొందుటయే ఆతారము.(ఆతార్యాయచ).సంపూర్ణముగా కర్మఫలములను పొందువాడు ఆలాదుడు.అవి దైవకృపచే పరిహరింపబడవు.(ఎవరికి)
"అసారే సంసారే నిజభజన దూరే జడథి తతా
భ్రమంతం పరమకృపయా పాతుం"-శివానందలహరి
సారము లేని సంసారములో మతిలేక తిరుగుచున్న నన్ను మాయ అవకాశము చూసి మరల మరల ఆవరించుచున్నది.నా ప్రయత్న లోపమో-నీ ప్రసాదగుణ తాత్సారమో తెలియకున్నది.పరమేశా! అనుగ్రహించుటకు నాకంటే దీనాతి దీనుడు లేడు.నీకంటే వేరొక దీనరక్షకుడును లేడు.సత్వరము మమ్ములను అనుగ్రహింపుము సదాశివా.నీకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
..
.
No comments:
Post a Comment