Thursday, May 9, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-23

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-23
  *******************************

   భగవంతుడు-భక్తుడు ఇద్దరు ప్రణవస్వరూపులే
 
  భగవంతుడు ప్రణవబోధను పొందినవాడు
  భక్తుడు ప్రణవ పరమార్థమును పొందినవాడు.

  " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం." ఓం నమః శివాయ.

  అకరా-ఉకార-మకార సంగమము " ఓంకారము." ఓంకారమును సూక్ష్మ ప్రణవముగను,పంచాక్షరిని స్థూల ప్రణవముగను దైవజ్ఞులు భావిస్తారు.ప్రణవము స్వయంప్రకాశకము నిత్యము నిరంజనము.

  " ఓంకార బిందు   యోగినాం
    కామదం మోక్షదం వందేం ఓంకారాయ నమోనమః."

  " వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వైయథా
    శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రెతా ఏవాన్యదేవతాః" సూథ సంహిత.

    రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము.పాపమోచకము భుక్తిముక్తిప్రదము.ఆ రుద్రుడు తన కుమారుడైన షన్ముఖుని నోట ప్రణవమును -ప్రణవ పరమార్థమును శిష్యుడై తెలిసికొనుట లీలలు కాక ఇంకేమిటి.

  " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."వేదమంత్రములయందుండువాడు స్లోక్యుడు.వేదాంతముచే చెప్పబడువాడు అవసాన్యుడు.నమో నమః.

  " నమో జ్యేష్ఠాయచ-కనిష్ఠాయచ" జగత్కళ్యాణమునకై జ్యేష్ఠుడు-కనిష్ఠుడు రెందును తానైన రుద్రుడు తనకుమారుడైన సుబ్రహ్మణ్యునికి శిష్యుడై ప్రణవజ్ఞాన సముపార్జనను చేసినాడు.స్వామి తన కార్యాచరణకు కమలనాభుని పావుని చేసినాడు.

 కమనీయం-రమణీయం కుమారుని కథనం.ఒకసారి కైలాసపర్వతమునకు వెళ్ళుచున్న బ్రహ్మ దారిలో కనిపించిన సుబ్రహ్మణ్యుని చిన్నపిల్లవాడుగా భావించి,పలుకరించకనే పరమేశ్వరదర్శనమునకై పరుగులు తీయుచుండెను.పథకము ఫాలనేత్రునిది.కదులుచున్న పదములు పద్మసంభవునివి,అంతా పరమేశ్వర లీల.ప్రసాదగుణపు హేల.
అహంకారమునకు దాసుడైన అజునకు ఆదివ్యాధి వైద్యమునకు సమయము ఆసన్నమైనది ఆ శివుని కనుసన్నలలో.అంతే ఆ శుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని నమస్కరించి,తానే పలుకరించి,సృష్టియజ్ఞ వివరమును తెలీయచేయమని కోరెను.కనుల మాయతెరలు కప్పియుండుటచే ఖాతరు చేయక ఏముది వేదముల సాయముతో ప్రణవమును చేస్తూ సృష్టిని సాగిస్తాను అన్నాడు బ్రహ్మ.సమాధానముతో సంత్ప్తి చెందని స్కందుడు,ఒకసారి చదివి వినిపించమన్నాడు.

 " హే స్వామి కరుణాకర దీనబంధో." కరుణామయుదైన స్వామి కఠినతకు కారణమును తెలిసికొనలేని కమలజుడు,పఠనమును ప్రారంభించగానే,బ్రహ్మను ఓకారము యొక్క భావమును తెలియచేయమన్నాడు." ఆట కదరా శివా నీకు అమ్మతోడు."

   వివరించలేని విధాతను బందీని చేసి,శరవణుడు స్వయముగా సృష్టికార్యమును కొనసాగించుచున్నాడు.

  


  " ద్రుత చామీకరప్రఖ్యం శక్తిపాణిం షడాననం
    మయూరవాహనారూఢం స్కందరూపం శివంస్మరేత్."

   మహాదేవుడే బ్రహ్మను తిరిగి తీసుకొని రాగలయోధుడని గ్రహించిన దేవతలు.

  " యేభూతానామధిపతియోవిశిఖికాసః కపర్దినః" జటలు కలిగి-జటలు లేని రుద్రుల స్వరూపములఓ నున్న రుద్రా నీ ఆయుధములను మాపై ప్రయోగింపకుము.దయాళువై బ్రహ్మగారిని తిరిగి తీసుకురమ్ము.అని ప్రార్థించగా వల్లెయని ,

  " ఓం నమో పూర్వజాయచ-పరజాయచ" పూర్వాపరములు రెండును తానైన స్వామి బ్రహ్మ అచూకిని గుర్తించి,తన కుమారుని దగ్గరకు వెళ్ళెను.

     బ్రహ్మగారికి జ్ఞానోదయమును కలిగించుటకు జరిగిన పరిణామములను తెలియచేసి తండ్రికి నమస్కరించెను.తండ్రికి తాను గురువై ప్రణవ ప్రాముఖ్యమును వివరించెను.స్వామి శిష్యుడై అవధరించెను.ప్రణవ పరమార్థమును పరిచయము చేసిన ఆ పవిత్రస్థలము కుంభకోణము దగ్గర నున్న స్వామిమలై.

 ఎంతైన మహాకవి ధూర్జటి తెలియచేసినట్లు స్వామి పాలబువ్వకు అరటిపండ్లను వాత్సల్యలక్షీ లీలగా తెచ్చి ఇస్తాడు.వద్దనకుండా శిష్యుడై ప్రణవమును పుత్రునిచే ఉపదేశము పొందుతాడు.ఊహలకందని లీలలవాడు ఉమాపతి.  " శివాయ నమః" స్థూల ప్రణవము ద్వారా పరమేశ్వర దర్శనమును పొందిన భక్తుడు ఉపమన్యు మహర్షి.పేదవాడైన ఉగ్రదంతుని కుమారుడు క్షీరసేవనము చేయవలెన్న తీరని కోరిక కలవాడు.

  " నమో గోష్ఠాయచ".ఆవులు కట్టియుండే చోటనుండు స్వామి అనుగ్రహమును చూపకుండుటకు అంతరార్థమేదో ఆయనకే తెలుసు.అంతా శివమయం జగం.వ్యక్తం అంబామయం.అందులకనేమో తల్లి శివపంచాక్షరిని ఉపదేశించినది.త్రికరణ శుద్ధిగా నమ్మిచేసినవారిని త్రినేత్రుడు కరుణీంచకుండునా? అసలే భోళాశంకరుడు.

  ' శివశివశివ అనరాదా శివపాదముచేదా?
    శివపాదము మీద నీ శిరసునుంచరాదా?

  అనుచు ఉపమన్యు చేయుచున్న పంచాక్షరి నామ జపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై,క్షీర రామలింగేశ్వరుడై అనుగ్రహించెను ఆ ప్రదేశమే నేటి క్షీరపురి  పాలకొల్లు.

  ఉపమన్యుని ధన్యుని చేసిన పంచాక్షరి-స్థూల ప్రణవము మనలనందరిని పరిపాలించునుగాక.శబ్ద-రూపములకు అతీతుడైన స్వామి మనలను తన అక్కున చేర్చుకొనుగాక.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం)



 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...