Friday, March 29, 2019

NAH PRAYACHCHAMTU SAUKHYAM-02

  నః ప్రయచ్చంతు సౌఖ్యం.-5
 ************************** 
 "వణిగృహ్ నంతిపరే పశ్యతోహరః."

 పశ్యతోహరులు అంటే మనము చూస్తుండగానే అపహరించేవాళ్ళు.వర్తకులు అను భావముతో వాడబడినది.

 భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే.ఓం నమః శివాయ.

  " మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః"

   స్వామి మనకు కావలిసినవిమనకు అందచేయుట కొరకు,చొరలేని గుబురుపొదలలో నున్న వాటికొరకు ఆలోచనచేసి దానిని తెచ్చి విక్రయించు వ్యాపారి రుద్రుడు.ఈశ్వర చైతన్యమే వృత్త్తుల నైపుణ్యము.భక్తుల యోగము ద్వారా భగవత్తత్త్వము ప్రకటితమవుతుంది.శివజ్ఞానము,శివభతి,శివ ధ్యానము,శివార్చన,శివవ్రతము అను ఐదు శివ యోగములు. " ఓం నమః శివాయ".
   


     భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే  

భక్తుడు     .శివనేస-జ్ఞానకళ దంపతులకు శ్వేతర్నయర్ నోముల పంట.తిరువెంగడర్ గా ప్రసిద్ధిచెందెను.చిన్నతనములోనే తండ్రిని కోల్పోయిన,ను,"మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వర" అను నమ్మకము. తన సంపదను శివభక్తులకై ఖర్చుచేసి అమితానందమును పొందెడివాడు.

" నమో గణేభ్యో-గణపథిభ్యశ్చ వో నమః" గణము-గణపతి రెండును తానై యైన ఆ ఉమాపతి, తన భక్తుని ఒక ఇంటివాడిని చేయాలనుకున్నాడు.అదియును సలక్షణమైన కన్యతో వివాహము జరిపించి ,


శివసంకల్పముగా యుక్త వయస్కుడు కాగానే శివసితంబర శెట్టియర్-శివనామి దంపతుల పుత్రికయైన పరమసాధ్వి శివకళతో వివాహము జరిగినది.చాలాకాలము వరకు వారికి సంతానము కలుగలేదు.

శివుడేమి చేయనున్నాడో ఎవరికి ఎరుక?సమకాలీనునిగా శివసరుమర్ అను ఒక నిరుపేద ఉండెడివాడు.పేదరికము అతని శివభక్తిని ఏ మాత్రము అడ్డగించలేకపోయినది.శివభక్తులను అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ,తన భార్య తాళిని సైతము విక్రయించి,అపరిమిత దానధర్మములకు సైతము వెనుకాడెడివాడు కాదు.

 చాలాకాలము వరకు వారిని సంతతితో శివుడు అనుగ్రహించలేదు.కాదనగలడా భక్తులమనసును ఆ కాలకూటధారి.కలలో సాక్షాత్కరించి కొండగట్టుపై నున్న బిల్వ వృక్షము క్రింద ఒక శివయోగి చిన్ని శిశువుతో నున్నాడని వెళ్ళి తెచ్చుకోమని చెప్పాడు.

" నమో అగ్రియాయచ-ప్రథమాయచ".

అందరికంటె,అన్నిటి కంటె ముందర నున్నవాడు.అక్కడి శిశువును ఇక్కడకు చేర్చి,ఏ విధముగా వ్యాపారి ఒకచోటి వస్తువును ఇంకొక చోటికి తరలించి లబ్ధిని పొందుతాడో,అదే విధముగా పరమేశ్వరుడు తాను సర్వాంతర్యామియై, శిశువును భక్తుని దగ్గరికి చేర్చి పరవశించుచున్నాడు.


సంతోషముతో వెళ్ళారు దంపతులు.స్వామి ఆనగా, శివసరూమర్ శివయోగియై బిడ్డతో నున్నాడు. బిడ్దను తీసుకొనుటకు ముందుకు వచ్చిన దంపతులతో బేరము మొదలుపెట్టాడు

 భలే మంచి వింతబేరము.భవహరణము.శుభతరుణము.శివుడు చేయు భలే మంచి భక్తి బేరము.వరమును అందించుటకు వరహాలు బేరమాడుతున్నాడు తులాభారముగా ఆ వరప్రదుడు.


 ఈశ్వరాజ్ఞ ఎవరెరుగరు పరమేశ్వరాజ్ఞ



ఆ యోగి.తులాభారములో సరితూగు బంగారు నాణెములను సమర్పించి,బిడ్డను తీసుకెళ్ళమన్నాడు.శివచైతన్యపు చిద్విలాసమును కాదనగలవారెవరు?ఈశ్వరేచ్చగా పరస్పరము తమకు కావలిసినది ఇచ్చిపుచ్చుకున్నారు.మధురం శివలీల మదిలో మరువకే ఓ మనసా.ఇహపర సాధనమే-సురుచిర పావనమే.

సూత్రధారుని సూచనతో పాత్రధారులు నాటకమును ప్రారంభించారు.పరమేశుని ఆనతి మీరగలరా? 

కొడుకును పిలిచి చేయవలసిన వ్యాపారము గురించి వివరించి దూరప్రాంతములకు
 పంపాడు తనతనయుని.శివుని పంపు ( ఆన).

 ఏ మోహ బంధములను తెంపుతోందో ?ఏ దివ్య బంధముతో కలుపుతోందో ? వేయి కళ్ళతో వేచిచూడవలసినదే ఆ మూడుకళ్ళవాని మహిమలు." త్రయంబకం యజామహే సుగంధిం పుషివర్ధనం."

   సదరు సరుకుతో వచ్చిన పడవ తిరువెంగడర్ ఎదురుచూపులకు బదులు చెప్పింది.తనయుని చూచిన తల్లి సంతోషించింది.తండ్రి తండ్రికి బాధ్యతను జ్ఞప్తికి తెచ్చింది.తన కొడుకు ప్రయోజకత్వమును పరిశీలించాలనుకున్నాడు.

" నమో వాస్తవ్యాయచ-వాస్తుపాయచ" 

 వస్తువుల స్వరూపములో,వానిని ఉంచవలసిన ప్రదేశ నిర్దేశనములలో కల శివునికి నమస్కారము.పడవలోని వస్తువులు తరలించి పేడపిడకలనుంచినాడు ఆ ఫాలనేత్రుడు.ఇది మరొక వ్యాపారము.



సరుకును చూసి సహనము కోల్పోయిన మనసు కొడుకును గదిలో బంధించుటకు సహకరించింది.తన నిగ్రహశక్తిని మింగివేసి,నిర్దాక్ష్క్షిణ్యుని చేసిన సరుకు ఏమిటి? 

" నమో ఉగ్రాయచ-భీమాయచ"


  శ్మశానములో బూడిద సరిపడుటలేదా సదాశివుని అన్నట్లుగా బూడిదగా రూపాంతరమును చెందు పేడపిడకలు.గిడ్డగినిండి తండ్రి కోపముతో పందెమును ఒడ్డుచున్నవి.

" నమః శర్వాయచ-పశుపతియేచ"

   పాపమును హింసించు శర్వుడు లీలావినోదమును అవలోకిస్తున్నాడు.



అరిషడ్వర్గముల బరిలో చిక్కిన తిరువెంగడర్ అరచేతిలోనికి పిడకను తీసుకొని విసిరికొట్టెను." ఓం హిరణ్యబాహవే " హస్త స్పర్శచే పునీతమైనదో లేక తిరువెంగడరుని పూర్వ జన్మ సుకృతమో పిడకలు కనులను మిరుమిట్లు గొలుపుతు రత్నఖచిత బంగారు ఇటుకలుగా మారిపోయినవి.స్వామి తన వర్తక నైపుణ్యమును మరొకసారి ప్రదర్శించి మోహభావను తీసుకొనుటకు,రత్నఖచిత ఇటుకలను వస్తుమార్పిడి చేసాడు.ఎవరికి లాభము-ఎవరికి నష్టము ఎంచగలమా? "విత్తమును విపరీతముగా అభిమానించువానిని వీతరాగుని చేసినది ఈ వర్తకము".ఆశాపాశము తరలినది.ఈశుని పాదము పిలిచినది."యద్యత్ కర్మ కరోతి సర్వమఖిలం  శంభో తవారాధనం"

 పశ్చాతాపుడైన "పట్టినత్తారు" గా పరిణామమునొంది కొడుకును బంధించిన గది తలుపుతీసి చూడగా అందులో కొడుకులేడు.అయోమయముగా చూస్తుండగా భార్య ఒక పేటికను కొడుకు ఇచ్చాడని తెచ్చి ఇచ్చింది తెరిచి చూడగానే అందులో రాసియున్న ఒక తాటియాకు,ఒక గోచి,ఒక గుండుసూది ఉన్నాయి.తాటియాకుపై నీవు శరీరమును వదిలివెళ్ళునప్పుడు కనీసము గుండుసూది కూడ నీ వెంటరాదు.వచ్చేవి నీ పాప-పుణ్య కర్మఫలితములే.కనులు తెరువు అని వ్రాసియుంది.తన కొడుకు సామాన్యుడు కాడని.సాక్షాత్తు సదాశివుడని గ్రహించిన పట్టినత్తార్ తన అద్భుత సంకీర్తనలతో శ్రీకాళహస్తీశ్వరుని సేవించి భావితరములకు మార్గదర్శకుడయ్యెను.

   సంసారమనే చిక్కుదీయలేని పొదరింటి నుండి,సంస్కారమనే వస్తువును తన తెలితేటలతో వెలికితీసి తెచ్చి,సత్సంగమనే సత్ప్రవర్తనను స్వీకరించి,సామీప్య-సాయుజ్యములను అందించు సదాశివుడను వర్తకుడు సర్వవేళల మనలను రక్షించుగాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)

Wednesday, March 27, 2019

NA: PRAYACHCHAMTI SAUKHYAM.

 నః ప్రయచ్చంతుంసౌఖ్యం-09
       ***********************
   

  ఓం కులాలేభ్యః నమోనమః.
  _____________________________

 మృత్తిక-కుమ్మరి చక్రము-మట్టిపాత్రలు-కుమ్మరి అన్ని తానైన పెద్ద కుమ్మరికి నమస్కారములు.

 ముజ్జగములను మృత్తికను,కాలభ్రమణమనే చక్రమున బంధించి,తన హిరణ్య బాహువులతో బహు సుందర పాత్రధారులుగా మలచి,ప్రాణశక్తి అను అగ్నితో దానిని కాల్చి,లీలా వినోదమును తిలకించు గొప్ప కుమ్మరి ఆ గౌరీపతి.ఏ కుండకు ఎంత జీవనమో తెలిసినను ఏమితెలియనట్లుండు బహు చమత్కారి.ఏ జీవి రూపము ఎన్నేళ్ళో,ఏ కుండ పనితనము ఎన్నాళ్ళో.ఎవరు చెప్పగలరు?

 క్షీరసాగర మథనంబున జనించెను హాలహలము అతి భీకరమై
 క్షీర లింగేశ్వరుడు తన గళమున ధరించెను అది శ్రీకరమై.
 గరళ ధరుని కరకమలములు కొలిచిన వారి కరతలామలకములు.


 అని నిరంతర నామస్మరణతో సంతుష్టుడై ఉండెడివాడు.





  చిదంబర ప్రాంతములో ఒక కుమ్మరి శివభక్తుడు ఉండేవాడు.నిరంతర శివనామ స్మరణము పలుకుచు,స్వామి హాలాహల భక్షణము గురించి,తన్మయత్వముతో తనతోటి వారికి వివరించుచు తరించుచుండెడివాడు





.తన కులవృత్తిని ఈశ్వరప్రసాదముగా గౌరవించుచు,శివస్వామికి మాత్రమే కాకుండా, శివ భక్తులకు సైతము,అత్యంత భక్తిశ్రద్దలతో మట్టిపాత్రలను చేసి,సమర్పించుచుండెడి వాడు.నిరంతర "నీలకంఠ నామస్మరణ" అతనికి తోటివారిచే " నీలకంఠ" నామకరణము చేయించినది.అసలు పేరు మరుగున పడినది




" నమః శివాభ్యాం-నవయవ్వనాభ్యాం"  భక్తునకు యుక్త వయసు రాగానే, పరమసాధ్వి,శివసేవా పరాయణురాలితో శివానుగ్రహమన వివాహము జరిగినది.గురుతర బాధ్యతగా గృహస్థధర్మమును నెరవేర్చుచు,అతిథి- అభ్యాగతులను ఆదరించు వారి సంసారములో చిన్న మలుపును తెచ్చాడు ఆ చిదంబరుడు.భక్తులకు పెట్టు పరీక్షలు భగవదనుగ్రహ సూచనలే  కదా.

 ఒకనాడు నీలకంఠుడు స్వామికి తను చేసిన పాత్రలు-దీపములు సమర్పించి వచ్చుచుండగా, 


" నమో వర్షాయచావర్షాయచ" వర్హము-అవరషము రెండును తానైన రుద్రుని లీలగా





 అన్నట్లుగా,కుండపోత వర్షము,కుండలుచేయు వాని తడుపుతు,కురియసాగెను.తడిసి ముద్దయి చేసేది లేక



,అక్కడొక ఇంటిముందున్న చూరుక్రింద నిలబడ్డాడు నీలకంఠుడు.

నమో మహేభ్యో క్షుల్లకేభ్య్శ్చ నమః.మహత్వము-సాధారణత్వము పు గలబోత అన్నట్లుగా ఆ ఇంటి యజమానురాలు
సహాయ ప్రవృత్తిలో సంపన్నురాలైనప్పటికి,వేశ్యా వృత్తిలో జీవనమును సాగించుచున్నస్త్రీ. పొడి బట్టలనిచ్చి,నీలకంఠుని ఆదరించెను.అవి ఆమె సంస్కార ప్రతిరూపములా అన్నట్లుగాఆ వస్త్రములు
 సుగంధ పరిమళములను వెదజల్లుచుండెను.

నీలాపనిందకు ప్రతీకలా లేక నీలకంఠేశ్వరుని లీలకు సంకేతములా అనునట్లు ఆ కుమ్మరి ధరించిన వస్త్రములనుండి వచ్చుచున్న పరిమళములు,అతని భార్య సన్స్కారమును పరిహసించుచు,సందేహములై సందడితో చిందులు వేయసాగెనుతనను తాకరాదను ఆజ్ఞాపాలనమును చేస్తూనే,.ధర్మపరాయణులైన వారు,యథాధిగా శివ అర్చనలు,శివభక్తుల సేవలు,అతిథి మర్యాదలతో కాలముగడుపుతున్నారు.

 తాళగలడా తనభక్తుల తడబాటులను.తరలివచ్చాడు తానే ఒక మహిమగల మట్టిపాత్రతో వారిని కృపాపాత్రులను చేయుటకు ఆ తాండవప్రియుడు ఒక వృధ్ధ బ్రాహ్మణ వేషధారియై.

"నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమ:."













 అతిథిని తమసేవలతో సంతుష్టుని చేసిరి.మరింత సేవింప తలపును కలిగించినాడు 

బూదిపూతలవాడు.








.వారు సవినయముతో మీకు మేము ఏ విధముగా సహాయపడి ధన్యులము కాగలమో సెలవీయండి అని వేడుకున్నారు.సరైన సమయమిదేనని సదాశివుడు వారితో మీరింతగ అడుగుతున్నారు కనుక నాకొక చిన్న సహాయమును చేసిపెట్టండి అన్నాడు .ఆనందభాష్ప నయనములతో ఆనతీయమన్నారు అమాయకముగా


.ఆటను రక్తి కట్టిస్తూ,నాదగ్గర అద్భుత మహిమలు కల మట్టిపాత్ర ఉన్నది.దానిని తీర్థయాత్ర సమయములో భద్రపరచుట కష్టముగా నున్నది".నీలకంఠ నీవు కుండలను చేయుటలో-వానిని భద్రపరచుటలో సమర్థవంతుడివి "కనుక నేను కొంతకాలము ఈ 


మహిమల పాత్రను





 నీ దగ్గర దాచి,తిరిగి తీసుకుంటాను.అంగీకారమేనా? అన్నాడు ఆ ఆనందలోలుడు.సరేనన్నారు ఆ దంపతులు .ముందుకథను నడిపించే ముక్కంటి ముచ్చటైన పాత్రను వారికి అందించి,తన యాత్రను పూర్తిచేయు నెపమున తరలినాడు.మధురం శివలీల మనలను తరియింపగనే మనసా.


 కాలాతీతుని కనుసన్నలలో కాలము పరుగులిడసాగుతోంది."తలనుగంగను దాల్చిన వాని తలపన" తిరిగివచ్చిన వృద్ధునికి సమర్పించుటకు ఎంతవెతికినను నీలకంఠునికి పాత్ర కనిపించలేదు.


చింతయే మిగిలినది.వింతను వీక్షిస్తున్నాడు విశ్వేశ్వరుడు.ఇంతలో కారుణ్యమును తోసివేసి కాఠిన్యము కదము తొక్కాలనుకొన్నది.తన వంతుగా ముంతకై పంతమునే పూనాడు."


తగవు అన్న"తగవులే కథను నడిపిస్తున్నాయి తమ వంతుగా..రాధ్ధాంతమునకు బదులు రాజీపడదామనుకున్నాడు రాగద్వేషాతీతుడు.అందులకు ముంత బదులుగ నీలకంఠ దంపతులు తమ బిడ్డలపై ఒట్టువేసి నిజము చెబితే నిందను తొలగిస్తానన్నాడు.

  సారెపై తిరుగుచున్న మట్టిముద్దలా నలుగుతున్నది నీలకంఠుని మనసు.అవకాశమును అందిపుచ్చుకొనలేని అభాగ్యుడు.నిస్సంతులు నిందనెట్లు తొలగించుకొనగలరు.మరొక అవకాశముగా ( చివరి) నీలకంఠుడు నింద తొలగించుకొనవలెనంటే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నిజమును వెల్లడించవలెన్నాడు ఆ వల్లకాడులో తిరుగువాడు.

  ఇదొక పెద్ద ధర్మ సంకటము.నిరూపణకు ఆటంకము వారు శివుని ఆనగా పాలించుచున్న ప్రతిన.సంసారపు గుట్టు బట్టబయలుచేసి,వారి ఔన్నత్యమును లోకవిదితము చేయుటయే స్వామి సంకల్పము.


" నమః శ్శుష్కాయచ-హరిత్యాచ".

  ఎండిన కట్టెలలోను-పచ్చి కట్టెలలోను ఉన్న రుద్రునకు నమస్కారములు.




తథాస్తుగా వారు స్వామి ఆదేశముపై పవిత్ర శివగంగాతీర్థములో కర్ర చెరొక కొన పట్టుకొని సత్యమును వెల్లడించిరి.ఆనవేయించుకొనిన నటరాజు ఆనందించి,సతీసమేతుడై వృషభమునెక్కి సాక్షాత్కరించెను.ధన్యోస్మి శంకరా ధన్యోస్మి.

   ఒక్కడే రుద్రుడు జగములనేల-రెండవ దైవము లేనేలేడు.

   " అస్తవ్యస్తముగా నున్న సంసార బంధములనే మట్టిని,భక్తరక్షణాచక్రమనే సారెపై నుంచి,అనుగ్రహ హస్తములతో మృత్తికాభాండమును అమృత భాండముగా మలచు ఏకైక కుమ్మరి కి,

" ఏక బిల్వం సమర్పయామి".

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)



Wednesday, March 20, 2019

VIKAARI UGAADI

   వికారి నామ సంవత్సరాది శుభకామనలు.
   ***********************************

  అరవై ఏళ్ళ పిదప వాత్సల్యముతో అరుదెంచుచున్నావా
  "విలంబికి" వీడ్కోలుగా ఓ " వికారి" వత్సరమా! స్వాగతం.

   తెలుగు సంవత్సరములు అరవై.కారణము పెద్దలు ఇలా చెబుతారు.

 అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల
 సమయము పడుతుంది " శని గ్రహమునకు"
  పన్నెండు రాశులు చుట్టిరావడానికి.

 మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల
 సమయము పడుతుంది " గురు గ్రహమునకు"
 పన్నెండు రాశులు చుట్టిరావడానికి.

  30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజం "60" కాగా
  వీటిని అన్నారు,
   జాబిలి కూతురులని కొందరు.
   నారద కుమారులని మరి కొందరు.

  వాటికి నామకరణము చేశాడు," వరాహ మిహిరుడు" తన
   "భృగుసంహిత" లో " ప్రభవ నుండి అక్షయ" అని.

  వానిలోని 33వ సంవత్సరమే "వికారి" స్వాగతం-సుస్వాగతం.

  వసుధైక కుటుంబమనే పసిడి పాత్రలో మనము,

   వెంటాడుతున్న సమస్యలనే వేపపువ్వును వేసి,
   ముప్పులను తప్పించే ఉప్పును కొంచము వేసి,
   కానిపనులు ఖండించే కారమును కలగలిపి,
   తలపొగరుల చిగురుతుంచు వగరును జతచేసి,
   గెలుపు మలుపు చూపుతున్న పులుపును జోడించి,
   మథనములో జనించిన మథురముతో మేళవించి

  అరిషడ్వర్గముల అరి అరుదైన ఆరుచుల వయ్యారి
  ముచ్చటగ తయారైన పచ్చడిని తిందాము.

  పచ్చదనపు బాటలో జగము మెచ్చు మాటలో
  పన్నెండు రాశులు మనలను వెన్నుతట్టుచుందగా,

   గమనములో అనుకూలమో-ప్రతికూలమో,
   గుణదోషములో-ఆదాయ వ్యయములో,

   అసలు ఆలోచించరు కదా అ ఉత్కృష్ట గమనములో
   ఆ గురు-శని గ్రహములు,

   సమయమెక్కువవుతుందని తమ గమనాన్ని సగములో ఆపరుకద.
   సతమతమగు నడక యని సహనము కోల్పోవరు  కద.

   వారి స్పూర్తి వదలక

  తడబడక అడుగులను వడివడిగ వేస్తూ,
  వికారి సహాయముతో "విజయపథం"చేరుదాము.

Sunday, March 3, 2019

SIVA MAHIMNA STUTI-PUSHPADAMTA

 మహిమల సామి నీదయతో మారెనుగ శాపము
 అహమును పారద్రోలి అపురూపపు వరముగ
 పాహి పాహి,నీ స్మరణము ఇహపరసాధనంబు
 మహదేవ స్వీకరించు "శివ మహిమ్నా స్తోత్రము".


1. మీరిన భక్తి నిను కొలువ మితిమీరిన ఆశతో తోటలోని
 పూలను తస్కరించ-బిల్వములపై నడిచిన నేను పాపిగ
 కూరిమి శాపమిచ్చి అహంకారము సంహరించిన పాదము
 చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పమాలలుగ నిన్ను కొల్వగన్

2.సగుణమా-నిర్గుణమా,అది-ఇదికాదు గోచరమవదు
  అను సందిగ్ధములోనున్నవి మూడు వేదములు ఓ చరాచర
  స్వరూప భేదములతో స్వభావ భేదము లేని పాదములు
  చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పములుగ నిన్ను గొలువగన్.

3.ప్రవహించగ పశుపతికృత వేదమరందము ,గ్రహియింపగ
  పరికించగ బృహస్పతి ప్రస్తుతి వింతకాదు,గమనార్హము
  తరియింపగ జిహ్వను ,తరలినవి జంగమ పాదము చెంతకు 
  పరిణిత పలుకులు పరుగున, పుష్పములై నిన్ను కొలువగన్.

4. ఖండించెదరు, వాదనలు  సలుపుదురు మూర్ఖులు
   అఖండమూర్తి నీ త్రిగుణాత్మకత నెరుగని మర్త్యులు
   వివరము వేగమె విన్నవించగ, వరప్రదాత పాదములు
   చేరినవి బిరబిర  పలుకులు పరిమళ పుష్పమాలయై.

.ఎవ్వని సృష్టి ముజ్జగము? సహాయము చేసినదెవ్వరు?
  ఆవలనున్న అతీతశక్తితత్త్వము అవగతమవ్వని 
  నిరుపయోగ వాదనల నిగ్గును తేల్చు పాదములు 
  శరణని చేరినవి నా పలుకులు భక్తితో ప్రస్తుతింపగన్.

6. జగములకల్పనసాధ్యము నమ్ము జగదీశుడు లేనెలేక
   ఉండిన పిండిబొమ్మలవి జవసత్వము మెండుగ నిండక
   మందమతి సందియముల్ తొలగించు పాదములు గతి యని
   చేరినవి మందహాసము చేయుచు పలుకులు మందారములై.

7.సాంఖ్యము-యోగము-శైవము-వైష్ణవ-శక్తి నామములు
నమ్మిన విభిన్న మార్గములు వింతగ చేర్చు గమ్యమును
దయాసాగర సంగమంబునకు సాగుచు వాహినులై
చేరినవి పలుకులు పాదములు పాహిమాం అనుచు.

8.ఖట్వాంగము గొడ్డలి వృషభము స్వామి వస్తు-వాహనములు
  పాములు బూడిద పులిచర్మము మేలగు అలంకారములు
  మృగతృష్ణయే విషయవాసనలని,మృగధారి చరణములు
  శరణమన తరలినవి పశ్చాత్తప పలుకులు పారిజాతములుగ.

9. కరిగిపోవునది సర్వముగా, భావించుచు కొందరు
   పరిణామములివి  పరముగా, భావించుచు మరికొందరు
   భేదముతో నుండగ, వక్తను కాని, నా వాక్కులు భక్తితో
   పరుగులు తీయుచున్నవి నీ పాద పంకజములను చేర.

10.సరివారము అనుకొని, కనుగొనలేదుగ అగ్నిస్తంభ నీ పరిమాణము
    హరి-విరించి ఆరాధించిరి, భక్తి-శ్రద్ధ ప్రకటియమాయెగ నీ కరుణ
    నిను గుర్తించని నిర్భాగ్యము వలదని శివ పదములకై సరగున
    పరుగులుతీయుచున్నవి పలుకులు పరిమళ పుష్ప మాలలై


 11.అద్భుత రావణు యుద్ధ సన్నద్ధత కారణంబు నిబద్ధత
   అనన్య భక్తి సంభరిత  శిర సరోరుహ నైవేద్యపు ఘనత
   అగణ్య శక్తి సంభావిత  వరమనుగ్రహించెగ శివంబు ఆర్ద్రత
   పొగడగ నిన్ను చేరినవి పలుకులు పరిమళ పుష్పమాలలుగ.

12నీవందించిన భుజ పరాక్రమము కృతఘ్నతగ
  నీకొండనె కూల్చ,అహంకరించి హుంకరించెగ
  నీదయ నిష్కృతి చూపెగ,కాలి కొనగోటి తాడనముగ
  నీ దరిచేరనీ, పలుకులను పరిమళ పుష్పమాలికలుగ.

13.నీ చరణ సేవానుగ్రహమే కద బాణుని త్రిభువనాపేక్ష
   నీ కరుణావలోకనమే కద శోణపురికి శ్రీరామరక్ష
   నీ శరణాగత రక్షణమే కద హరి పెట్టిన ప్రాణభిక్ష
   శిరమును వంచి తరలినవి పదములు శివపాదము కొలువగ

4. అనిశము తరియింపంగ తనకొక అవకాశముగ
    అనీశునిగళముననిలిచినది గరళము ప్రకాశముగ
    విషమరూప సామర్థ్యమే విషపరీక్షా విజయముగ
    విషయము చాటుచున్నవి ప్రభో! వినయ పుష్పములుగ.

 15. ఘోర-అఘోర నిర్గుణ గురువని గురుతెరుగనివైనవి
    గురి తప్పని మరుబాణములు తక్షణమే కనుమరుగైనవి
    తత్త్వజ్ఞాన బోధనా జ్ఞాపక పరికరములైనవి,నీ దయ
    "తత్త్వమసి" అనుచున్నవి నీ పాదసన్నిధి పదములు.

 16.ఉమాపతి జటాజూటములో ఉక్కిరిబిక్కిరిగ గగనము
    ఉషాస్తమయ తాండవములో ఉద్ధతి కోరగ భువనము
    వేయి కన్నులు చూడగలేని మునిశాపము నిరుపయోగము
    తాండవకేళిని చూడగ తరలినవి పదములు తామరలుగ.

20.యజ్ఞము-యజ్వ-ఫలితము మూడును తానైనవాడు
   మూడు అవస్థలు లేని ముక్కంటి దొర వాడు
   జాగరూకుడు-యాగ ఫలితమునందించుచున్నాడు
   యోగమన పదములు చేరినవి యోగి పాదములు కొలువ.

21. నిశ్చలభక్తి నినుకొలువని యాగము నిష్ప్రయోజనము
    నిర్లక్ష్యపు ధోరణి కూడిన దక్షుని యజ్ఞము సాక్ష్యము
    సోమయాజిని అనుగ్రహించు వరప్రదాతవు,శంకర
    కోమల పాదముల కొలువ చేరెను పదములు సోమశేఖర.

22.ఆత్మసుతపై కలిగినది అజునకు అధర్మ వ్యామోహము
   శివ శస్త్రఘాతములు కలిగించినవి ఆకాశపలాయనము
   ధర్మస్థాపనకే కద విలుకానిగ క్రోధ స్వరూపము,విజయపు
   వినుతులు చేయ సాగినవి పదములు, నీ పదములమహిమన్

23. కనుగానని గర్వము కూల్చిన త్రిపురాసుర  సంహారకుడు
    కందర్పుని  దర్పము కాల్చిన  సర్వేంద్రియ నిగ్రహుడు
    అర్థనారీశ్వర తత్త్వపు పరమార్థమును తెలిపిన వానిని
    శరణార్థులై చేరినవి పదములు నీ శుభచరణసేవకై.

24.సర్వభూత వ్యాపకత్వ ప్రతీక భూత-ప్రేత-పిశాచ సహవాసము
    చివరి స్వరూపమిది యను సందేశమె చితాభస్మలేపనము
    కాలాతీతుని శాశ్వతత్త్వ సూచనయే కపాలమాలధారణమని
    పదములు పరుగిడుచున్నవి పాదముల త్రికాల పూజలకై.

 25. యోగీశ్వరుల  ఆత్మపరిశీలనా శోధనము, అవ్యక్తపు సత్యస్వరూపము
    ప్రాణాయామ యమనియమ పరిణామము పరమాత్ముని నిత్య పరిచయము
    మథుర మకరాందాబ్ధిని తేలియాడుచు పొందు ఆనందభాష్పానుభవము
    తడిసి పోవగ తామును తరలినవి వాక్యములు నీ పాదసన్నిధికి.

26.సూర్య చంద్రాగ్నులు జల వాయువులు భూమ్యాకాశములు నిండిన
   సూక్ష్మతత్త్వమును ప్రకటిత అష్టమూర్తిత్వమని గ్రహించిరి ఎందరో
   శివగోచరము కాని ప్రదేశము కనుగొనుట దుర్లభమని.గ్రహించిన
   పదములు ప్రస్తుతించుటకు పరుగులు తీసినవి పాహిమాం అనుచు.

27.జాగ్రత్స్వప్న సుషుప్తావస్థలు , అ-ఉ-మ, మూడు వేదములు
   ప్రకటిత ముగ్గురు మూర్తులు ప్రభవించిన మూడులోకములు
   ప్రస్తుతి చేయుచున్నవి ప్రభు,ప్రణవము ఓంకారము నీవని
   స్తుతులనందించగ వాక్కులు వడివడి తరలినవి శివా.

28.భవ-సర్వ-రుద్ర-ఈశ-పశుపతి-భీమాది నామములు
   స్తవనీయములైనవి తరియించంగ వేదత్రయములు
   సురుచిర సుందర మందస్మిత స్తోత్రవాక్యములు
   ఆనందముతో నున్నవి నీ పాదసన్నిధి తాదాత్మ్యతతో

29. ఏకాంతము- సమూహము,దగ్గర-దూరము,స్థూలము-సూక్ష్మము
    బాల్యము-వృద్ధాప్యములను ద్వంద్వములు ,నీ దయ,నిర్ద్వంద్వము
    ఏకాంబరేశ్వర నీవే స్థిరము-చలనము మూలము- పాలనమని
    పాదములు చేరినవి పలుకులు పరిపరివిధ నమస్కృతులుగ.

30.రజోపరివేష్ఠిత విశ్వకర్తా భవాయ నమోనమః
   తమోపరిపూరిత లయకర్తా హరాయ నమోనమః
   సత్వప్రకాశక విస్వభర్తా మృడాయ నమో నమః
   త్రిగుణాతీత తురీయస్థిత నిర్గుణాయ నమోనమః.

 31.పరిపూర్ణముగా నున్న దయ పరమార్థము తానే నన్నది
   అపరిపక్వతతో నున్న మది అసలు అర్థము కాలేదన్నది
   నడిచిన బిల్వపత్రములే నా నడకను సంస్కరించినవి
   పశ్చాత్తాప వాక్య హారములు నడిచినవి ప్రాయశ్చిత్తములై.


 32.అంబుధి పాత్రచేసి,అసితాచలమును నింపి ద్రవముగా

   కల్పతరు శాఖను కలమును చేసి,ధరాతలమున వ్రాయనెంచగా
   నీ సద్గుణగణములు శంకర! సరస్వతికైనను సాధ్యము కాదు
   సద్గతినీయు నీచరణములు విడువను నేను సాంబసదాశివ.


33. సురాసుర మునీంద్రవందితము శివసౌందర్యము
    కనుగానని కావర ఫలితము,శాప పరిణామము
    గంధర్వ పుష్పదంతార్పితము శివ మహిమ స్తోత్రము
    పఠనము-శ్రవణము-మననము పరమార్థమునొసగున్.



34. త్రికరణశుద్ధి పఠియించిన శివస్తోత్రము 
    ఇహపరములనిచ్చును వెండికొండగా
    అకళంక భక్తి స్మరించిన శివనామము
    శివపదమును చేర్చును అండదండగా.


35.మహేశ్వరుని మించిన దైవము లేడు
   మహిమస్తోత్రమును మించిన స్తుతిలేదు
   శివ నామమును మించిన మంత్రములేదు
   శివుని మించిన గురువు లేడు.ఇది సత్యం

36. శివ మహిమ స్తోత్ర పఠన ఫలములో పదహారవ వంతు ఫలితమును కూడ జపతపాదులు,యజ్ఞయాగములు,తీర్థయాత్రలు,యోగసాధనలు ప్రసాదించలేవని ఆర్య వాక్యము.

 37.పుష్పదంత నామధేయుడైన గంధర్వ ప్రభువు చంద్రశేఖరునికి దాసానుదాసుడు.శివ నిర్దేశ ప్రకారము తన పూర్వ వైభవమును కోల్పోయినప్పటికిని,శివానుగ్రహముతో శివ మహిమ స్తోత్రమును శివపాదముల ముందుంచి,శివ సాయుజ్యమును పూర్వ వైభవముతో పాటుగ పొందగలిగెను.

 38.ఐహికాముష్మిక ప్రాప్తికి సురలు-మునులు-కిన్నరులు ముకుళితహస్తులై,ఏకాగ్రతో స్తుతించు " శివ మహిమ స్తోత్రము" అనంత ఫలదాయకము.

 39.అనితర సాధ్య-అసమాన-అనుపమాన శివమహిమ స్తోత్రమును పుష్పదంతుడు ఆనందభాష్పములతో ముగించుచున్నాడు.

 40.శివ పాద పంకజములకు సమర్పించిన స్తోత్రము మనలకందరకు శివసాయుజ్యమును ప్రాప్తించునట్లు సహాయపడును గాక.

 41.శివ పరిపూర్ణత్వమును గ్రహించలేని వాడినైనప్పటికిని,వినమ్రుడనై శివ వైభవమునకు వందన సమర్పణమును చేయుచున్నాను.

42.ఒక రోజులో ఒకసారి-రెండు సార్లు-మూడు సార్లు అవకాశమును బట్టి,శివ మహిమ స్తోత్ర పఠనము పాప క్షయమును చేయుటయే కాక,పరాత్పర పాదసన్నిధిని చేరుటకు సహాయపడును గాక.

 43.ఇంతటితో ముగియుచున్న,శివునికి అత్యంత ప్రియమైన పుష్పదంత వాక్పుష్ప శివ మహిమస్తోత్రము  శాశ్వత శివ సాయుజ్యమును అనుగ్రహించు గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

   ప్రియమైన మిత్రులారా,

  పుష్పదంతుల వారు సెలవిచ్చినట్లు సామర్థములేనప్పటికి,శివ పరికరమై ఈ పుష్పమును మీకందించుటకు ప్రయత్నించుచున్నాను.నా స్తోత్ర లోపములను శివ స్వరూపులు మన్నించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

   ఓం తత్ సత్.

 ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...