రక్షాబంధన పండుగ శుభాకాంక్షలు
****************************
1. కొంచము ముందో మరికొంచం వెనుకో
ఒకే తల్లిగర్భములో ఒద్దికగా ఒదిగాము
ఒదగనిచ్చినది బొడ్డుతాడు సహాయము.
అదియేగ నేను నీ చేతికి కట్టిన దారము.
2. కొంచము తెలిసో మరికొంచము తెలియకో
ఉమ్మనీటి మడుగులో ఒడుపుగా ఈదాము
ఈదనిచ్చినది ఉమ్మనీటి సం స్కారము
అదియేగ మెరిసే నీ కంటినీటి మమకారము.
3.కొంచము తడబాటో మరికొంచం పొరపాటో
చిట్టిపొట్టి పాదాలతో అమ్మను గట్టిగా తన్నాము.
తన్ననిచ్చినది తన్నినా తరగని తల్లిప్రేమ ఒరవడి
అదియేగ రక్షాబంధనపు ముడి.
4. కొంచము నగవులతో మరికొంచం తగవులతో
నీవే ముద్దంటు నాకసలే వద్దంటు ఇద్దరము పెరిగాము
వద్దన్నది చేసానని
ఛెళ్ళుమనిపించినది నా చెంపదెబ్బ ఎర్రదనము
అదియేగ నీ నుదుట మెరిసేటి తిలకము.
5. కొంచము సేపు పచ్చి అంటు కొండముచ్చు నీవంటు
అగ్గిమీద గుగ్గిలమై భగ్గుమన్నాము.
రెచ్చిపోయి
పచ్చగడ్డినే భగ్గుమనిపించినది ఆ చిచ్చు
అదియేగ పచ్చగ ఉండాలని హారతిని తెచ్చు.
6. కొంచం సేపు అమ్మ అంటు మరికొంచం సేపు నాన్న అంటు
అమ్మ ఒడి నాదంటు నాన్న భుజం నాదేనంటు
నిన్ను రానీయనని
అన్నీ నావేనంటు బైఠాయించే వాళ్ళం
అదియేగ నీ నోటిలోని తియ్యనైన మిఠాయి.
7.కొందరు అవుననినా మరికొందరు కాదనినా
ఆడపడచులందరి అభిమానము వెయ్యేళ్ళు
అన్నదమ్ములందరికి అవి
ఆనాటి ఆనవాళ్ళు ఆనందపు లోగిళ్ళు
No comments:
Post a Comment