Tuesday, September 19, 2017

KASMEERAETU SARASVATEE.


    కాశ్మీరేతు  సరస్వతి

 " శారద  నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
   హార  తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
   దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
   కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు కల్గు భారతీ" అని,

 శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనామాత్యునిచే కీర్తింపబడిన సరస్వతి పీఠము మాయాసతి కుడిచేయి పడిన ప్రదేశముగా చెబుతారు. సర్వస్వాత్ సరస్వతి అను నానుడి కలదు.స్వాత్ లోపల నిండియున్న సర  సర్వము.మనలోపలనిండి సమయ సందర్భానుసారము ప్రకటితమయే శక్తియే  సరస్వతి అని సారస్వతమని  పండితులు భావిస్తారు. సంగీతములో సాహిత్యములో నిండియున్నా  స్వర ప్రస్థానములే  సరస్వతీ రూపముగా భావించే శాక్తేయ సంప్రదాయము కలదు.

      " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి  నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు.సర్వశుక్లా  సరస్వతీ అన్న సూక్తిని గ్రహించినట్లయితే అమ్మవారు శుద్ధసత్వమైన తెల్లనితెలుపు రంగు.కనుక సర్వ వర్ణోప శోభితా అను స్తుతి వాక్యమును మనము అన్ని అక్షరముల స్వరూపముగా భావించినట్లయితే,మాతా సరస్వతి అక్షర శక్తులు రేకులుగా గల పద్మమునందు వసించునది. " అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్నవి..

  కాని ఉచ్చారణ విధానమును పరిసీలించినపుడు అక్ష్రములు హ్రస్వ-దీర్ఘ-ప్లుతములుగాను,తిరిగి ఒక్కొక్కటి,ఉదాత్త-అనుదాత్త-స్వరముగాను తొమ్మిది విధములుగా మారుతాయి.ఈ తొమ్మిది విధముల ఉచ్చారణ అను నాసికముగాను,నిరను నాసికముగాను (ముక్కు సహాయముతో-ముక్కు సాయములేకుండా) పలుకుచుండుట వలన తొమ్మిదిని రెండు తో హెచ్చవేసిన పద్దెనిమిది విధానములే అష్టాదశ శక్తిపీఠములు.(వివరించిన శ్రీ సామవేదము వారికి పాదాభివందనములు.)

     " కశ్మీరేతు సరస్వతి". క శబ్దము శిరస్సును సూచిస్తుంది.కశ్మీరము జ్ఞానప్రధాన కేంద్రము.ఇక్కడిది సర్వజ్ఞపీఠము. ఏ ప్రదేశమునుండి పండితులు ఇక్కడకు వచ్చి విజయము సాధిస్తారో ఆ వైపు ద్వారము తెరువబడేదట. ఆదిశంకరులు తమ ప్రతిభచే అప్పటివరకు తెరువని దక్షిణ ద్వారమును తెరిచారట.కశ్మీరమును శైవీ ముఖము అనికూడా అందురు.శివ జ్ఞానమును శైవీముఖము అందురు.ఇక్కడ జ్ఞాన విచారణకు ప్రాధాన్యతగలదు.

    జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
    మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

    పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడుతనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

      తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.

     దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు
   భాతృజనము వచ్చి పంచుకోరు
   విశ్వ వర్ధనమ్ము విద్యా ధనమ్మురా
   లలిత సుగుణ జాల తెలుగుబాల""

  ఏ దుర్మార్గులు కశ్మీరములోని జ్ఞానశక్తిని విధ్వంసము చేయలేరు. జ్ఞాన సరస్వతి ప్రవాహమును బంధించుట ఎవరి తరము?

  దేవి శరన్నవరాత్రులందును,మాఘ శుద్ధ పంచమియందును (వసంత పంచమి) మూలా నక్షత్రమునందును పలుచోట్ల ప్రత్యేక పూజలందు ,ఆ సరస్వతీ మాత మనకు జ్ఞాన భిక్షను ప్రసాదించును గాక.

    శ్రీ మాత్రే నమః.

   

  అష్టాదశ పీఠ శక్తి స్వరూపిణ్యై నమః.
  *******************************************
  అమ్మా!

పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా
అల్ల కల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది

ఎర్రనైన కోపముతో నేను వెర్రి పనులు చేస్తున్నా
చిర్రు బుర్రులాడు మనసు నాపై గుర్రుమంటోంది

తెల్లనైన తెలివిలో నేను తెలుసుకొనగ తప్పులన్నీ
తెల్లబరచె నాలోని తెలివితక్కువ తనాన్ని


సత్వ,రజో,తమో గుణములు సద్దుమణుగు చుండగా
నా ఆత్మనివేదనమే మహానైవేద్యమైన వేళ

నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.

       భావము

నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.తమోగుణమనే నల్లని చీకట్లో నేను చేసిన తలపులు,పనులు నన్ను బాధించుచున్నవి.రజోగుణమనే ఎర్రని కోపముతో నేను కోల్పోయిన విచక్షణ నన్ను కృంగ తీస్తున్నది.సత్వగుణము అనే తెల్లని తేజము నా తెలివితక్కువ తనాన్ని తెలియచేయుచు,నీ పాద రజ కణమును పరిచయము చేయుచుండగా,ఆత్మార్పణకై నా మనసు తహతహలాడుచున్న సమయమున,నీ చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.సర్వజనులను రక్షించుమమ్మా.  అనేక వందనములు.

  భగవత్ బంధువులారా,

      మనమందరము మాయామోహితులమగుచు మనసనే లేడిని అనుసరిస్తూ  అటుఇటు పరుగులు తీస్తుంటే భవసాగరమనే వేటకాడు అరిషడ్వర్గములనే బాణములతో ఆగామిసంచితమనే విల్లుతో మనలను వేటాడాలని కర్కశంగా చూస్తుంటాడు  వాని నుండి తప్పించుకోవాలంటే అమ్మ పాద శరణాగతి తప్ప అన్యము లేదు..అష్టాదశశక్తి స్వరూపిణి  మనము శిష్టచారులమైతే మెచ్చుకుంటుంది.కాకపోయినను పొనీలే పిచ్చివారని మచ్చికతో తన ఒడిలోనికి తీసుకుంటుంది.అమ్మ ఒడిలో నున్న లేడిపిల్లను చూసిన వేటగాడు ఏమిచేయగలడు. ఏమి చేయాలో తెలియక విస్తుపోతూ చూస్తుంటాడు.అమ్మ దయ అయితే అమ్మను,అమ్మ ఒడిలో నున్న లేడిని ప్రస్తుతిస్తాడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ, నా చిన్ని ప్రయత్నమును పెద్ద మనసుతో ఆదరించిన మీ అందరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ ఒడిలో లేడిపిల్లలమై, ఆడుకుందాము.అమ్మ దయనే వేడుకుందాము.

  మాతా కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.

  " దసరా  పండుగ శుభాకాంక్షలు."

  సర్వే జనా సుఖినో భవంతు-సమస్త సమ్మంగళాని భవ0తు. స్వస్తి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...