Monday, October 23, 2017

Pooja Cheyudamu Raare (ఫూజ చేయుదము రారే)

పూజ చేయుదము రారె
నిత్య కళ్యాణిని నిలిపి నీవె మాకు శరణు అనుచు
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
......
పూర్ణ కుంభమును నిలిపి పరిపూర్ణ భక్తిని అందు కలిపి
షడ్వికారములు వదిలి షోడశోప చారములతో
....
ఆవాహనమును చేసి ముదావహమును అందు కలిపి
మూర్ఖత్వము వదిలివేసి అర్ఘ్య పాద్యములతో
......
పంచామృతములు కలిపి మంచిని మరికొంత కలిపి
సంకుచిత తత్వమును వదిలి సుగంధ అభిషేకములతో
......
పట్టు వస్త్రమును తెచ్చి పట్టుదలను పైన పేర్చి
బెట్టులన్ని కట్టిపెట్టి పట్టు చీర చుట్టబెట్టి
....
తిమిరంబులు తిప్పికొట్టి త్రికరణ శుద్ధిని పెట్టి
అంతర్జ్యోతిని చూపి పరంజ్యోతిని ప్రార్థించగ
....
ఏలా లవంగ పూలతో జాజి చంపకములతో
మాలతి మందారులతో మాహేశ్వరిని మరి మరి
....
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు పొగడలు తెచ్చి
రంగుల రోజా పూలతో రాజేశ్వరిని రమణీయముగ
....
మరువము దవనము తెచ్చి మరువక మదిని తలచి
పచ్చని చామంతులతో పరాశక్తి పాద పద్మములను
........
హ్రీంకారికి ఓంకారికి శ్రీంకారికి శంకరికిని
శ్రీ మత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిపుర సుందరికి
....
అథమత్వమును వదిలి అథాంగ పూజలు చేసి
కథలు గాథలు వింటూ మధురస నైవేద్యాలతో
......
ఆకులు పోకలు తెచ్చి ఆటు పోటు మరిచి
గొప్పలు చెప్పుట మాని కర్పుర తాంబులము ఈయగ
......
అహరహములు నీకు దాసోహము మేము అనుచు
అహమును మరిచి చేసే బహుముఖ వాహన సేవకు
........
బంగరు తల్లిని కొలిచి అంగనలు అందరు కలిసి
సంగములన్నీ విడిచి మంగళ హారతులీయగ
........
నవ ధాన్యము తెచ్చి నవ విధ భక్తిని చేర్చి
నవరాత్రోత్సవములలో " శ్రీ మన్నగర నాయకి" కి
పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు.
(శరన్నవరాత్రి సందర్భముగ నిష్కళంక భక్తి పుష్పము.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...