Sunday, October 22, 2017

Raara Maa Intidaaka Raama (రారా మా ఇంటి దాక రామ)

"రారా మాఇంటి దాక" రామా
**************************
"జానక్యా కమలాంజలి పుటే: యా పద్మరాగాయిత-న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయతే
శ్రస్త శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నీలాయిత-ముక్తస్థ శుభద భవంతు భవతం శ్రీ రామ వైవాహికం"
స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి,శుక్రవారం
పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న ,
***************************************
అసమాన శివ ధనుర్భంగము గావించిన వానికి
అగ్ని పునీత వేదవతి,అయోనిజ సీతను ఇచ్చి
విదేహ మహారాజు చేయుచున్న ముదావహ "కన్యాదానము"లో
" వరుడు"
ఆ సూర్య వంశములో అగ్ని ప్రసాదముగా జన్మించిన వాడు
ఆ కౌశికునికి అగ్నికార్య రక్షణము కావించిన వాడు
అహమును తొలగించిన వాడు అహల్య పాలిట దేవుడు
గురు వాక్య పాలకుడు,సుగుణాభి రాముడు
ఆ లోక కళ్యాణములో
**********************
"నిధి చాల సుఖమా రాముని సన్నిధి కన్నా" కాదని
తరలినాడు భద్రుడు తాను పెళ్ళి వేదికగా
అర్ఘ్య పాద్యాలు,మంగళ స్నానాలకు
పరవళ్ళు తొక్కింది పదమని గోదావరి
విభీషణుని మృదు సంభాషణల వ్యాఖ్యానాలతొ
వశిన్యాది వాగ్దేవతలు మారారు బ్రహ్మలుగా
కోతి మూక చేయుచున్న కోటి నామ జపములు
మారు మ్రోగుతున్నాయి మంగళ వాయిద్యాలుగా
పట్టు వస్త్రాలను,నవరత్న తలంబ్రాలను
తలపై పెట్టుకుని తరలి వస్తున్నారు తానీషా వారసులు
కళకళలాడుతున్నాయి కళ్యాణ వేడుకలు
*****************************************
"ఒకే మాట,ఒకే బాణం,ఒకే పత్ని" వ్రతుడు" శ్రీరాముడు" అని
మురిసి పోతున్నారు ముందు వరుసలోని వారు
ఎందరెందరో అనఘులు,ఏనాటికిని ఘనులు.
(కీర్తి కాయులై కీర్తించు చున్నారు)
ఒడ్డునకు చేర్చు దేవుడవని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
చింతాకు పతకముతో నిశ్చింతగ రామదాసు
"మా జానకిని చెట్టపట్టగానే మహరాజు" పాడుతున్న త్యాగరాజు
ఎందరెందరో అనఘులు,ఎన్నటికైనా ఘనులు
(కన్నుల పండుగైన కళ్యాణ సుముహూర్తమును దర్శించండి-
జన్మను చరితార్థము చేసుకోండి)
పందిరిలో పరుగులిడుతు సందడిగ బుడత ఉడత
అక్షింతలు వేసుకోమంది అందరి తలలపై
"తారకము "అను పానకమును, "తాదాత్మ్యత" అను వడపప్పును
తనివితీర తాగమంది,తరియించగ తినమంది
అదిగో,అటు చూడండి..సీతారాములు
అలిసిపోయినారంటు,ఆకలి అవుతున్నదంటు
పండ్లను తినిపిస్తున్నది,పండు ముసలి ఆ శబరి
"శబరి"గా మారిపోయి (భక్తిలో)" శరణు" వేడుకొందామా
"రామ" (రాముడు, మరొక అర్థములో స్త్రీ రూపములోనున్న సీతమ్మ)
మమ్ములను" బ్రోవమని".
.శ్రీ రామ జయ రామ జయ జయ రామ
*********************************

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...