Saturday, February 24, 2018

SAUNDARYA LAHARI-14

సౌందర్య లహరి-14
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం
పసి శిశువుకు ఆకలియై పాలుకోరు ఇచ్చాశక్తి
ముసురుకొన్న పాపాలను తొలగించే ఇచ్చాశక్తి
పాలకొరకు అమ్మ స్తన్యమును జుర్రుకొనే జ్ఞానశక్తి
ఆర్తితీర అమ్మ స్తవము జుర్రుకొనే జ్ఞానశక్తి
పాలుతాగి కడుపు నింపుకునే క్రియాశక్తి
మురిపాలు తీర అమ్మఒడి పరవశమగు క్రియాశక్తి
మూడుపనులు చేయించే మూలచిచ్చక్తి అని
భక్య భోజ్య చోహ్య లేహ్య పానీయలతో
భక్తిపాత్రలో నింపి, భవతారక స్తుతులతో
అనుభవైకవేద్యము మహా నైవేద్యము అయిన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" గుఢాన్న ప్రీత మానసా-హరిద్రాన్నైక రసికా-ధ్ద్ధ్యాన్నాసక్త హృదయా" అంటు శ్రీలలితా రహస్య నామ స్తోత్రములలో అమ్మవారికి పులిహోర-పెరుగన్నము-బెల్లముతో చేసిన పరమాన్నము ఇష్టమైన నైవేద్యములుగా పేర్కొనబడినది కేవలము.ఆహార పదార్థములను అమ్మవారికి సమర్పిస్తే అవి ప్రసాదమవుతాయా? అన్న సందేహమును తొలగించుకొనుటకు మరి కొంచము పరిశీలిద్దాము.(పెద్దలు నా భావనలోని తప్పులను సరిచేయుట అమ్మ అర్చనగా భావించగలరు.
ఆహారపదార్థములను భక్ష్య-భోజ్య-చోహ్య-లేహ్యములుగా పెద్దలు చెప్పినారు.గట్టిగా కొరికి తినునని-నమిలి తినునవి-చప్పరించి తినునవి-పానీయములుగా స్వీకరించునవి అని విభజించినారు,అమ్మవారికి అర్పించిన ఆహారపదార్థములు దోష రహితములై అమ్మ అనుగ్రహము వలన ప్రసాదగుణమును పొందుచున్నవి.నైవేద్య సమయమునము చేయు మంత్రోచ్చారణ మిక్కిలి ముఖ్యమైనది.
ఋగ్వేదము ప్రకటించిన గాయత్రీ మంత్రమును అఖిలాండ బ్రహ్మాండ నాయకి మన హృదయములో ప్రవేశించి,జ్ఞాన కాంతిని వెలిగించమని ప్రార్థించుట.దానివలన మనలో తల్లి సూక్ష్మరూపియై ఉన్నదన్న అద్వైత భావము కలుగుతుంది.దానిని అమ్మ ప్రచోదింప చేస్తుంది.(మేల్కొలుపుతుంది.)
మిగిలిన మంత్రములు పంచ కోశ విచారణయే నైవేద్యము అన్న విశేషమును తెలియచేయును.అన్నమయకోశము,ప్రాణమయ కోశము,మనోమయ కోశము,విజ్ఞాన మయ కోశము,ఆనంద మయకోశము నావి అని నేను అనుకొనుట సరికాదు.అమ్మ వానిలో సూక్ష్మ రూపమున ఉండి అవి సరియైన పద్ధతిలో తమ పనులను నిర్వర్తించుచున్నట్లు చేయుచున్నది.నైవేద్యము చేసినతరువాత అమ్మదయతో శరీరము నేను కాను.ప్రాణము నేను కాను.మనసు నేను కాను.బుద్ధి నేను కాను అని తెలుసుకుంటాము.ఫలితముగా నైవేద్యము అంటే రకరకాల పిండివంటల సమర్పణము కానేకాదని,మన పంచకోశ సమర్పణము అని తెలుసుకోగలుగు తున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...