పరమపావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అతిచమత్కారముగా నీ కరుణ ఆవిష్కారముతో
నా అహంకారము చిటికెలో "ఓంకారము" అయినది
సాటిలేనిదైన నీకరుణ సహకారముతో
నా వెటకారము చిటికెలో " ఐంకారముగా" మారినది
మమ్ములను మన్నించు నీదైన మమకారముతో
నా హుంకారము చిటికెలో "హ్రీంకారముగా" మారినది
నీపై భక్తి శ్రీకారమే చిత్రముగా "శ్రీంకారముగా" మారినది
సంస్కారపు సాధన నీ బీజాక్షరములగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా
నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జితా' అని బ్రహ్మాందపురణములోని లలితా సహస్ర నామ స్తోత్రము అమ్మను కీర్తించుచున్నది.లలిత అను పదమునకు క్రీడించునది అను అర్థమును అలంకారికులు తెలియచేసిరి.అమ్మ ఒకే అక్షర్ముగా శబ్దిస్తూ అనేక అర్థములను వివరించే బీజాక్షరములలో క్రీడిస్తు( ఆడుకుంటు ) మనలనందరిని రక్షిస్తుంటుంది.శ్రీ మాత్రే నమః.బీజము అనగా మూలము లేదా విత్తనము బాహ్యార్థము.కానిలోతుగ ఆలోచిస్తే సకలచరాచర జగతికి మూలమైన అమ్మ తత్త్వమును,అనుగ్రహమును వివరించేవి బీజాక్షరములు (ముఖ్యముగా) నాలుగు గురించి తెలుసుకొనుటకు అమ్మ అనుగ్రహముతో ప్రయత్నిద్దాం. అవి,
1."ఓం" బీజాక్షరము.. దీనినే " ప్రణవము" అని కూడా అంటారు.హృదయ పద్మమును వికసింపచేసి సాధకునకు సహాయకారి అవుతుంది.
2."ఐం" బీజాక్షరము శివమునకు శక్తి కలిసిన తత్త్వము.సరస్వతీ రూపము.సాధనను మరికొంత పై స్థాయికి తీసుకు వెళుతుంది.
3" .హ్రీం" బీజాక్షరము శక్తి సృష్టి-స్థితి-లయ తత్త్వమును తెలియచేయునది.
4. " శ్రీం" భౌతిక-ఆధ్యాత్మిక లక్ష్మీతత్త్వ సుసంపన్నమైనది.సాధకునకు సర్వలక్షణ శోభితమైన "సర్వేశ్వరి" అనుగ్రహమును ప్రసాదించునది.
"పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరి " అను నాలుగు విధముల శక్తులు భక్తులమనసులో,హృదయములో,కంఠములో,పెదవులపై పరిపరి విధముల నిన్ను ప్రస్తుతించు సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment