సౌందర్య లహరి-కనకదుర్గ-67
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
సృష్టి -స్థితి కార్యములకు బ్రహ్మ-విష్ణువులను
సృష్టించెను వారికి శక్తులుగ వాణి-శీలక్ష్మిని
లయముచేయుటకుగాను త్రినయనుని సృష్టించె
సగభాగముగ చేరగ పార్వతిని పంపించె
ముగ్గురమ్మలకు మూలముగా నీవున్నావమ్మా
దుర్గమము అను పదము ఎపుడో నిర్గమించినదమ్మా
పసుపు-కుంకుమలతో,పట్టుచీరలతో-గాజులతో
కనక దుర్గ మాతగా నీవు కనికరించుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" దుర్లభా-దుర్గమా-దుర్గా-దుఖఃహం త్రీ-సుఖప్రదా" శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రము దుర్గమ్మను కొనియాడుతున్నది.దుర్గమ్మ స్వభావము ఎటువంటిది? తెలుసుకోవాలనుకుంటే,
దు:ఖమును తొలగించి సుఖము కలిగించునది కనికరమనే కనకము గల కనకదుర్గమ్మ.
దుర్గమ్మ పదమునకు ముందు దుర్లభా-దుర్గమా అను రెండు పదములు కలవు. ఇక్కడ ఒక దుర్గము (ఎత్తైన గోడలు కల కోట దుర్గము) మనది.అది అరిషడ్వర్గములతో-ఐహిక బంధములతో,అజ్ఞానముతో,దట్టమైన చీకటితో నిండినది.దాని నుండి బయట పడుట సులభము కాదు కనుక మానవ దుర్గము దుర్లభము మరియు దు:ఖ ప్రదము.దానిని అధిగమించుట అసాధ్యము.
రెండవ దుర్గము తల్లి మనకొరకు రక్షణగా నిలిపిన అనుగ్రహము.ఈ దుర్గము అనురాగ బంధముతో,అద్వైత భావముతో,అమ్మ తనముతో నిండి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు జ్యోతియై ప్రవేశమునకు అనుమతించు అమ్మ ఒడి.
కనుకనే "కాత్యాయని నామ విద్మహే కన్యకుమారి ధీమహి-తన్నో దుర్గి ప్రచోదయాత్",కాత్యాయన మునిని కూతురిగా అనుగ్రహించిన తల్లీ,హిమాలయమునుండి కన్యా కుమారి వరకు నీ అనుగ్రహముతో అమృతమయము చేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment