సౌందర్య లహరి-మాధవేశ్వరి
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
గంగ-యమున-సరస్వతి త్రివేణి సంగమము
ఇడ-పింగళ-సుషుమ్న ల నాడీ సంకేతము
అమృతబిందువులు పడిన అమృత తీర్థరాజము
అలోపిగ-అరూపిగ అమ్మ ఇచట ఆరాధ్యము
మాయాసతి చేతివేళ్ళు పడిన చివరి ప్రదేశము
కొయ్య స్తంభమున తల్లి కొలిచిన కొంగు బంగారము
ప్రకృష్ట యాగ వాటికయైన పవిత్ర ప్రయాగలో
మాణిక్యేశ్వరుని దేవి మాధవేశ్వరి బ్రోచుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానసవిహారి ! ఓ సౌందర్య లహరి .
" త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం సమాహృతి
ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా
బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా
ప్రయాగే మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"
అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.
అమ్మవారిని అరూపిగాను,చెక్క ఊయలపై చిద్విలాసముగా ఊగుచున్న ఉమాదేవిగాను కొలుస్తారు.అమ్మను దీపాలను వెలిగించి,పుష్పాలతో వాటిని అలంకరించి ఆరాధిస్తారు.అమ్మవారిని నూతన వధువుగా అన్వయించుకుంటూ,ఒకసారి నూతన వధువుగా పల్లకిలో తల్లివెళ్ళుచున్న సమయములో కొందరు దొంగలు బోయీలను,బంధుమిత్రులను హింసించి,వధువును బంధించ ప్రయత్నించగా అమ్మ పల్లకినుండి దూకి అంతర్ధానమయినదని,పల్లకిని కూడ అమ్మ ప్రతిరూపముగా భావించి,నూతన వధూవరులు అమ్మను దర్శించి,ఆశీర్వచనములు పొందుతారు.అమ్మను అలోపి అనగా ఎటువంటి లోపములులేని మూర్తిగా భావించి,కొలుస్తారు.
"మననాత్- ధ్యాయాత్ లభ్యతే ఇతి మాధవేశ్వరి" చెంతనున్న సమయమున, నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment