Thursday, August 9, 2018

RUDRAASHTAKAMU.

  శ్రీ రుద్రాష్టకము.(గోస్వామి తులసిదాస విరచితము)
 ****************************************************

 నమస్తే పరబ్రహ్మమీశాన దేవ
 వేదస్వరూపమైనావు మము బ్రోవ
 గణాలెన్నో కొలువ గుణాతీత నిన్ను
 చిదాకాశవాసా నన్ను భజియింపనిమ్ము
...............
 ఊర్థ్వ ముఖుడైన ఈశానుడు సృష్టి-స్థి-లయ-తిరోధానము-అనుగ్రహము (పుట్టుట-పెరుగుట-లీనమగుట-జగతిని దాచుట-తిరిగిప్రకటించుట) అను ఐదు పనులను నిరంతరముచేయుచు,మనలను అనుగ్రహించుచుండును.ప్రమథ గణములచే కొలువబడు గుణరహితుడైన పరమేశుడు ,భజించుటకు నన్ను అనుగ్రహించును గాక.

ఓంకార-నిరాకారములైన దేవ
త్రిగుణాలపై నున్న స్థితి నీవుకావ
కరమందు శూలంబు కరుణించ రమ్ము
సంసారమును దాట నిన్ను భజియింపనిమ్ము.

 సత్వ-రజ-తమో గుణములను దాటి ఉన్న నాల్గవ స్థితి చిదానందమైన శంభుడు,తనచేతి యందలి శూలముబు కృపాకారిగా మార్చి,సంసారబంధములను తెంపి,భజన అనే నావలో ఒడ్డును చేరుటకు అనుగ్రహించును గాక.

   చల్లందనమును-తెల్లదనమైన దేవ
 ఉన్మత్తగంగనుద్ధరించినది నీవు కావ
 కోటిసూర్య ప్రభాకాంతులను విరజిమ్ము
 బాలేందుమౌళి నన్ను భజియింప నిమ్ము.

  మంచుకొండపై చల్లని మనసుతోతెల్లనినిష్కళంక ప్రకాశముతో,కోటిసూర్య ప్రకాసవంతుడైన శివుడు(కోటి=అనంత వాచకము.లెక్కకు మించినది.)గంగను సంస్కరించి, నిరంతర భజనాసక్తిని నాలో కలిగించి,అనుగ్రహ వీక్షణములను మనపై ప్రసరించును గాక.

   నిజము-నిర్గుణము-నీలకంఠమైన దేవ
 కపాల ప్రకటిత కాలాతీతుడవు కావ
 ఆర్తనాదములను కుండలములు విననిమ్ము
 గజచర్మధారి కిల్బిషము కడతేర్చ రమ్ము

  ఆర్తశరణ్యుని చెవి కుండలములు కరుణాంతరంగులై ఆలకించుచు ఆర్ద్రతతో కదులుచున్నవి.స్వామి కపాలమాలలోని తలలు వామి కాలాతీత తత్త్వమును చెప్పకనే చెప్పుచున్నవి.గజాసురుని చర్మును ఒలిచి వస్త్రముగా ధరించు స్వామి నా పాపములను ఒలిచి నన్ను కడతేర్చును గాక.

 అండం-అఖండం రూపైన దేవ
ప్రచండం-ప్రశాంతం అది నీవు కావ
కళ్యాణ-కల్పాంతకారీ శరణమిమ్ము
భవానీపతి మమ్ము భజియింపనిమ్ము

 స్థూల-సూక్ష్మరూపములతో ,ప్రశాంత-ప్రచండ తత్త్వముతో ప్రకాశించుచు,శుభాశుభ నిర్వాహకుడైన నిటలాక్షుడు,మనలకు శరణునొసగి అనుగ్రహించును గాక.

లంకాపురిదాత-పురారీశ దేవ
శాంకరినాథ మన్మథ సంహారి నీవ
విడలేని మోహాన్ని వేగ తొలిగించు
మనసార భజియింప నన్ను కరుణించు

  రావణునికి లంకాపురిని దానమిచ్చినవాడు,త్రిపురాసురులను ఓడించినవాడు,మన్మథుని దహించినవాడు,జటిలమగు మోహమును నశింపచేయువాడు అగు గౌరీపతి మనలను అనుగ్రహించును గాక.

  ప్రసన్నం ఉమానాథ పాదారవిందం
 ప్రయత్నం నగాధీశ నామ  సుధ పానం
 ప్రసిద్ధం సుఖం శాంతి సౌభాగ్యదాతం
 ప్రసీద ప్రసీద ప్రభో పాహి పాహి!

 తులసీదాసు గొప్ప రామభక్తుడు.రాముని అనుగ్రహమును పొందినవాడు.హనుమంతుని కరుణాపాత్రుడు.తన అవసాన దశలో వారణాసిలో గడుపుతు శివ-రామ అభేదమును కనుగొనగలిగి ఈ రుద్రాష్టకమును మనలకందించి చరితార్థుడాయెను.సంస్కృత భాషాప్రవేశము లేనివారును చదువుకొనుటకు ,ఆ స్వామి నిర్హేతుక కరుణాకటాక్షము ,నన్నొక పరికరమును చేసి పైవిధముగా పలికించినది.నా అతిపెద్ద సాహసమును క్షమించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

  (ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...