Friday, July 12, 2019

DASAMAHAVIDYA-BHUVANESVARI.


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

 నమామి భువనేశ్వరీదేవి మహాశక్తిం నిరంతరం.

శార్దూలము.. భువనేశ్వరీ దేవి వివరణ.

ఆవిర్భావము జేసె శక్తి తన ఛాయారూప సంకల్పమున్
దేవీ రాజస భైరవాంక నిలయా  దేదీప్య ప్రేతాసనుల్
దేవీజ్ఞాన శిరోవిభూషణి సదా దేవేశ్వరీ  ప్రేరణల్
దేవీపట్టణ రత్నకాంతులు మణిద్వీపస్థితంబుల్  దివిన్!

భావము: ఆదిశక్తి సంకల్పంతో తన ఛాయా రూపమును భువనేశ్వరిగా సృజించింది. భైరవుని సహచారిణిగా ఆయన ఒడిలో పంచప్రేతాసనాసీనులై ఉంటారు భైరవుడు, భువనేశ్వరి. ఆమె దేవతలకే ఈశ్వరి, దేవతలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అత్యుత్తమజ్ఞాన శిరోవిభూషణి. ఆమె నివాసము - మణిద్వీపములోని  దేవీపట్టణము (శ్రీపురం లేదా శ్రీచక్రము).






   శ్రీమాత్రేనమః
   ***********
  " ఓం భువనేశీ భువారాధ్యా భవానీ భయనాశినీ
    భవరూపా భవానందా భవసాగర తారిణీ
    భవనా భువనేశానీ భువనానందకారిణీ
    భువనస్థా భువిరూపాచ భువిభార నివారిణీ" నమస్తే."

   భువనము అంటే ప్రపంచము.భువనమునకు సృష్టికర్త భువనేశ్వరి.విశ్వములోని ప్రతిజీవి,ప్రతివస్తువు,నైసర్గికము
అమ్మ అవయములే.

  ఆవిర్భావ కారణము
*********************

    హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి,సముద్రములోపల దాగిన సమయమునజగములన్నీ నిర్వీర్యములైనవి.బ్రహ్మ శక్తిహీనుడైనాడి.సృష్టికార్య నిర్వహణ జరుగుట లేదు." అన్యథా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ" అంటు బ్రహ్మ, పరాశక్తి కరుణకై ఘోర తపమును చేశాడు.అవ్యాజకరుణామూర్తి యైనతల్లి అనుగ్రహమే భువనేశ్వరి ఆవిర్భావము.


 ఆవిర్భావ విధానము
 ********************
    అయోమయ స్థితిలో నున్న బ్రహ్మ వద్దకు ఒక దివ్య విమానము వచ్చి ఆగినది.దాని నెక్కిన బ్రహ్మ తనతో పాటుగా హరిహరాదులను కూడా కూర్చోబెట్టుకున్నాడట.ఆ దివ్య విమానము చింతామణి గృహములో శివ వామా0కస్థ యైన ఆదిపరాశక్తి ముందు ఆగినదట.నిర్వీర్యులైన త్రిమూర్తులుగా స్త్రీ రూపధారులైనారట.తల్లి వారిని సంస్కరించి,తన శక్తులైన బ్రహ్మణి-రుద్రాణి-  వైష్ణవి లను త్రిమూర్తులకు ప్రసాదించి,తిరిగి వారిని శక్తివంతులను చేసినదట.కాలాతీత-గుణాతీత యైన తల్లి లోకముల సృష్టి-స్థితి-సంహార భారమును తానే నిర్వహించ దలచి,భూమాతను రక్షించి,భువనభాండముల నిర్వహణను తానే చేపట్టింది.ఎంతటి శుభతరుణము.ఇచ్ఛాశక్తి మాతృవాత్సల్యమును కూడి " ఈక్ష" గా మారినది.శ్రీ మాత్రేనమః మాతృత్వముతో నిండిన ఇఛ్ఛాశక్తిని "ఈక్ష" అని అంటారు.

 రూపము
 *******


 " ఉద్యత్ దినద్యుతిం ఇందుకిరీటాం తుంగకుచాం నయనత్రయ యుక్తాం
   స్మేర ముఖీం వరదాంకుశపాశాం భీతికరాం ప్రభజే భువనేశీం".
 .

  భువనేశ్వరితల్లి ముగ్ధమనోహర సుందర రూపమును చూచుటకు రెండు  కళ్ళు చాలవు కనుక శివుడు త్రయంబకుడైనాడని లోకోక్తి..తలపైన చంద్రరేఖ అమృతమును వర్షిస్తుండగా మందస్మిత వదనముతో,రెండుచేతులు అభయ -వరద ముద్రలతో,మరొక రెండు చేతులలో పాశాంకుశములతో,గౌరవర్ణియై లోకాతీత సౌందర్య రూపముతో ,దక్షిణ భాగమున భువనేశ్వరునితో-వామ భాగమున భువనేశ్వరి అపురూపదర్శనమును అనుగ్రహిస్తుంది.భూమ్యాకాశాలను నిండిన దిక్శక్తి విశ్వ పాలనమును సాగిస్తున్నది.
 " విశ్వకర్తీ జగన్మాతా గోప్త్రీ గోవిందరూపిణి."

 విశ్వమే భువనేశ్వరి.అన్ని జీవులు ఆమె అవయవములు.బిడ్డలకోసము తాను ఆకాశముగా మారి అక్కడ వస్తువులను సృష్టిస్తుంది.అవసరమును బట్టి వానిని విస్తరింపచేస్తుంటుంది.భువన శబ్దమునకు భూమి యను అర్థముతో పాటు ఆకాశ పరముగా కూడ పెద్దలు అన్వయిస్తుంటారు.సూర్యుని బ్రహ్మవిష్ణు మహేశుల సృష్టి తరువాత, విశాల సృష్టి చతురతను,భువనేశ్వరీదేవి సూర్యమండల మధ్యస్థయై సూర్యవిధినిర్వహణను జరిపిస్తున్నది.

 " భాను మండల మధ్యస్థా భైరవీ భగమాలిని అని స్తుతించినా,

   " భాస్కరస్థా భాస్కరేశీ భాస్కరైశ్వర్యవర్ధినీ
     భాస్కరానందజననీ భాస్కరానందదాయినీ." అని ప్రస్తుతించినా జన్మధన్యమే.

   

స్వభావము
**.*******

 సిధ్ధరాత్రియైన  భువనేశ్వరి త్రయంబక నామశివశక్తిని తనలో కలుపుకొని పరిపూర్ణమవుతుంది.భూదేవిని రక్షించిన నారాయణుని వరాహావతారముగా భువనేశ్వరిని కీర్తిస్తారు.
  "పయః పశూనాం రసమౌషధీనాం" అన్న సూక్తిని నిజము చేస్తు,భువనేశ్వరీదేవి వాగ్దేవతయై సాధకులలో విషయవాసనలను తొలగించి,వారిపై జ్ఞాన మకరందమును వర్షించుటయే కాక,సవితృ- సూర్యదేవతయై పశువులలో పాలుగా,కూరలో రసముగా మారి స్థితికారిణిగా పాలిస్తుంటుంది.శతాక్షియై తన కన్నుల నుండి సుధలను వర్షింపచేస్తు,వేద ధర్మమును పరిరక్షిస్తుంటుంది.సుధాసారాబ్ధి వర్షిణి జగన్మాత.

   


 నివాసస్థానము
****************


  అమృతార్ణవములోని ప్రశాంత నీలోదకాల్లో మణిద్వీపము లో అత్యంత సుందర చింతామణుల మండపముంటుంది.అక్కడ రత్నఖచిత సింహానముపై కుడివైపున భువనేశ్వరుని కూడి ఎడమవైపున విశ్వమునురూపముగా ప్రకాశించు విమర్శరూపిణి యైన భువనేశ్వరీదేవి ఆసీనయై ఉంటుంది.సిధ్ధరాత్రియైన భువనేశ్వరి త్రయంబకమను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది.భూసంరక్షణ చేసిన వరాహమూర్తిగా భావించే భువనేశ్వరి మూలబిందువు నుండి పశ్చిమ దిశకు వ్యాపించి ఉంటుంది.యజుర్వేదం అంటే భువనేశ్వరియే.వేద మంత్రములు ఆమె కన్నులు.

   అంతరార్థము

   *************

  వేదాలు తల్లిని అఖండశక్తిగా" అదితి" అను నామముతో పేర్కొన్నాయి.సర్వరూపాల మూలప్రకృతి భువనేశి.ఆమె కున్న శివమయీత్వము వలన ఆమెను జ్యేష్ఠా-కర్మ నియంత్రిణి అనికూడ పిలుస్తారు.య-జు అను వర్ణములు తల్లి స్థితి-గతి ని సూచిస్తాయి.సమస్త విషయ వాసనలను సాధకునిలో నశింపచేసి వానిపై జ్ఞానసుధాసారమును వర్షిస్తుంది.

  దేవాలయములు
 **************

  విశ్వకవి రవీంద్రనాథ భువనేశ్వరిని తన రాజర్షి నవలలో ప్రస్తుతించినాడు.ఉదయపూర్లో,నీలాచల కొండలమీద,ఇంకా పలుచోట్ల ప్రకృతిలోని అంతర్లీన శక్తియైన మాతా భువనేశ్వరి దేవాలయములు కలవు.

ఫలసిధ్ధి
 *******

  భువనేశ్వరి శక్తి ఉపాసకునికి త్రికాలజ్ఞానమును,రాజ్యాధికారమును,సకలసిధ్ధులు అమ్మ అనుగ్రహిస్తుంది.

  భాద్రపదశుక్ల అష్టమి ప్రీతిపాత్రమైన తిథి. భువనేశ్వరి దేవి ప్రకృతిశక్తి యొక్క మహత్తర అండకోశము కనుకనే విశ్వసృష్టిని సంకల్పమాత్రముగా చేస్తుంది.స్థితి కార్యమును నిర్వహిస్తుంది.సమయమాసన్నమైనపుడు తనలో లీనము చేసుకుంటుంది."సర్వేశి-సర్వరూపి-సర్వశక్తిఫలప్రద యైన భువనేశ్వరి పాదారవిందములకు సవినయ భక్తిప్రఓత్తులతో సమర్పిస్తూ,
"
" భూచరీ ఖేచరీ మాయా మాతంగి భువనేశ్వరి
  కాంతా పతివ్రతా సాక్షీ సుచక్షుః కుండవాసినీ"

https://www.youtube.com/watch?v=W2ECpLNNak8&feature=youtu.be

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

  నమస్తస్త్యై నమస్థస్త్యై నమస్తస్త్యై నమోనమః.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...