Saturday, September 28, 2019

YAA DEVI SARVABHOOTESHU-01 ( MAHAAKAALI)

 యాదేవీ సర్వభూతేషు-01
 ********************

  దశమహావిద్యలలో కాళివిద్య మొదటిది.మహాకాళుని శక్తిగా లయకారిణిగా సంహారస్వరూపిణి అయిన కాళీవిద్య వేదములలో మంత్రరూపముగా తేజరిల్లుచున్నది.కాళి శక్తిది మంత్రశరీరము.మనవి మాంసశరీరములు.కనుక తల్లి ఘోరరూపమును,లావణ్యమును గురించి తర్కింపజాలము.అగ్ని స్వరూపిణి అయిన కాళిశక్తి నల్లని శరీరఛాయతో ప్రకటింపబడుట తల్లి లీలావిశేషము.ప్రళయానంతర ఆదిమ తమస్సుగా (కన్యారాశితో) జ్యోతిష్కులు పోలుస్తారు.

 అధర్వణ వేద ప్రకారము దక్షిణాచార-వామాచార (తాంత్రిక) పూజావిధానములు శాంప్రదాయములు ప్రాంతీయ పరంపరా భేదములే కాని,పరమేశ్వరికి ప్రీతిపాత్రములు కాదనలేము.అంతర్యాగ-బహిర్యాగ విధానము కూడా అంతే.ఇది సరి అని ఇదమిథ్థముగా చెప్పలేము.నియమ నిష్ఠలతో,అకుంఠిత విశ్వాసముతో చేయు ఏ పూజావిధానమైనను.ఆచరణీయమే.అనుగ్రహ పాత్రమే.

 అస్సాంలోని కామాఖ్యలో వెలిసిన కాళినుండి వరంగల్లు భద్రకాళి వరకు అన్నె అమ్మరూపాలే.

  కఠినరూపము-కారుణ్య స్వభాముల మేళవింపు కాళి తల్లి.

 అంధకారములో సమస్తమైన ఆకారాలు సమానముగ అయిపోయి గుప్తస్థితిని పొందుతాయి. ఈ గుప్త తత్త్వమే కాళిదసమహావిద్య." యాదేవి సర్వభూతేషు గుప్తరూపేణ సంస్థితా." అనేక నమస్కారములు అమ్మా.

   కాళీమాత ఇచ్ఛాశక్తి.తన సంకల్పముతో జలమయమయిన భువనములను తిరిగి సృష్టిస్తుంది.సుసంపన్నము చేస్తుంది." యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థితా."

   సృష్టివ్యాపార సమయమున శివుడు తటస్థుదుగా ఉంటాడనుటకు శివశరీరము అచేతనముగా పడిఉంటుంది.కాళి దానిమీద నిలబడి,తన కుండలినిని జాగృతము చేసి శివశక్తిని జాగృతము చేస్తుంది.జగములను పాలించుటకు జగన్నాథుని శక్తివంతుణ్ణి చేస్తుంది." యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా."


  శివుడు పగటికి ప్రతీక.దశమహావిద్యలు రాత్రులకు ప్రతీక.మహారాత్రియైన కాళి,మహాకాలుని శివశక్తిని తనతో కలుపుకొని పరిపూర్ణమవుతుంది.పరిపాలన చేస్తుంది." యాదేవి సర్వభూతేషు స్థితిరూపేణ సంస్థితా.

  యశోద మాతకు జన్మించి,దేవకిమాత ఒడిచేరి,కంసుని దుర్మార్గములకు రాబోవు చెడు ఫలితములను హెచ్చరించిన యోగమాయ కాళి.కాళి తత్త్వము నారాయణుని దశావతారములలో శ్రీకృష్ణావాతారముగా గణుతికెక్కినది." యాదేవి సర్వభూతేషు మాయా రూపేన సంస్థితా."

  మనము కాలముతోపాటు మొదటినుండి లేము.చివరివరకు కాలముతో కలిసి నడుస్తామన్నది కల్లమాట.కాలముతో చేయు స్వల్ప ప్రయాణమే భౌతికత్వము.పూర్తిగ నడువగలుట అమరత్వము.తల్లి తన సంకల్పముతో వర్తమానమును గతముగను,భవిష్యత్తును వర్తమానముగాను చేయగల శక్తి.కాళి కనుసన్నలలో కాలము గతి-స్థితులుంటాయి." యాదేవి సర్వభూతేషు కాల రూపేణ సంస్థితా."

 దండనం దశగుణం భవేత్ అన్న ఆర్యోక్తికి తల్లి అసురసంహార మే ఆదికావచ్చును.విష్ణు చెవి గూలి నుండి ఉద్భవించిన మథు-కైటభులను కాళి సంహరించి,దేవతలను రక్షించినది.అదేవిధముగా శుంభ-నిశుంభులతో చండిక యుధ్ధభూమిలో నున్నప్పుడు కాళి,పరమేశ్వరి దక్షిణ పార్శ్వ రక్షకురాలిగా,తన శౌర్య పరాక్రమములతో,దూతగా రాక్షసుల వద్ద నుండి,వచ్చిన ధూమ్రలోచనుని వధించి అమ్మను సేవించుకొన్నది.దశమహావిద్యలకు-నవరాత్రులకు గల సంబంధము ఇదే.నవరూపములను తననుండి సృజించి,వారిని తనను సేవించుకొనే భాగ్యము కల్పించినది పరమేశి." యాదేవి సర్వభూతేషు రౌద్రరూపేణ సంస్థితా."



 .ప్రకృతి పరిణామముల ఫలితముగా ఈ సమయములో దక్షిణ దిశలో యమకోరలు అంటువ్యాధులతో,అపమృత్యువులతో,అలజడులతో చుట్టుముట్టి అలజడులు లేపుటకు ప్రయత్నిస్తుంటాయి.తల్లి దాక్షిణ్యముతో తన స్థావరము చేసుకొని,వాటిని అడ్డుకుంటుంది." యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా."


  గ్రహగమనము ప్రకారముగా తల్లి శనైశ్చరుని {మెల్లగ కదులు వాడు) గమనము నందు కలుగు కష్టములను తొలగిస్తుంది.శనిని అనుభవమును నేర్పి ఆనందింపచేయువానినిగా ఆదేశిస్తుంది." యాదేవి సర్వభూతేషు అనుగ్రహ రూపేణ సంస్థితా.


   రక్తము సదా ప్రవహించే అనాహత చక్రము కాళినివాసము.గుండెలోని నాళములు తల్లి నాలుకలు.నిత్యము గుండెలో మునిగి రక్తాన్ని పీల్చి-విడుస్తు ఊపిరిగా మారుస్తుంది కరుణతో కాళి.మనలోని ప్రాణశక్తియే కాళి.కాదనగలమా! " యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా.అనేక నమస్కారములు అమ్మ.

 కాళిశక్తి ఆరాధన సకల వ్యాధి నివారణము.శత్రునాశనము.సకలలోక పూజనీయత లభిస్తుంది.

  " కాళీ కపాలినీ కాంతా కామదా కామ సుందరి

  కాలరాత్రి కాలికాచ కాలభైరవ పూజితా.'

 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః."

  శ్రావణ బహుళ అష్టమి తిథి ప్రీతిపాత్రమైన నిఋతి (కాళి) మనలను అనుగ్రహించుగాక.

  సర్వం శ్రీకాళిమాత చరణారవిందార్పణమస్తు.


  యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవత్
 తత్సర్వం క్షమ్యతాం దేవీం కాళీ మాతా నమోస్తుతే.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...