మార్గళి మాలై-02
****************
రెండవ పాశురము
***************
వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు
చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి
నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం
శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం
ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి
ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*************************
శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.
పాలు-నెయ్యి తినుట మాని జిహ్వను జయిద్దాము
పాలకడలి శేషశయనుని భక్తితో సేవిద్దాము
కాటుక-పువ్వులు వద్దని దేహభ్రాంతి వీడుదాము
కాయక-వాచక-మానస శుధ్ధితో వేడుదాము.
నియమానుసారముగా నిషిధ్ధ కర్మలు వదిలేద్దాము
సాధువులకు-పేదలకు భిక్షా సమర్పణలను చేద్దాము
చెడు మాటలు మాటాడక-చెవిలోనికి రానీయకుమని
తరలివచ్చినది తల్లి తానూ ఒక గోపికయై,
పాశురములములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
" నప్పిన్నాయ్ తిరుప్పావై" వ్రతమాచరింప రారో! ఓ గోపికలారా!
ఈ పాశురమును గోదమ్మ "వైయత్తు వీళ్వారాళ్" అని ప్రారంభించినదిచీకటితో నిండియున్న ఈ భూమండలమందున్న వారైనను దాని దరిచరనీయక సంతోషులై ఉన్నవారందరు వ్రతాచరణమునకు యోగ్యులన్నది అమ్మ.
.(పార్కడలుళ్) పాలకడలిలో శయనించు స్వామియే రక్షకుడు అను నిశ్చయజ్ఞానము కలది తల్లి కనుక "నాముం నం పావై" మనము కీర్తిస్తు చేస్తున్న వ్రతము ఎటువంటిదంటే స్వామి వైభవమును పెంపొందించునది.
మొదటి పాశురములో అమ్మ గోపికలకు స్వామి అనుగ్రహమునకు ఏంచేయవలెనో ఉపాయము చెప్పినది.రెండవ పాశురములో వ్రతనియమములను వివరిస్తు చేయవలసిన పనులు-చేయ కూడని పనులను తెలియచేస్తున్నది.
చేయవలసిన పనులులలో "నాట్కాలే నీరాడి"-అనగా బ్రహ్మీ ముహూర్తసమయముననే స్నానము చేయాలి.జలకము-కీర్తనము అతి ప్రధాన నియమములు.తెల్లవారక ముందే ఎందుకు అను సందేహము మనకు కలుగుతుంది.తెల్లవారుతూనే మనలోని సంసార బంధములు చుట్టుముట్టి సంసార సాగరములో మునకలు వేయిస్తాయి కనుక నల్లనయ్య మేనిచాయను పోలిన నల్లని సమయములో నల్లనయ్య గుణగానములను పవిత్రజలములో స్నానముచేస్తే తక్కిన విషయవాసనలు తామే దూరము జరుగుతాయి.
రెండవ నియమము అర్హులైన వారికి "అయ్యయున్-పిచ్చయున్-ఆందనయున్" ఆచార్యులకు-పేదలకు-భాగవతులకు భిక్షస్వరూపముగా దానముల స్వరూపముగా పరమాత్మునిగా భావించి చేయవలెను.
మూడవ చేయవలసిన పని స్వామి గుణగాన కీర్తనమును అనన్య శరణాగతితో కీర్తించవలెను.
పరమాత్మ దివ్యవిభూతులను పదిమందితో కలిసి పంచుకొనవలెను.
గోదా తెలిపిన చేయకూడని పనులు.జిహ్వ వ్యామోహము లేకుండుట.వారు గోపికలు.గో సంపద వారి మూలధనము.వారికి పరమాత్మ ఇచ్చిన సంపదను స్వామి కైంకర్యమునకు వినియోగించవలెనుప్రతిరోజు మిక్కిలి ఇష్టముగా తిను వానిని తినవద్దు.. పాలు-నెయ్యి తినక పవిత్ర నైవేద్యమును చేయుదుము.ధనవ్యామోహమును విడిచిపెట్టుదాము.
దేహవ్యామోహమును కూడ వదిలివేద్దాము.కన్నులకు కాటుక-కొప్పులో పూవులను అలంకరించుకోవద్దు.బాహ్యసౌందర్యమును పట్టించుకోవద్దు.
ధన వ్యామోహమును-దేహ వ్యామోహమును విడిచిపెట్టుటయే కాదు.
" శెయ్యాదన శెయ్యోం తీక్కురళై చ్చెందోదోం"
మనసును నియంత్రిస్తూ మాధవుని సేవించు ఈ పవిత్ర దినములలో కోరి వెళ్ళి కొండెములను చెప్పొద్దు.వినవద్దు.ఇంద్రియములను నియంత్రిద్దాము.
పాలకడలికి వెళ్ళి శేషశయనముపై పవళించి యున్న స్వామిని కీర్తిద్దాము.కాదు కాదు స్వామి పాదపద్మములను కీర్తిస్తూ,పరమానందముతో స్వామిని పిలిచి,కాత్యాయినీ వ్రతమును చేసుకుందామని ఆండాళ్ తల్లి గోపికలను సిధ్ధపరచినది.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
No comments:
Post a Comment