Thursday, May 28, 2020

OM NAMA SIVAAYA--06


  ఓం నమః శివాయ-06
  ****************

  జలచరముల ఎంగిలిజలములు అభిషేకములు
  ఝంకారములు వినిన  మల్లియలు అలంకారములు

  లాలాజలమున తడిసి, మేలైనవి మంత్రములు
  గాలివాటమునకు కదిలి గుబాళించు పరిమళములు


  హృద్యమో/చోద్యమో చెంచులు పంచుతున్న ప్రసాదములు
  ముంతలు-వింతలు-వంతలు-ఇంతే సంగతులు

  నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా
  నిన్ను ధ్యానించమనిన తనపని కాదంటుంది

  నిలకడగ ఉండమనిన అటు-ఇటు పరుగిడుతుంది
  వద్దన్న పనులుచేస్తు,తనను ముద్దాడమంటుంది

  బుధ్ధిలేక ఉంటుంది-హద్దు మీరుతుంది,నా
  తైతక్కల మనసు నీది ఓ తిక్కశంకరా.



  శివునికి ఎంగిలి నీళ్ళ అభిషేకము,ఎంగిలి పూలమాలల అలంకారము ఇష్టము.మంచి-చెడు వాసనలను సమముగా స్వీకరించు గాలి తెచ్చిన పరిమళములు ఇష్టము.అంతే కాదు చెంచులు అందించు మద్యమాంస సమర్పణము ఇష్టము.నైవేద్యముగా స్వీకరించి వారికి ప్రసాదమును అందిస్తాడు.వారి మాటలకు తాన-తందాన అని వంత పాడుతాడు.అట్తి శివుని నా తైతక్కలమనసే సరియైన నైవేద్యము.-నింద



  " నమో విరూపేభ్యో-విశ్వరూపేభ్యశ్చః" నమో నమః.మనము ఏది వికారరూపము అనుకుంటామో-విశిష్ట రూపము అనుకుంటామో-విశ్వము అనుకుంటామో అన్నియును రుద్రుని రూపములే.జలము-జలములోని జలచరము.పూవు-పూవు మీద వాలిన తుమ్మెద,పరిమళము-దానిని వ్యాపింపచేయు వాయువు,చెంచు-చెంచు చేయు పూజ అన్నియును శివస్వరూపములే.స్వామి కరుణయే పదార్థమును ప్రసాదముగా మలచుచున్నది.స్వామి నా తైతక్కల మనసును స్పృశించి,దానికి ఆధ్యాత్మిక అనుభవమును అనుగ్రహించు.నమస్కారములు.-స్తుతి.


   ఏక బిల్వం శివార్పణం.

.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...