ఓం నమః శివాయ-33
******************
ఎడమకాలి చెప్పు కుంచె ఎంతో నచ్చేసిందా
ఎరుకలవానిని వింతగ నెత్తికెక్కించుకున్నావు
నాయనారు నిర్లక్ష్యమునకు కోపము వచ్చేసిందా
పాతగోచి కోసము ఎంతో పేచీ పెట్టావు
లింగధారుల నియమములు సాంతం కట్టేసాయా
కుంచము నీవనగానే మంచిది అనుకున్నావు
వంకర పరీక్ష చేయాలను తలపొచ్చిందా
వంకయ్య గొడ్డుటావు పాలకు అడ్డుచెప్పకున్నావు
తిలకవ్వకు తికమకలు చూపాలనిపించిందా
కౌగిలించుకొనగానే మగవానిగా మార్చావు
మిక్కిలి ప్రేమయని మక్కువ చూపిస్తానంటు
చిక్కులుపెడుతుంటావురా ఓ తిక్కశంకరా.
ఎడమకాలి చెప్పును చీపురుచేసి,శివలింగార్చిత పత్రిని తోసివేసిన కన్ననికి శ్రీకాళహస్తి కొండమీద,గుడిని కట్టించి తన నెత్తిమీదుంచుకున్నాడు
( పెరియ పురాణం) .పాతగోచీ ముక్క కోసం అమరనీతి నాయనారుతో ఎన్నో వింత పేచీలు పెట్టినాడు.(బసవ పురాణ భక్తులు)ఒక లింగధారుల గుంపు దూర ప్రయాణమును చేయుచు,పూజా సమయమైనందున ఒక చోట ఆగి,శివలింగమునకై వెతుకగా వారికి కనపడలేదు.పూజా సమయము మించుతున్నదని వారు,వారు తెచ్చుకున్న ఒక బియ్యము కొలిచే కుంచమునకు శివుడని పేరుపెట్టి పూజిస్తే సరే కానిమ్మన్నాడు.వంకటయ్య అను కన్నడ భక్తుని ఇంటిలోని వట్టిపోయిన ఆవుపాలు తన పూజకు కావాలన్నాడు.అంతటితో ఆగాడా? అంటే అదీలేదు.తిలకవ్వ అను భక్తురాలు తనను వెంబడిస్తున్నవారి నుండి తనను రక్షించమని శివలింగమును పట్టుకుంటే,అదే అదనని ఆమెను మగవానిగ మార్చేసాడు.లోకరీతిని లోకువ చేసేవారిని రక్షిస్తూ,యుక్తాయుక్తములు మరిచినవాడు శివుడు.-నింద.
కుంచము నమః శివాయ-మంచము నమః శివాయ
చిక్కులు నమః శివాయ-దిక్కుయు నమః శివాయ
శివాయ నమః ఓం నమః శివాయ
" మార్గా వర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిత్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయితే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తా వతంసాయతే".
శివానందలహరి.
మార్గమున నడిచి-నడిచి అరిగిన ఎడమకాలి చెప్పును తిన్నడు శివుని శరీరమును తుడుచుటకు కుంచెగను,పుక్కిటి నీటితో తడుపుతు దివ్యాభిషేకముగను,ఎంగిలి చేసిన మాంసపు ముక్కలను నైవేద్యముగా (యద్భావం తద్భవతి) సమర్పించి పునీతుడైనాడు.తక్కిన భక్తులు శివానుగ్రహముచే అసాధ్యములను సుసాధ్యములుగా పొంది ధన్యులైనారు.ఆహా! ప్రబలిన భక్తి చేయు ప్రదర్శనలను ఏమనగలము తండ్రీ నీ పితృ వాత్సల్యపు పీయూషములు తక్క.-స్తుతి.
No comments:
Post a Comment