ఓం నమః శివాయ-28
**********************
సారూప్యము-సామీప్యము సాంగత్యమునకు ఆశపడి
నిర్హేతుక కృపనీదని నిన్ను సేవించాలని
కొంచము అటు జరుగమంటే చోటులేదు అంటావు
పోనీలే ఇటు జరుగమంటే వీలుకాదు అంటావు
ఎటు కుదిరితే అటు జరుగమంటే గుటకలు మింగుతావు
స్థపతిని నేనైనా స్థలమునకు అవస్థలంటావు
నాలాంటాడొకడు నన్ను కదలనీయడంటావు
బేలతనము చూపిస్తు జాలిలేక ఉంటావు
ఇబ్బందులు పడుతూనే ఇరుకున కిక్కురు మనవు
సిబ్బందులు చూస్తారని ఇసుమంత సిగ్గుపడవు
సర్వ వ్యాపివన్న సాకుతో నొక్కుతున్న వానిని
తొక్కివేయమేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు తను సర్వస్వతంత్రుడనని-సర్వవ్యాపినని చెప్పుకుంటాడు కాని నిజమునకు అటు-ఇటు కొంచమైనను కదలలేనివాడు.పక్కకు తిరగగానే శివునిలాగానే ఉండే మరో మూర్తి శివుని అటు-ఇటు కదలకు అని మందలిస్తుంటాడు.స్థపతి-అన్నిటిని స్థాపించువాడు అని పిలువబడుతున్నప్పటికిని,కొంచం స్థలమును నేను కూర్చునుటకు సంపాదించలేనివాడు.చేసేదేమి లేక తన పక్కనున్నవాడు ఏమిచెప్తే సర్దుకుంటూఇరుకులో ఇబ్బందిపడుతుంటాడుకాని వాణ్ణి పక్కకు తోయలేని వాడు.-నింద.
ఏకం నమః శివాయ-అనేకం నమః శివాయ
సెల్వం నమః శివాయ- బిల్వం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమః పూర్వజాయా పరజాయచ"
రుద్రనమకం.
ఒకే సత్-చిత్-రూపము హిరణ్యగర్భ రూపమున పుట్టినదిగను-ప్రళయ కాలమున కాలాగ్ని రూపమున పుట్టినదిగాను భాసించుచున్నది.ముందు పుట్టినది-చివరకు పుట్టినది అనుట దాని లీలయే.నిజమునకు దానికి చావు-పుట్టుకలు లేవు.సత్యం-జ్ఞానం-అనంతం బ్రహ్మ సర్వకాల సర్వావస్థలయందు " నమఃస్తారాయచ" గా సంకీర్తింపబడుచున్నది.
" సంసార సాగరాత్ సర్వ జంతూనాం తారయతీతి తారః" తరుణోపాయమే ఇది.
ఈ సత్-చిత్-రూపము
" సహస్రాణి సహస్ర శో యే రుద్రాధి భూమ్యాం"
దశ రుద్రులుగా మారినప్పుడు దశాక్షరీ మంత్రముగాను,శత రుద్రులుగా మారినప్పుడు శతరుద్రీయ సంహితగాను,సహస్రరుద్రులుగా మారినప్పుడు సర్వలోకానుగ్రహ సకలదేవతా స్తుతిగాను సలక్షణమగుచున్నది.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment