ఓం నమః శివాయ-64
********************
సూర్యోదయమగు వేళ సోయగాల రంగులతో
మధ్యాహ్న సమయమున మరో పసిడి ఛాయలో
సూర్యాస్తమయ సమయమున తామ్రవర్ణ తళుకులతో
వృక్షములలో దాగి నీవు హరికేశౌని లీలగా
బూదిపూతలతో నిండిన బూడిదరంగుతో
నరసింహుని శాంతింపచేయ నానారంగులతో
రాత్రివేళ రుద్రులందు నల్లనైన చీకటిగా
పగటివేళ రుద్రులందు తేటతెలుపు రూపుగా
తెల్లని కంఠముతో కాదని నల్లనైన కంఠముతో
క్షణమునకో రంగుమార్చు చంచల స్వభావముతో
ఊసరవెల్లికి ఊహనందించినది నీవేనంటే,నే
ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.
శివుడు ఒక్క రంగుతో నుండక పలురంగులను మార్చుతు,అంతటితో ఆగకుండా తన మనోభావములను కూడ స్థిరముగా నుండనీయక ఘోర-అఘోర రూపములుగా నిలకడ లేకుండ ఉంటాడు-నింద
.
రంగు నమః శివాయ-రూపము నమః శివాయ
భేదము నమః శివాయ-అభేదము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
శివుడు నిరాకార-నిర్గుణ నిరంజనుడు.నిరంజనుడు అనగా ఏ రంగును కలిగినవాడు కాదు.అయినప్పటికిని సృష్టించిన జగతిని పోషించుటకై నానా రూపములతో నానా రంగులతో ప్రకటింపబడుచున్నాడు.కారుణ్యము-కాఠిన్యము ఒకే నాణెమునకు ఇరువైపులు.నల్లని రేగడినేలగా తాను మారి,అందులోని ఒక గింజను చొప్పించి,హరిత మొలకను రప్పించి,దానిని శుష్కముచేసి,దాని కంకులో సరిపడు వడ్లగింజను చొప్పించి,దానిని నూర్చగానే తెల్లని బియ్యపు గింజను మనకు అందిస్తున్నాడు.అదే విధముగా నీలి మేఘముగా సాగుతు,నీటిని నింపుకొని,నల్లని మేఘమై,ఏ రంగు లేని నీటిని వర్షించి,వాన వెలిసిన తరువాత ఏడురంగుల హరివిల్లుగా మారు హరుని నేనేమని వర్ణించగలను.అవ్యాజకరుణతో మనలను రక్షించమనుట తప్ప.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment