ఓం నమః శివాయ-67
*********************
నీ పాదము పట్టుకుందమన్న చిందులేస్తు అందకుంది
నీ నడుమును అడుగుదామన్న పులితోలు అలిగింది
నీ హృదయము దరిచేర్చమన్న కుదరదు అని అంటున్నది
నీ మనసుకు మనవిచేద్దామంటే భక్తులను అదిచుట్టుకుంది
నీ చేతికి చెబుదామంటే చెడ్దపుర్రె అడ్డుకుంది
నీ చుబుకము పట్టుకుందామంటే విషము సెగలు కక్కుతోంది
నీ కన్నులకు కనిపిద్దామన్న కొంచమైన తెరువకుంది
నీ ముక్కుకు మొక్కుదామంటే మూసి జపము చేస్తున్నది
నీ జటకు ఉటంకిందామంటే గంగవెర్రులెత్తుతోంది
నన్ను రానీయక తమ సొంతమంటు గంతులేస్తున్నవి
నీదరి సేదతీరుతు ఆదరమునే మరచిన వాటి
టక్కరితనమును చూడరా ఓ తిక్కశంకరా.
సాధకుడు కష్టపడి శివానుగ్రహముతో తన ఇంద్రియములను వశపరచుకొని,శివదర్శనమునకై వస్తే.స్వామి ధరించిన పాదమంజీరము నుండి, జటలో నున్న గంగ వరకు అడ్డగించుచున్నవి.శంకరుడు తమకే సొంతమని దరిచేరనీయకుంటే,దయాళువుగా కీర్తింపబడు శివుడు నిర్దయతో తటస్థముగా నున్నాడు.దర్శన భాగ్యమును కలిగించుట లేదు-నింద.
హృదయము నమః శివాయ-ఆదరము నమః శివాయ
ఉపేక్ష నమః శివాయ-ఆపేక్ష నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" తలమీదం కుసుమప్రసాద మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ నాసిక తుదన్ గంధప్రసాదంబులో
పల నైవేద్యము జేర్చునే మనుజుడా భక్తుండు నీ కెప్పుడున్
చెలికాడై విహరించు రౌస్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా."
ధూర్జటి మహాకవి.
శంకరా! ఎవరైతే తలమీద సదా నీ నిర్మాల్యమును,నుదుట విభూతిని,మెడలో రుద్రాక్షలను,ముక్కుయందు నీ అభిషేక జలసుగంధమును,ఉదరములో నీ నైవేద్యమును కలిగియుండునో,వారు వెండికొండపై నీ స్నేహితులతో సమానముగా వర్తించగల అనుగ్రహమును పొందియున్నారు కనుక నేను వాటిని మహాప్రసాదముగా ధరించి,నీ మహిమావిశేషములను లోకవిదితము చేయుటకై,దీనిని నీచే కల్పించబడిన లీలా విశేషముగా స్వీకరింతును.శరణు-శరణు సదాశివా-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment