ఓం నమః శివాయ-68
*****************
పాశము విడువనివాడు యమపాశము విడిపించగలడ
గంగను విడువని వాడూ నా బెంగను తొలగించగలడ?
మాయలేడిని విడువని వాడు మాయదాడినెదిరించగలడ
పాములు విడువని వాడు పాపములను హరించగలడ?
విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడ
ఉబ్బును విడువనివాడు నా జబ్బును పోగొట్టగలడ?
నృత్యము విడువనివాడు దుష్కృత్యములను ఆపగలడ
భిక్షాటన విడువని వాడు శిష్టరక్షణమును చేయగలడ?
చిన్ముద్రలు విడువని వాడు ఆదుర్దా గమనించగలడ
వింతరాగమున్నవాడు వీతరాగుడవుతాడ?
కానేకాడంటు బుగ్గలు నొక్కుకుంటున్నారురా
చుక్కచుక్క నీరు తాగు ఓ తిక్కశంకరా
శివుడు అమ్మ పార్వతిమీది ప్రేమను వదిలిపెట్టలేడు.గంగను వదలలేక గట్టిగానే బంధించాడు.మాయలేడిని చేతినుండి జారనీయడు.విషమును-భిక్షాటనను-నృత్యమును అసలే వదిలిపెట్టలేడు.వీటన్నిటిని మించి,ఎన్నిసార్లు అనుభవమైనా పొగత్లకు లొంగిపోతుంటాడు.మాయామోహితుడైనప్పటికిని తాను మాయా రహితుడనని చెప్పుకుంటాడు కనుక శివుడు విషయవాసనలను జబ్బును తగ్గిస్తాడని నమ్మకము లేదు.-నింద.
విషము నమః శివాయ-మిషలు నమః శివాయ
పాశము నమః శివాయ-పార్వతి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీనతా
సుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకేతియో గీయతే
శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే."
శివానంలహరి.
నల్లని కంఠముతో, ఆకాశమును పింఛముగా ధరించి ప్రకాశించుచున్న నెమలి అను శివుడు,పార్వతీదేవి అనే నల్లని మేఘకాంతిని చూసి,సంతోషముతో నర్తించుచు,వేదాంతమనే ఉద్యానవనములో విహరించుచు,ఆనందించుచున్నది.అట్టి పవిత్ర పాశబంధితులైన పార్వతీపరమేశ్వరులు,మనలనందరిని రక్షించెదరు గాక.
మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వరః
బాంధవా శ్సివభక్తాశ్చ-స్వదేహో భువనత్రయం.
ఏక బిల్వం శివార్పణం..
No comments:
Post a Comment