అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో
ప్రసీద మమ సర్వదా-06
**************************
కాత్యాయనీమాతా నమోనమః.
" చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ."
అమరకోశం పార్వతీదేవిని కాత్యాయనీ నామంతో కీర్తించింది.అనేక నామ-రూపాలు అమ్మ క్రీడలు.సింహవాహిని యైన తల్లి ఘోరాఘోర రూపిణి.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కత్యమహర్షిచే అమ్మాయి అని పిలిపించుకుంటూ ఆనందించింది,తండ్రిగా మునిని అనుగ్రహించింది.కత్యగోత్ర సంభవురాలు కనుక కాత్యాయినీ నామముతో కళ్యాణములను అనుగ్రహించింది.ఇది వాచ్యార్థము.
సాధకుడు తత్ ను దర్శించవలెనన్న ,
కతిః యానం? ఏది మార్గము? కతిః అయనం? ఎటువైపు పయనము? అని దారితెన్ను తోచని స్థితిలో నుండగా తల్లి తానే మార్గమై వారిని ఉధ్ధరించునది కనుక కాత్యాయని.ఇది పరమార్థము.
కాత్యాయనీ మాత బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశము.ఆజ్ఞా చక్ర అధిష్ఠాన దేవతగా సాధకునకు ఏకాగ్రతను అనుగ్రహిస్తుంది.మహిషాసుర ఆగడములవలన ధర్మము క్షీణిస్తూ,గ్లనిని పొందే సమయమున క్రోధరూపిణియై ఆదిశక్తి మహిషాసుర మర్దనమున సహాయకారియైనది.ఈ రాక్షసులు తమ వాక్చమత్కారముతో విచిత్రమైన విధముగా తమ మరణములకు ప్రణాళికలనేర్పరుచుకొని,మన కొరకు జగన్మాత ఆ అవతార విశేషములను ప్రకటింపచేస్తారు.తల్లి వారిని తన ఆయుధస్పర్శచేగాని-అనుగ్రహ వీక్షణముచే కాని వీలైతే సంస్కరిస్తుంది.కాదంటే సంహరిస్తుంది.
" వైయత్తు వాళ్వీరాళ్" తిరుప్పావై రెండవ పాశురములో ఆండాల్ తల్లి చెప్పినట్లు కాత్యాయనీదేవి రాక్షస సంహారమునే కాదు రక్షణ భారమును కూడా వహిస్తుంది.
వాచక నిర్వచన ప్రకారము కాత్యాయనీవ్రతము పెళ్ళికాని కన్యలు-సంతానమును కోరు సౌభాగ్యవతులు-సంపదలను కోరు పురుషులు విధివిధానము ప్రకారము చెరుకు ముక్కలను సమర్పించి అర్చించి,అభీష్టములు తీరునని ఆనందిస్తారు.
ఇక్కడ మనము గమనించవలసిన విషయము గోపికలు శ్రీకృష్ణుని తమ భర్తగా కోరుకుంటారు.ఇది మానవ భార్య-భర్తల సంబంధముకాదు.అనుకూల దాంపత్యము అనగా జీవాత్మ పరమాత్మను దర్శించి-స్పర్శించి-సంతుష్టినందుట.సామీప్య-సాయుజ్యములను స్వానుభములోనికి తెచ్చుకోగలుగుట.అదియే రసవత్తరమైన రాసలీల.దానికి దారిగా మారి దరిచేర్చునది కాత్యాయనీమాత.అందులకే తల్లి అనపగామిని.అంటే అపమార్గమున నున్నవారికి సన్మార్గమును చూపునది.
' కాత్యాయనీ నామ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గి ప్రచోదయాత్."
తన సంతానమును సంస్కరించుట తల్లి సంకల్పము.
తత్ ను ఆవిష్కరింపచేసుకొనుట మన సంకల్పము.
అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలేల?
అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరణము.
No comments:
Post a Comment