మీఢుష్టమ శివతమ-28
*******************
శివయేవ గతిర్మమ-శివయేవ గతిర్మమ
స్వాంతకుహర చిద్జ్యోతి సాంత్వన సుఖదాయకః
శివయేవ గతిర్మమ.....
దర్శనశక్తి దేనిద్వారా ప్రసారమగుతున్నదో అది మనము అనుకునే చక్షువు.శక్తి దాగి ఉప్పొంగి ప్రకటితమగుచున్నదో అది అసలైన చక్షువు.అంతేనా రుద్రా అనుకుంటూ సముద్రతీరములో ముచ్చటిస్తూ నడుస్తున్నారిద్దరు.
నమః శివాయచ-శివతరాయచ.
సాధకుని రుద్రుడు అంటే అమితమైన,అచంచలమైన,అద్వితీయమైన,అమోఘమైన,ఆనందదాయకమైన గురుభావము ఏర్పడినది.అది 'యన్ తాచమే" అని గురువుగా అడిగినప్పుడు అనిపించనిది.ఆర్ద్రతతో నిండినది.
సరిసమానముగా నడవలేకపోతున్నాడు.వినయంగా రుద్రుని పాదపు ఆనవాళ్ళకు నమస్కరించుకుంటు వెనక-వెనకగా నడుస్తున్నాడు.అంతా గమనిస్తూనే ఉన్నాడు రుద్రుడు సహస్రాక్షుడు కదా.
ఏమైనది సాధకా? వెనకబడ్డావు అన్నాడు కొంటెగా.
రుద్రా! నేనొకటి చెబుతాను.నవ్వకుండా వింటావా అన్నాడు.రుద్రుడు తలపంకించగానే సముద్రమును చూపిస్తూ,
ఆ సముద్రగర్భ జలము వలె లోపలి కన్ను నిశ్చలముగా ఉంటుందిఉవ్వెత్తుగా లేచి తనశక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు మనకు కనబదే కన్ను చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది..అదే జలము ఉవ్వెత్తున లేచి కెరటము వలె తన శక్తిని ప్రదర్శిస్తుంది.లోపల నున్నప్పుడు శక్తిని దాచివేస్తుంది.కెరటమైనప్పుడు ప్రకటిస్తుంది.అంతేకదా! అన్నాడు అవునో/కాదో అనే సంశయముతో.
ప్రశంస సంశయమును తోసివేసింది.ప్రసన్నత ప్రస్తుతిగా మారింది.
రుద్రా! నువ్వే నా సర్వస్వము.నేను నీ పాదదాసుడను.నన్నసలు విడిచివెళ్లకు అంటూ,అక్కడున్న రాతిదగ్గరకు తీసుకుని వెళ్ళి,దానిపై కూర్చుండబెట్టి,పాషాణ సింహాసనం సమర్పయామి అన్నాడు అశేషమైన భక్తితో.
ఆనందంతో సాధకుని లేవదీసి నేను వెళతానని ఇప్పుడు అనలేదే.అసలు నిన్ను విడిచి వెళ్ళాలని నేననుకోవటములేదే అన్నాడు.రుద్రుడు.
అప్పుడక్కడికొక తాబేలు మెల్లగా జరుగుతు వస్తున్నది.కాసేపు తన డొప్పనుండి అవయవములను బయటకు తీస్తూ నడుస్తున్నది.కాసేపు వాటిని దాచివేసి కదలక-మెదలక ఉంటున్నది.సాధకుని వేలిని రుద్రుడు పట్టుకుని తాబేలు వైపు చూపిస్తూ,
అది ముడుచుకు కూర్చున్నది చూడు అది సత్తు.అవయములను బయటకు తీసి కదులుతున్నది చూడు అది చిత్తు.అవయములు కదలమంటే కదులుతున్నాయి.డొప్పకిందికి వచ్చేయమంటే ముడుచుకొనిలోపలనే ఉన్నాయి.అదియే సత్చిత్-దానిని తెలిసికొనుటచే పొందే అనుభూతియే సచ్చిదానందము.
పరమాణువు నుండి పరమాత్మ వరకు సమస్తము సత్తు-చిత్తు మిశ్రమములే కాని వాటి నిష్పత్తి భేదములే
ఉపాధులుగా నామరూపములతో మనలను భ్రమింపచేసేవి.
ఇంతలో ముగ్గురు వ్యక్తులు అక్కడికివచ్చి దూరముగా కూర్చున్నారు.రుద్రుడు సాధకుని వంక చూస్తుండగానే-పాలుం బువ్వ వద్దని అరటిపండ్లు తెమ్మన్న చనువు కదా,వెంటనే సాధకుడు,
రుద్రా! నువ్వే చెప్పు.నేను వారి మాటలు వినను.అంటు బుంగమూతిపెట్టాడు.
బెంగలేదులే.నేనే చెబుతాను అని,
వారు ముగ్గురు మూడు శరీరాలకు గురుతులు.
అంటే-మూడు శరీరాలంటే-
ఒకే వ్యక్తిలో ఉండే మూడు శరీరాలు అన్నాడు రుద్రుడు.
1.-స్థూల శరీరము-పాపము దానికి జరా-మరణముల భయము.
2.సూక్ష్మ శరీరము-పాపము దానికి ఆకలి-దప్పిక తిప్పలు.
3.కారణ శరీరము-పాపము దానికి శోక-మోహముల కేకలు
.
ఇవి మూడు ఒకే వ్యక్తిలో ఉన్నా ఒకదాని బాధను ఇంకొకటి పంచుకొనలేవు.తీర్చనూలేవు.
అయ్యో పాపం, అంటున్నాడు సాధకుడు.
ఇంకా విను అంటు రుద్రుడు
1 స్థూల శరీరము ఆకలిదప్పులు తనకు లేవని,
2.సూక్ష్మ శరీరము జరామరణములు తనకు లేవని
3.కారణ శరీరము తనకు పై రెండింటి బాధలు లేవని,
తమకు తామే పొగుడుకుంటూ,పొగరుబోతు తనముతో ఎగురుతుంటాయి .
అంటూ కళ్ళు మూసుకున్నాడు రుద్రుడు.
ఆలోచనలను జరుపుతున్నాడు సాధకుడు
ఆ లోచనమును తెరిపించుచున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment