ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04
******************************
ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.
వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.
మిగిలిన మూడు ఇంద్రియములు తటస్థముగా నునాయి.
అదే ఉప్పును నేను నీళ్ళగిన్నెలో వేసి
పది నిమ్షములు చిన్నపని చేసుకుని వచ్చాను.
ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతున్నది నాకు.ఇంతకీ ఉప్పును నీళ్ళగిన్నెలోవేసానా/లేదా? ఎలా తెలుస్తుంది నాకు?
నాకు సహాయపడిన కళ్ళు-స్పర్శ నే తిరిగి సహాయమడుగుతాను అంటు......
కాని విచిత్రము.అవి నిస్సహాయములుగా మారినవి.
నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.
మరొక విచిత్రము.ఇవి చేయలేని పనిని మరొక ఇంద్రియము తాను చేసిపెడతానన్నది.అదే అదే..
గమ్మత్తుగ.. నా జిహ్వ నేను చెప్పగలను అంటు రుచి చూసి ఉప్పు నీళ్ళలో కలిసినదని చెప్పినది.
ఏమిటి ఈ ఇంద్రియముల దాగుడుమూతలు? ఎందుకు వీని దోబూచులాటలు?
దృష్టి-స్పర్శ తమ శక్తిని ప్రదర్శించినపుడు జిహ్వ తన ప్రభావమును దాచివేసినది.
అవి వాటి శక్తి ప్రదర్శనమునకు
నిస్సహాయములైనపుడు జిహ్వ
తన శక్తిని ప్రకటించి చేతనునకు తోడైనది.
నిన్న మామిడిపండు కూడా తన రంగుతో నా దృష్టిని,సువాసనతో నా నాసికను చైతన్యవంతము చేసి,నేను దానిని తినుటకు తాము సహాయపడలేమన్నవి.
అప్పుడు నాలుక తన చాకచక్యముతో అద్భుతరుచులను అనుభవములోనికి తెచ్చినది
అంటే.. ఈ ఇంద్రియములకు ఎంతటి క్రమ శిక్షణ!ఎంతటి పరస్పర అవగాహన.చేతనునకు సహకారమును అందించవలసిన సమయములో మాత్రమే తమ శక్తిని ప్రకటిస్తూ,మిగత సమయములలో నిక్షిప్తము చేస్తూ..
ఎంతటి సమయస్పూర్తి-సహనశీలత-సంఘీభావము.
శరీరములోని ప్రతి అవయవము మనకు అనుకూలముగా తన భంగిమలను అమర్చుకుంటూ..చాచుతు-ముడుచుకుంటూ,తనను తాను మలచూంటు,మరలను తిప్పుకుంటూ..
వాటికి ఆ చతురతను అందచేయుచున్నది ఎవరు?ఎక్కడ ఉన్నడి? అది గుప్తమా?ప్రకటనమా? ప్రకటనములో గుప్తముగా నున్నదా?
ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క విధముగా ప్రకటనమగుటు ప్రశంసింపబడుతున్న పరమాద్భుతమేది?
అసలు ఇంతకీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక నైపుణ్యమును దాచిపెట్టినది ఎవరు? దానిని ప్రకటింపచేయుచు ఒక్కొక్క ఇంద్రియమునకు గుర్తింపగల సామర్థ్యమునిచ్చినదెవరు?
పరస్పరాధారములైన వీటి మేళన కర్త చాకచక్యమును గుర్తించుట సాధ్యమేనా అన్న సందిగ్ధములో నున్న నన్ను-మనలను ఆ సర్వేశ్వరుడు సన్మార్గములో నడిపించును గాక.
సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.
కరుణ కొనసాగుతుంది.
No comments:
Post a Comment