Saturday, November 6, 2021

guggila kalaya nayanaru

గుగ్గిల కలయ నయనారు ******************* " కాలభీత విప్రబాల పాలతే నమః శివాయ శూలభిన్నిదుష్టపాలతే నమః శివాయ మూలకారణాయ కాలకాలతే నమః శివాయ పాలయాధునా దయాలవాలతే నమః శివాయ" **** .బాలుని రక్షించిన కాలకాలునకు దండాలు శివా దక్షుని శిక్షించిన వీరభద్రునకుదండాలు శివా కార్య-కారణముల మూలకారణునకు దండాలు శివా నన్ను పాలించు దయాలవాలునకు దండాలు శివా *** షోడశోపచారములలో ఒకటైన ధూప సమర్పణముతో, " దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం ధూపం దాస్యామితే దేవ గృహేణ పరమేశ్వర" అంటూ, సాంబశివునికి సాంబ్రాణిధూపసేవ చేస్తూ పరవశించిపోయేవాడు. సంబరేణుచెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చి0చు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు. తిరుకడవూరులో అమృతలింగేశ్వరుని ఆశీర్వాదముగా, బ్రాహ్మణ(బ్రహ్మమును తెలిసికొనగలిగిన) వంశములో జన్మించిన కలయ నాయనారు పూజారిగా తన విధులను నిర్వర్తించుచు,గుగ్గిలోపచారమను పూజావిధానముతో,గుగ్గిల కలయ నాయనారుగా కీర్తించబడుచున్నాడు. పది ఇంద్రియములను నియంత్రించిన శక్తిని పది సుగంధ ద్రవ్యములుగా మార్చి,భక్తి యను ధూప సమర్పణమును అనుదినమును చేయుచు,ఆదిదేవునికి అనుంగు ఆటయైన కటికదరిద్రమునకు సైతము వెరువక,పరమసాధ్వి యైన తన భార్య మంగళ సూత్రమును అమ్మి ఆకలిని తీర్చు అవసరమైన సరుకులు కొనుటకు బయలుదేరాడు బాధ్యతగా. భవబంధ నాశకుడు భక్తుని పరీక్షించదలచాడో లేక ముక్తినీయ దలచాడో , తెలియదు కాని,యుక్తితో సంపదలనుహరించివేయ సాగాడు. కలయకు హరునిపైగల భక్తి హరించిన సంపదల గురించి చింతించనీయక,ఉన్న ద్రవ్యమును గుగ్గిలసేవకై వెచ్చించసాగినది.కాలము గడుస్తున్న కొద్ది,కాదనలేని సంసార బాధ్యత కట్టిన తాళిని చేత పట్టుకుని,తనను నమ్మిన వారి కడుపునింపుటకు నడుచుచున్నది.ఇది బాహ్యము. తాను నమ్మిన వాని స్మరణము బాధ్యతను మరపింపచేసి ,తన్మయత్వము వైపు మనసును మరల్చుకున్నది. "కాదనలేనిది కదా కాముని జయించిన వాని లీల" . సుగంధపుష్టికర్త సమీపిస్తున్నాడనుటకు సంకేతముగా పరిసరములు పరిమళములను వెదజల్లుతున్నది. సత్వము స్వాము తత్త్వమును తోడుగా తెస్తున్నది. పరవశము కర్తవ్యమును కానరాకుండా కదిలించివేస్తున్నది.సర్వం శివమయం.సకలం సుగంధమయం. ఎంతటి పుణ్యమో ఇంత వింతమార్పులను చేస్తున్నది.కంతుని జయించిన వానిని నాయనరుచెంతకు రప్పిస్తున్నది. సాంబుని సాంబ్రాణివర్తకుని చేసినది.సాక్షాత్కరింపచేసినది. సంభాషింపచేసినది.భార్యతాళిని సాంబునికి సమర్పింప చేసినది. మహాకవి ధూర్జటి చెప్పినట్లు, అంతా మిధ్య తలంపగ...నీ మీద చింతాకంతయు చింత నిలుపరుకదా శ్రీకాళహస్తీశ్వరా అని స్తుతింపచేసినది. స్వామి చేయి కింద.కలయచేయి పైన. బండిలో దండిగా నున్న సాంబ్రాణి భక్తుని చేరినది. స్వామికార్యము కదా.సరగున పరుగులు తీస్తు నయనారు బాహ్యమును సర్వమును కప్పివేసినది .సంతుష్టాంతరగునికి సదాశివునికి ధూపసేవనము తప్ప సంతసమునిచ్చినది మరి ఏది? ఐహిక బంధములకు అవపోసన పట్టించినది..ఆలు-బిడ్డల ఆలోచనను అపహరించివేసినది. స్వామికి కోవెల యందే సత్వర సాంబ్రాణిసేవనమునకు తొందరచేసినది. సకలం సమర్పణం శివం-సర్వం శివమయం జగం.అదే ధ్యాస-అదే శ్వాస నాయనారుది. భక్తుని నమ్మకమును వమ్ముచేయని స్వామి అనంత సౌభాగ్యములను నాయనారు కుటుంబమునకు అనుగ్రహించినాడు. భవతారకమైనది భవుని అనుగ్రహము. నాయనారు నమ్మకమును లోకవిదితము చేయాలనుకున్నాడు లోకేశుడు. . నాయనారు భక్తికి పతాక సన్నివేశమన్నట్లు సద్యోజాతుడు గొడగూబ అన్న ఒక చిన్ని బాలికచేత ఒక తుమ్మిపువ్వునుంచి తనకు పెట్టమన్నాడు.లింగము చాలా ఎత్తుగానున్నది పాపకు అందదు.నింగిని తాకు జటలున్నవాడు కిందికి వంగి పువ్వును స్వీకరించాడు.లింగము వంగినదని దానికి ఇనుపగొలుసులు కట్టి ఏనుగులచే లాగించ సాగారు. అటువైపుగా వెళుతున్న నాయనారును ఆ దృశ్యము కలచివేసినది.ఎంతటి కౄరులు వీరు.నీలకంఠుని కంఠమునకు బరువైన ఇనుపగొలుసుల.స్వామి కంఠము ఎంత నొచ్చుకున్నదో. ఎంతటి అపరాధమో .పరుగు పరుగున పాహిమాం పరమేశా! కషమించు అనుకుంటూ, ఉబ్బు లింగనికి దెబ్బ తగిలిందని,ఆగొలుసు తన మెడకు బిగించుకున్నాడు.వంగిన లింగమును సవరించే పనిలో పడ్దది లొంగిన భక్తి. అనురక్తితో కొంగుబంగారమైన స్వామి గుగ్గిలపు నాయనారును ఆశీర్వదించినాడు.అక్కున చేర్చుకుని అబుగ్రహించాడు. ఆ సదా శివుడు మనందరిని అనుగ్రహించును గాక దేవతలు అసురులు అమృత కలశముతో తిరుక్కడవూరికి వచ్చారట.ఆ కలశమును నేలపై ఉంచి ,స్నానము చేయుటకు నదికి వెళ్ళి వచ్చు సరికి ఈశ్వరేచ్చగా ఆ కలశము లింగముగా మారిపోయినదట.మార్కండేయుని మృత్యుంజయుని చేసిన అభిరామాదేవి సహిత అమృతేశ్వర స్వామి మనగుగ్గిలపు కలశ భక్తిని మథించి లోకపూజ్యతను ప్రసాదించాడు. అంబే శివే తిరువడిగళే శరణం ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...