Wednesday, November 17, 2021

TIRUNEELA NAKKAR NAAYANAAR

తిరునీల నక్కర్ నాయనారు ******** " బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రనమామి సదాశివ లింగం." సాక్షాత్తుగా బ్రహ్మయే దిగివచ్చి ఆరాధించిన శివుని ఆలయము , అయ-వంద-ఈశ్వర ఆలయము.అయవందీశ్వరుని అనుగ్రహపాత్రుడైన నాయనారు నక్కర్ నాయనారు. చోళరాజ్యములో అనవరతము వేదము నినదించు "తిరుచత్తాత మంగై పురములో జన్మించిన మన నాయనారు అసలుపేరు మరుగునపడి,నక్కర్ వేదవిజ్ఞానమును అవగతము చేసుకొని ఆచరించువానిగా ,తిరునీలకంఠుని భక్తునిగా, తిరునీల నక్కర్ నాయనారుగా కీర్తింపబడుచున్నాడు. నిత్యము తన ధర్మపత్ని తో పాటుగా,నీలకంఠుని నిండార సేవిస్తూ,అన్యమెరుగక ధన్యతనొందుచుండెడివాడు. ఉన్నచోట,ఉన్నతీరున,ఉండనీయడు కదా తన భక్తులను ఆ మూడుకన్నులవాడు..కరుణ చూపుతాను అంటూ,కఠిన పరీక్షలను పెట్టుతూ,వానిని దాటిస్తుంటాడు.కొంతసేపు కరుణను దాటవేస్తుంటాడు. చిక్కులు కల్పిస్తూ,మక్కువతో తొలగిస్తూ వేడుకగ కొందరిని పాపులుగా/ పావులుగా మారుస్తూ,నిరపరాధులైనను నిందలకు గురిచేస్తూ,మోదమందుతుంటాడు ఆ నందివాహనుడు. పాలించేవాడు సాలెపురుగును లాలించదలిచాడో/నాయనారు భార్యను పరిపాలించ దలిచాడో కాని , తనలింగము మీద పాకే సాకును కల్పించాడు సాలీడుకు.పాకుతు చీకాకు పెట్టడానికి సిధ్ధమయింది శ్రీ పురుగు ఆటకు తాను శ్రీకారము చుడుతూ. ఈశ్వర పరీక్ష తమను సమీపించుటకు నిరీక్షిస్తున్నదన్న విషయమును తెలుసుకోలేని నాయనారు దంపతులు,విషము కంఠమున దాచిన వానిని సేవించుటకు సంసిధ్ధులైనారు.సకల ఉపచారములను చేస్తున్నారు.సేవా సౌభాగ్యముగా ప్రతి ఉపచారమును ప్రసన్న మనస్కులుగా చేస్తూ,ప్రత్యక్షముగా స్వామిని చూస్తూ ,పరవశిస్తూ, అంతర్ముఖము-బహిర్ముఖములతో దోబూచులాడుకుంటున్నారు. దేవాలయములో/తమ దేహములలో దాగిన వాడితో. అదే సమయమనుకున్నదో ఏమో ఆ సాలీడు ఆదే పనిగా పాకుతూ,లింగమును తాకుతూ,లాలా జలముతో లాలిస్తూ,నోటి దారముతో పట్టుపుట్టములు కడుతూ తాను మురుస్తూ-తన స్వామి కార్యమును నెరవేరుస్తూ దూసుకుపోతున్నది. నాయనారు భార్య మూసుకున్న కన్నులు చటుక్కున తెరుచుకున్నాయి .అనుంగు సుతుని కనులారా చూసుకోవాలనే ఆకాంక్ష అంతర్ముఖమును విడివడింది. వాని లీలను అవలీలగా గ్రహించలేని అమ్మ మనసు లింగమునకు జరుగుచున్న అపచారమునకు విచారగ్రస్తమైనది.సదాచారము జరుగుచున్న అఘాయత్వమును చూస్తూ మిన్నకుఓడలేని, ఆ సాధ్వి తన పక్కన అంతర్ముఖుడై యున్న నాయనారు వైపు చూసినది తక్షణ తన కర్తవ్యమునకై. సలక్షణమైన సమాధిలో సన్నుతిస్తున్నాడు సాంబశివుని నాయనారు. కదలడు-మెదలడు.కనులు విప్పడు.బదులు చెప్పడు.బాహ్యమును వదిలివేసిన నిశ్చలత్వముతో అత్మనివేదనమును చేస్తున్నాడు. అటువైపు సాలెపురుగు చేయుచున్న అపచారము-ఇటువైపు సర్వేశునికి తనపతి చేస్తున్న ఉపచారము. చేసేది లేక/చేయకుండా ఉండలేక తన నోటితొ ఊది,గాలిని పంపి బూదిపూతల వాని మీద పాకుతున్న సాలీడును జరిపివేసింది. కథను మరింత ముందుకు జరుపుతున్నాడు కందర్పదర్పుడు. నాయనారు కనులను తెరిచి,జరిగిన అపచారమును గుర్తించేలా చేసాడు ఆ జగన్నర్తకుడు. మాయామర్మములెరుగని మనసుతో మహేశుని లింగమును చూశాడు.నున్నతనము సన్నగిల్లి పొ క్కులు మిక్కుటమైనవి.భార్య చేసిన అపచారమే భవుని లింగమునకు కష్టము తెచ్చినదని అనుకున్నాడు.గుడిలోని లింగము గుట్టుగా తనపని కానిస్తున్నది. భార్యచేసిన పనికి ఆగ్రహించిన నాయనారు ఆమెను కోవెలలోనే ఉండి పశ్చాత్తాపముతో స్వామి పాదపద్మములను ఆశ్రయించమని ఇంటికి తానొక్కడే వచ్చాడు స్వామికి తమవలన జరిగిన అపరాధమునకు నొచ్చుకుంటూ నిద్రకుపక్రమించాడు. చూపునిచ్చినది దేవుడైన మరి అంధులనేల సృజించె అని అమాయకత్వము ప్రశ్నిస్తే, అల్ప బుధ్ధితో దైవశక్తినే సలుపకు పరిహాసం-అని సమాధానమునిస్తుంది పరిణితిచెందిన ఆత్మతత్త్వము. వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విచిత్రం అన్నట్తుగానే, నాయనారుకు స్వప్నసాక్షాత్కరామునందించిన, ఔషధీనాం పతి తన శరీరములోని ఓక భాగమును నున్నగా/మరొక భాగమును పొక్కినట్లుచూపుతూ,నా తల్లి( చేసిన ఉపచారమే)చల్లని స్పర్శయే నాకు చల్లని స్పర్శయే నా రుగ్మతను తగ్గించగలదంటూ,పొక్కులతో నిండిన మిగిలిన భాగమును చూపించి అదృశ్యమయాడు ఆదిదేవుడు. కళ్ళుతెరిచిన నాయనారు , కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకుందునా సాలీడు పాకగ స్వామి శరీరము పొక్కిపోయె గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె పాయని భక్తి తానొక ఉపాయము సేసి వేగమే జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ నక్కనయనారుని ధర్మపత్ని,కోపించీ నాయనారు సామిని, క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు గాఢత ఎంత ఉన్నదో కద ఆ మూఢపు భక్తిలో నెమ్మదినీయగ స్వామికి తల్లి ఉమ్మియె కారణమాయె చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక. అనుచు కీర్తిస్తూ కోవెల దగ్గర తన రాకకై వేచియున్న సాధ్విని సహృదయతతో ఇంటికి తీసుకువచ్చెను. తిరు చంపంధర్,తిరునల్లకండ్ల ఎల్పనార్ మొదలగు సాక్షాత్తు శివ స్వరూపములతో పాటుగా,శివుని-శివభక్తులను నవవిధభక్తితో నర్తిస్తూ,గానముచేస్తూ,మార్గములను పుష్పాలంకరముతో సురుచిర (దారులను-బాహ్యము-ఆరాధనలను భక్తి యను పుష్పాలంకృతముగా-భక్తులకు సకల సౌకర్యములను సమకూరుస్తూ,) అంత్యమున శివైక్యమునొందిరి. నాయనారు దంపతులను అనుగ్రహించిన భిషక్కు మనలను తన కృపాదృక్కులతో అనిశము రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...