Sunday, January 2, 2022

PASURAM-18

తిరుచిట్రంబలం-పాశురము-18 **************************** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు నాకు భేదము పోరయదెందు నరయనేకత్వమునకు హానిలేదు వాడె నేనేనె వాడను వాడొకండె ముక్తుడట్టుల గాకున్న మూఢుడతడె" ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు పరమాత్మ ప్రక్షిత-నిక్షిత స్వేఛ్చాలీలను విశదపరుస్తున్నారు. కావున, పెణ్ణే! నిన్రాన్ కళల్ పాడి అని అంటున్నారు. సామాన్యార్థమును కనుక మనము భావించుకుంటే, నిన్రాన్-నిలబడి స్వామి కళల్ పాడి-పాదపద్మములను సంకీర్తించుట. కాని ఇక్కడ మనకు అందవలసిన సందేశము మన శరీరము నిలబడి అని కాదు. ఇక్కడ మనము నిలబెట్టవలసినది మన మనసును.త్రికరణశుధ్ధిని/ఏకాగ్రతను. అన్నా మలయన్-అన్నా- అనురాగపూరితమైన మలయన్-పర్వతము. ఇక్కడ నిశ్చలభక్తి,నిర్హేతుక అనుగ్రహమునకు సంకేతములుగా నిన్రాన్ అను శబ్దము పొదగబడినది. నిశ్చలమైన నిష్కళంకమైన మనసు కనుక దర్శించగలిగితే మనకు అనేకానేక అద్భుతాలు దర్శనమిస్తాయి. ముఖ్యముగా ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు స్వామి యొక్క రెండు మహిమలను నొక్కివక్కాణిస్తున్నారు. మొదటిది స్వామి పరంజ్యోతి తత్త్వము. రెండవది సర్వ ఉపాధికత్వము/సర్వ వ్యాపకత్వము. ఏకరూపమనేకమగుట-అనేకములు ఏకమగుట పరమాత్మ స్వేఛ్చాలీలలు. పాశురములోని ప్రథమభాగము,మొదటి నాలుగు వాక్యములు స్వామి ప్రకాశకత్వమును ప్రస్తుతించుచున్నవి. మూడు సంఘటనలను జోడించి మనలను అబ్బురపరచుచున్నారు మాణిక్యవాచగరు. సూర్యోదయం ఎంత భాగ్యముచేసుకొన్నదో స్వామి తేజమును మనలకు అర్థముచేయుటకు తానొక పరికరమై పరవశించుచున్నది. కణ్ణార్-భానుడు తన సామంతత్త్వమునకు నిదర్శనముగా కొంతసమయము మాత్రమే తన కిరణముల ద్వారా వెలుగును-వేడిని ప్రసరించి,అస్తమించుచుచున్నాడు. తణ్ణార్-తారగైగల్-చంద్రుడు-నక్షత్రములు తమ చల్లదనమును-తళుకుబెళుకులను కొంత సమయము వరకు మాత్రమే వ్యాపింపచేసి భానూదయమునకు చోటిస్తూ తరలిపోతున్నవి. ఒక విధముగా చెప్పాలంటేఅవి పరమాత్మ ఆదేశానుసారముగా పరిమిత సమయము వరకు ప్రభావితముచేస్తున్నవి కాని స్వయం ప్రకాశములు కావు. మూడవ ఉపమానము స్వామి పాదపద్మములను నమస్కరించుచున్న దేవతల(ఇరంజు-వంగిన) శిరోమకుటముల మణుల కాంతిప్రసరణములు.వీటికి సమయ నిర్బంధనము లేదు కాని ప్రకాశ వ్యాప్తికి స్థల పరిమితి కలదు.కొంతదూరము వరకే తమ కాంతిని ప్రసరింపచేయగలవు. పరంజ్యోతి .సర్వకాల-సర్వావ స్థలయందును స్వతంత్ర సామర్థ్యముు కల మహాద్భుత తేజోరాశి. శాక్తేయుల నమ్మిక ప్రకారము చిఛ్చక్తి తన సృష్టి విస్తరణలో పదిరూపములుగా తనను తాను (దశమహావిద్యలుగా) మలచుకొనునప్పటి రెండవశక్తి యైన తార గా అనుకుంటే,తేజముతో ప్రకటితమైన శక్తి,తనతో పాటుగా త్రిపురసుందరి-భువనేశ్వరిగా సృష్టి విస్తరనను కావించినది.అదియే మన పాశురము రెండవభాగములో చెబుతున్నట్లు మనకు కనిపించుచున్న, పెణ్ణాయ్ -ఆణాయ్-ఆళియుం స్త్రీలు-పురుషులు-మిగిలినవి అన్నియును తానుగా,అనేకములుగా-ఏకముగా,తనకు తాను విస్తరిస్తూ,పోషిస్తూ,తనలో లీనముచేసుకుంటూ వినోదించు పరమాత్మ పాదములను శరణు కోరుదాము. కణ్ణార్ అముదమాయ్-నేత్రోత్సవమును జరుపుకుందాము. ఓ చెలి మన స్వామి, " కలడాకాశంబునన్ కుంభినిన్ కలండగ్నిన్ దిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ వెతకంగానేల ఆ ఈడలన్" అని నిశ్చయించుకొని,జ్ఞానకొలనులో మునిగి,ధ్యాననోమునకు, నోమునకు తరలి వెళ్ళుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...