పాహిమాం కృపాకరి కౌశికి-రమ్యకపర్దిని శైలసుతే
***********************************
" ఓం ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం
హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్యప్రభాం
గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా
పూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్ధినీం."
ఒకసారి గంగాతీరమునందు సకలదేవతలు శరణార్థులై,
" నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం"
అని ప్రార్థించుచుండగా,
" భావనామాత్ర సంతుష్ట హృదయ" యైన భవాని గంగా జలములలో స్నానమాచరించుటకు అటుగా పోవుచు,వారిని చూసి,
మీరు ఎవెరిగురించి స్తోత్రములు చేయుచున్నారని అడిగెను.
వారు సమాధానమును ఇవ్వలేని దీనస్థితిలోనుండుట గమనించి,
పార్వతి శరీర కోశమునుండి ఒక దివ్యసుందర శక్తి ప్రకటింపబడి,తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానముగా,
వీరందరు శుంభ-నిశుంభులచే రాజ్యమునుండి తరుమవేయబడి,కనీసము హవిస్సులను సైతము పొందలేక జగన్మాతవైన నీ పదకమలముల శరణు కోరుతున్నారనెను.
ఇది సమరమునకు ఒకవైపునున్న ప్రకటనము.
మరొకవైపు?
ఎవరా శుంభ-నిశుంభులు?వారు ఏ ధైర్యముతో దేవతలను సైతము దీనులను చేయగలిగారు?అన్న విషయమును పరిశీలిస్తే,
పురాణకథనము ప్రకారముగా,
కశ్యప ప్రజాపతికి దను అను స్త్రీకు జన్మించిన సంతానము వారు.అంటే దానవులు అన్నమాట.వారు పాతాళములో పెంచబడి పెద్దవారై తమ సోదరుడైన నమిషుని ఇంద్రుడు వధించాడని తెలుసుకుని ఇంద్రుని రాజ్యచ్యుతిని చేయవలెనను ప్రతీకారముతో నున్నారు.అంతేకాక మహిషుని ఒక స్త్రీ చంపివేసినది అదియును దేవత పక్షమున యుద్ధములో నన్న విషయము వారిని మరింత కృద్ధులను చేసినది.
వారు తమ పగను తీర్చుకోవలెనన్న వారికి వరబలము కావలెనని కులగురువైన శుక్రాచాయునిచే తెలుసుకొనిన వారై,అనేకవేల సంవత్సరములు బ్రహ్మ గురించి కఠోర తపమొనరించిరి.
తపము కలిగించుచున్న తీవ్ర దుష్పరిణామములనుండి జగములను రక్షించుటకై బ్రహ్మ వారి ముందు ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.
దానికి వారు అనుకున్న ప్రకారము చావులేని వరమును కోరుకొనిరి.
అందులకు బ్రహ్మ తానుసైతము కల్పాంతమున నిష్క్రమించవలసిన వాడిని కనుక తనకా వరమును అనుగ్రహించగల సమర్థత లేదని,మరొక వరమేదైనా కోరుకోమనినాడు.
చేసేదిలేక వారు మానవులచే,దేవతలచే అజేయులమగు వరమును కోరిరి.అనుగ్రహించి బ్రహ్మ అంతర్థానమయ్యెను.
తపమునుండి తిరిగివచ్చిన వారిని పాతాళమున శుక్రాచార్యుడు మూర్ధాభిషిక్తులను చేసెను.అప్పటినుండి వారు తమ సామ్రాజ్య విస్తరణను
చేస్తూ,అనేకులను తమ స్వాధీనము చేసుకుంటూ,స్వర్గముపై దండెత్తి దేవేంద్రుని అచటనుండి తరిమివేసిరి.అంతటితో ఆగక హవిస్సులను సైతము అందనీయక ఆగడములతో రెచ్చిపోవుచున్నారు.
ఇక ఈ ఇరుపక్షముల మధ్య జరుగు కథను జగన్మాత లీలను తెలుసుకుందాము.
సంకేత పరముగా చూస్తే శుంభ-నిశుంభ అను పదములు తలపొగరు/గర్వము అను దుర్గుణములకు సంకేతము అని పెద్దల అభిప్రాయము.ఇవి చాలవన్నట్లు చండుడు-ముండుడు అత్యుత్సాహము/నిరుత్స్సహము అను మరో రెండు పనికిరాని గుణములతో పొత్తు కలిసినది.ఈ నాలుగు పనికిరాని గుణములు పనికట్టుకుని మరో కొన్ని ఇంద్రియములను సైతము తమ జాబితాలోనికి జరుపుకుంటు చేసే అట్టహాసమే అసలుకథ.
వీరి ఖర్మకు వీరిని వదిలేసి అమ్మ గురించి అనుకోగానే ఆహా,ఆదిశంకరులు ఆలపించిన
" 'త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం'త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించిప్రభృతయః ।
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్
తల్లీ! ఓమంచుకొంద కూతుర! నీ యొక్క లోకాతీత-గుణాతీత-సర్వాతీత సౌందర్యమును గుర్తించి,స్తుతించుటకు మా మనస్సుకాని/వాక్కు కాని సమర్థత లేకయున్నవి ఓ మనో వాచామగోచర.కనుకనే మున్ను బ్రహ్మ,అప్సరాంగనలు నీ సౌందర్యలీలా విశేషములను వినగోరి శివుని ఆశ్రయించారు అనుకుంటుంటే,
వాడి పురాకృత సుకృతమన చండ/ముండుల సైతము అమ్మ దర్శనభాగ్యమును పొందగలిగినారు.
వానికి ఆరాధనా భావము అణువంతైనను కలుగలేదు.కాని తమ ప్రభువునకు అర్పించవలెనన్న వికృత తలంపు విచ్చేసినది.
శంభు సతిని శుంభుని సతిగా ఊహించుచున్నది వాడి ఉన్మత్తత.పక్కనున్న ముండుడు సరిదిద్దలేని స్తబ్దత కలవాడు.
ఇక్కడ కన్ను అనే ఇంద్రియము లోకాతీత సౌందర్యమును దర్శించినది కాని దాగియున్న మర్మమును/ధర్మమును/కర్మమును కనుగొనలేకపోయినది.
అంతటితో ఆగక వాగింద్రియమును సైతము వంకరదారి పట్టించి,శుంభ/నిశుంభుల దగ్గరకు తరలించినది.అంతటితో ఆగితే అసలుకథ మనకెలా తెలుస్తుంది.
చెప్పుమాటలను నమ్మాఎ చెవితో చెలిమిని చేయింది కనుకనే,
చండ-ముండులు శుంభ-నిశుంభుల దగ్గరకు వెళ్ళి,
"తాభ్యాం శుంభాయచాఖ్యాత్ అతీవ సుమనోహరా
కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతీ హిమాచలం"
శుంభమహాశయా! హిమచల సానువులలో అతిలోక సౌందర్యవతి ప్రకాశముతో తిరుగుచున్నది అన్నారు.
అంతటితో ఆగక,తమ ప్రయత్నమును ఆపక వారు
"త్రైలోక్యే తు సమస్తాని సాంవ్రతం భాంతితే గృహే
ఇంద్రుని ఐరావతము,పారిజాతము,ఉచ్చైశ్రవహయము,హంసల విమానము,మహాపద్మనిధి,....
ఈ విధముగా సమస్త రత్నములు నీ అధీనములోనున్న ఈ సమయమున ఆ స్త్రీరత్నమును స్వీకరించి,మరింత విరాజిల్లుమని కాగల కార్యమునకు తమవంతు పనిని పూర్తిచసిరి.
అమ్మదయతో ఆ శుంభ-నిశుంభుల నిర్ణయమును జరుగపోవు పరిణామములను/ఫలితములను తెలుకునే ప్రయత్నమును తరువాతి భాగములలో చేద్దాము.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment