Thursday, November 17, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-25

 


 న రుద్రో రుద్రమర్చయేత్-25

  **********************

 "మథురం శివమంత్రం మదిలో మరువకె ఓ మనసా

 ఇహపరసాధనమే-

      నరులకు సురుచిర పావనమే

 ఆగమ సంచారా-నా స్వాగతమిదె గొనుమా

 భావజ సంహార- నన్ను కావగ రావయ్యా."


  ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనములో మనము "ఇషు" శబ్ద ప్రాశస్త్యమును తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము.

 ధనుస్సు- నారి- బాణములు విలుకాని ఆభరణములు.

 సంరక్షణకు ఆయుధములు.

 అందులో మనకు కనిపించునవి పదునైన బాణములు చేయుచున్న పరాక్రమములు.కాని నిజమునకు ధనువు సహాయము చేయకపోతే అవి నిర్వీర్యము .ఆ ధనువునకు కట్టబడిన గుణము/నారి బిగుతుగా లేకపోతే విలువిద్య

విలువేమిటో  తెలుసుకోగలమా?

 కాని నిజమునకు విల్లు- నారి- శరములు  మన ప్రవర్తన           సంకేతములు.

   మనము చర్చింకోబోతున్న కథనము నరునిది/అర్జునునిది.

   కాదు కాదు నరులది.అంటే మనందరిది.

 అందులో ప్రకటించిన కోపము-ప్రదర్శించిన రోషము జీవుని-దేవుని మధ్య అనవరతము జరుగుచున్నదనుట కాదనలేనిది.

  తపము నెపము.తపమును తాపముగా/కోపముగా మార్చినది ఇంద్రియము.మనసనే ధనుసు తన లక్ష్యమనే నారిని దృఢముగా బంధించకుంటే,ఆ ధనువు సారించుచున్న శరము గురితప్పక గమ్యమును చేరుతుందా? అన్నది సంశయము.


 నమకములో  ఇషు శబ్ద ప్రసక్తిని గమనించిన తరువాత మనము కథను కొనసాగిద్దాము.



  నమక ప్రారంభమే,


 " నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః"

 అంటూ బాణమునకు నమస్కరించుటతో ప్రారంభమైనది.


  1వ అనువాకము -2వ ఋక్కు నందు సైతము

 " యాత ఇషు శ్శివా" అంటూ శివా నీ యొక్క బాణము లోకములకు శాంతమును కలిగించుచున్నది.

  1.వ అనువాకము-4వ ఋక్కు


  "యామిషుం" అంటూ నీయొక్క బాణము

 హస్తే భిభర్షితి-నీ హస్తమునందు ధరించి యున్న బాణము మమ్ములను హింసించకుండునుగాక.


 1.అనువాకము-10 వ మంత్రము

 " యాశ్చతే హస్త ఇషవః"


    తే హస్తే యే ఇషువశ్చ-నీ చేతియందు ఏ బాణములున్నవో  వానిని,

   పరావప-విడిచివేయుము.



 1.అనువాకము-12 వ మంత్రము

 " విశల్యో బాణవాగం

 బాణముల చివరి పదునును తీసివేయుము.


 1.వ అనువాకము-15 వ మంత్రము

 " అథోవ ఇషిః"



 బాణములను కిందవైపుగా అమ్ములపొదిలో దాచివేయుము

 నమకము మొదటి అనువాకములో ఇషు/బాణ ప్రసక్తితో రుద్రుని ఘోర రూపమును ఉపసంహరించుకుని అఘోరరూపునిగా ప్రసన్నుడై మనలను అనుగ్రహించమని కీర్తిస్తున్నది.




    అందులకు నిదర్శనమేనేమో స్వామి ఎరుకలవానిగా,విల్లమ్ములను చేత ధరించి,అర్జునునితో పోరాడి ,పాశుపతమును అనుగ్రహించుట.


  కాఠిన్యము-కారుణ్యము నాణెమునకు రెండువైపులు.నియమోల్లంఘన కారణముగా పాశుపతాస్త్రము/ పశుపతి అనుగ్రహము కొరకై మహేంద్రగిరికి తపోనిమిత్తము అర్జునుడు చేరుట.క్షత్రియ ధర్మముగా ప్రజా సంరక్షణార్థము లేదా ఆత్మ సంరక్షణార్థము ఆయుధములను సమీపములో నుంచుకొనుట సముచితమే.అనుచితమైన విషయము కథను ముందుకు నడిపించినది.

   తెలుగుభాష అత్యంత అందమైనది కనుక నానార్థములను నగలతో  మెరిసిపోతుంటుంది.విల్లునకు బిగించి కట్టు తాటిని నారి అంటారు.గుణము అని కూడా అంటారు.గుణము అను పదమునకు స్వభావము అను అర్థమును అన్వయిస్తారు.


   వింటి నారి కనుక స్వభావమయితే విల్లు మన మనస్సేకదా.దానికి బిగుతుగా కట్టవలసినది సంకల్పమును.మనసనే ధనుస్సునకు కల బాణములు పంచేంద్రియములు. మనస్సు గట్టిదైన తాటిచే బంధింపబడినప్పుడే శరములు గురిని తప్పవు.ఏకాగ్రతయే నారిని లాగి సంధించుట.

   అర్జునుని విషయమునకు వస్తే సత్వగుణ తపమునకు గుర్తు.రజో గుణము క్షాత్ర  ధర్మము.

 కాని విచిత్రము కథలో/కథలో మాత్రమే సుమా

 తమో గుణము ఈ రెండు గుణములను అధిగమించినది.


   దానికి నిదర్శనమే

 సూకరమునకా   "రణము"


 అవును సూకరమే "కారణము".


 అవును బొందె ఎవరికి చెందవలెనది సందేహము.

 ఊపిరి విడిచిన ఉపాధి నడిపించుచున్న నాటకము.

    ఇది బాహ్యము.పరిణామములు అనూహ్యము.


 నిజమునకు ఇది దేవునకు-జీవునకు మధ్య జరుగుచున్న పోరాటము.కాదు జీవుని ఆరాటము.

  ఇద్దరు విలుకాండ్రు ఒక మృత వరాహదేహమునకై తమ శరాఘాతము వలననే ప్రాణము కోల్పోయినది కనుక అది తమదేనన్నది వివాదము.

 ఇంతకు శరములను సంధించిన జీవుని విల్లు గాండీవము.దేవునిది పినాకము. పి నాకము.నాకము అనగా స్వర్గము.స్వర్గము అనగా ఏదో లోకము అంటారు కొందరు.మరికొందరు ద్వంద్వాతీత స్థితి అని గ్రహిస్తారు..

  తన నిజ గమ్యమును మరచిన తామసిక స్థితి అర్జునునిది.తపము చేసి పాశుపతమును పొందవలసినది గమ్యము.కాని దానిని విస్మరింపచేసినది అహంభావము.విగత పందికై తగవులాడుచున్నది.


 నిజ స్థితిని తెలియచేయవలసిన బాధ్యత కలది అనుగ్రహము.

   ప్రసాదించుటకు పూర్వము గ్రహీత యోగ్యతను పరీక్షించుట కర్తవ్యము.

   అంటే పోరునకు కారణము అర్హతా నిర్ణయము.

 శివుడు ప్రసాదించవలసినది-జీవుడు ప్రార్థించవలసినది పశుపతి అనుగ్రహమనెడి పాశుపతాస్త్రము.

   అది కేవలముగా పరిగణింపబడి శస్త్రము/బాణము కాదు.

        మరి. " అస్త్రము."

      మంత్ర పూరితమైన/మహిమాన్వితమైన బహువిధములుగా,మానసికముగా నైన, మంత్రముగా నైన/  ఏ రూపముగా నున్న   ఆయుధముగా నైన/చూపుగా నైన ప్రయోగింపదగినది.దానికి మరొక నియమము కూడా కలదు.సమానమైన సామర్థ్యము కలవారిపైననే,సమర్థవంతమైన సమయము ఆసన్నమైనప్పుడే.


(అర్జునుడు ఉపయోగించిన సందర్భములు లేవని పెద్దలు చెబుతారు)

   శివుని ధనస్సుయొక్క స్పర్శ నరుని మనసును మార్చినది.నిజస్థితిని తెలియచేసినది.

 తన అర్చనమే  తన ఎదుట నున్న ఎరుకలో అచ్చుగుద్దినట్లుగా గమనించగలిగాడు అర్జునుడు.అంటే తమోగునము తరిమివేయబడినది.తాదాత్మ్యత తరలి వచ్చినది.పాశుపతము లభించినది.యుక్తాయుక్తము ముక్తికి కారణమైనది.

 ఇంత కథను నడిపించిన మూకాసురుడుడు  కూడా  ముక్తుడైనాడు.

   పశుపతి మనలందరిని తన అవ్యాజకరుణావీక్షణముతో అనుగ్రహించును గాక.

   మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.


       ఏక బిల్వం శివార్పణం.



    


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...