నాల్గవ పాశురము
*************
ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్
ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు
తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్
వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
*********************
గోకులములోని వారందరు తాము వింటున్నది-కంటున్నది-అంటున్నది కృష్ణునినే తక్క అన్యము కాదని భావించు భాగ్యశాలురు.వారి సమయము-సంభాషణము-సమస్తము శ్రీకృష్ణుడే.వారెవరిని తలచుకొనినా-కలుసుకొనినా-పిలుచుకొనినా వారి సంబోధనము మాత్రము ఒక్కటే.అదే,
కణ్ణా!
గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ పంచాయుధములను-పంచభూతములను-పంచేంద్రియములను సమన్వయపరుస్తూ,ప్రళయానంతరమున ప్రకటింపబడిన,
పద్మనాభస్వామిని వరుణదేవునిగా ప్రార్థిస్తున్నది.
భావములోన-బాహ్యమునందున గోవింద గోవింద అన్నది వారి జీవనము.
నిత్యకర్మానుష్ఠానమునకు/మార్గళి స్నానమునకు కావలిసిన జలములను పుష్కలము నిమ్మని వారు స్వామిని వేడుకుంటున్నారు.
మగిళిందు మార్గళి నీరాడ
మనస్పూర్తిగా-మహదానందముగా-మంగళగుణములను అనుభవించు మంగళస్నానము కోరుకుంటున్నారు.
ప్రస్తుత పాశురములో ప్రతిపదము విశేషముతో కూడి అశేషానందమును అందిస్తుంది.
వారు చూడగలుగుతున్నది ,
సముద్రములోనికి,
ఆళియళ్ పుక్కు-పూర్తిగా ప్రవేశించి,
ముగంద కుడు-నీటిని దప్పిక పూర్తిగా తీరు వరకు త్రాగి,
ఎరి-(నీవు) సముద్రమునుండి పైకిలేచునపుడు,
పాళియన్ తోళ్ ఉడై -నీ అతి బలపరాక్రములలైన భుజములను దర్శింపనిమ్ము.
మెయికరుత్తు-నీలమేఘశ్యామునిగా ప్రకాశింపుము.
ఆళిపోల్ మిన్ని-నీ కుడిచేతిలోని సుదర్శనమును కననిమ్ము
వలంపురిపోల్-నీ ఎడమచేతిలోని పాంచజన్యమును సైతము కననిమ్ము-విననిమ్ము.
ఏ విధముగా నంటే
ఊళి ముదల్వన్ పర్పనాబన్-ప్రళయానంతరము ప్రకటింబడిన ,పద్మనాభస్వామివలె.
కణ్ణా! మాకృష్ణా,
మమ్ముల అనుగ్రహించునప్పుడు
నీ ఒండ్రుం కైకరవేల్-నీ చేతిని కొంచము కూడా బిగించవద్దు.
తాళాదె పెయిదిడాయ్-ఆలస్యముచేక వర్షించు.
ఆ వర్షము ఎంత మనోహరముగా మేము ఆస్వాదించాలంటే,మెరుపులలో స్వామి సుదర్శనకాంతులు కనువిందుచేయాలి.ఉరుములలో పాంచజన్య శంఖనాదము విని తరించాలి..నీవు నింగికి-నేలకు వారధిగా వర్షపుచినుకులను శరములను సంధించునపుడు శారంగ సామర్థ్యమును సంకీర్తించగలగాలి.ఆ శరములు క్షామమను రక్కసిని పారద్రోలి,వ్రతమును చేయగలుగుటయే వ్రతఫలముగా అనుభవించునట్లు వర్షింపుము అను ,
ఆళిమళై-బృహత్ జలరూపమైన కృష్ణుని అర్థించుచున్నది.
ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు
రేపటిపాశురములో స్వామి అర్చావిభూతులనందచేయు ,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment