Saturday, November 18, 2023

KADAA TVAAM PASYAEM -06






  


   


   కదా  త్వాం  పశ్యేయం-06


   *********************




  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం


   నమామి భగవత్పాదం శంకరం  లోక శంకరం".




  "ఆనందామృత పూరితా హరి పదాంభోజాలవాలోద్యతా


   స్థైర్యోపఘ్నం ఉపేత్య భక్తి లతికా


  శాఖోపశాఖాన్వితా


  నిత్యాభీష్ట ఫలప్రదుని,"


 భక్తులను శాఖోపశాఖలుగా విస్తరింపచే       సుకొనిన ఆనందామృత పూరితుని,మన మనోFఅలకమునందు స్థిరముగా నిలుపుకుంటూ,ఈనాటి బిల్వార్చనను ప్రారంభించుకుందాము.




   శివయ్యా రాత్రంతా ఆ గిరిజ చిన్న గుడారమును తీసుకుని వచ్చి నా ముందేనిలుచున్నట్లున్నదయ్యా.ఎంత చక్కగా అభినయించింది చక్రాల్లా కళ్ళను తిప్పుకుంటూ.ఆ చిన్నారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది.ఒక్కసారి బడి దగ్గరకు వెళ్ళివద్దామా అన్నాడు శంకరయ్య.


 అది బడి కాడు.నీ ఒరవడిని మార్చేసే గుడి అని మనసులో అనుకుంటూ అయితే త్వరగా బయలుదేరుదాం పదండి అని ఇద్దరు బయలుదేరారు.


   తస్మై శ్రీ గురవే నమః.


  పాఠశాలలో పాఠము చెబుతున్నారండి.మీరు గిరిజను ఇప్పుడు కలిసి మాట్లాడలేరు.సాయంత్రం రండి అన్నాడు కాపలాదారుడు గేటు దగ్గర.


  పోనీ ఒకసారి ఆ కిటికీలోనుండి చూసి వెళ్తానయా  అని బతిమిలాడాడు శంకరయ్య.


ఆపుట భావ్యము కాదన్నాడు శివయ్య.


  సరేలెండి.నాకు లోపల పని ఉంది.ఇక్కడినుండిచూసి పొండి, అని తన పనిచేసుకోవటానికి వెళ్ళిపోయాడు వాడు.


   " నిధయే సర్వ విద్యానాం-భిషజే భవ రోగిణాం

  గురవే సర్వ లోకానాం-దక్షిణామూర్తయే నమః." .


  మధ్యలో కూర్చున్నారు గురువుగారు చుట్టూ కొండ బొమ్మ -అడవిబొమ్మ-తోట బొమ్మ-మనిషి బొమ్మ-పక్షి బొమ్మ-పురుగు బొమ్మ-పరచుకొని.


 వాటిని చూపిస్తూ గురువుగారు ఏమి చెబుతారా అంటూ ఆలోచిస్తున్నారు కొందరు పిల్లలు.


 నిన్నటి నాటకమునకు-వీటికి ఏమైన సంబంధము ఉందా అని కొందరు తర్కించుకుంటున్నారు.


 వీటిలో ఒకదానికి మరొకదానితో పొంతనలేదు.కొన్ని పెద్దగా-మరికొన్ని చిన్నగా రకరకములుగా ఉన్నాయి.వీటన్నింటితో మళ్ళీ నాటకం వేయాలా? 


 ఈసారి నేను చిన్న పురుగులాగా కాక పెద్దకొండ వేషము అడుగుతాను.లేకపోతే రాముగాడు తీసుకుని నిన్న కోతి -ఇవ్వాల దోమ అంటూ నన్ను  ఎక్కిరిస్తాడు అని తనలో తాను అనుకుంటున్నాడు.


  వారి ఆలోచనా లహరులకు అడ్డుకట్ట వేస్తూ,


 గురువుగారు శ్లోక పఠనం ప్రారంభించారు శ్రావ్యంగా.


    వెంటనే శివయ్య,


 శంకరయ్యా మనస్సుకు బంధం వేసేసి,బయటకు మాత్రము గిరిజను చూసావుగా.ఇక తిరిగి వెళ్ళిపోదామా?అని అడిగాడు.బదులివ్వలేదు శంకరయ్య.


 శివయ్య వెంటనే నిన్న నాటకము చూసి,గిరిజను చూడాలంటూ ఇక్కడికి వచ్చావు.ఇప్పుడు పంతులుగారి పద్యము విని రేపు మళ్ళీ ఇక్కడకు వద్దామంటే మనమెప్పుడు వెళ్ళి వాడిని పట్టుకుంటాం.వాడి భరతంపడతాం చెప్పు అన్నాడు కర్తవ్యం గుర్తు చేస్తున్నట్లుగా.


 ఈ ఒక్కసారికి పంతులు గారి పద్యము విని వెళ్ళీపోదాం..నేనేమి మర్చిపోలేదులే వాడిని పట్టుకోవటం అన్నాడు గట్టిగా. 


  "వాడసలే మాయావి",ఎటువైపునుంచి ఏ బంధం వేసి నిన్నుకూడా మార్చేస్తాడేమో నన్నది నా భయమని అంటుండగానే,


 " నరత్వం-కీటత్వం-నగ-వన మృగత్వం-విహగత్వాది జననం అంటూ ఆ బొమ్మలను చూపిస్తున్నాడు.


 మనుషులే కాదు-చిన్న కీటకము దగ్గరనుండి-పెద్ద పర్వతము వరకు వాని కరుణను పొంది తరించినవే.


 ఆ పరమానంద లహరిలో మునకలు వేస్తూ మురిసిపోతున్నవే అంటున్నాడు పంతులు తన్మత్వముతో.


 మూడు కన్నులవాడి కరుణ శంకరయ్య వేసుకున్న ముడులను విప్పుతోంది.గడులను దాటిస్తోంది.గారడీలు చేస్తోంది.


 గ్రహించిన శివయ్య  ఓఓఓఓ శంకరయ్యా అని గట్టిగా పిలిచాడు..


 పద్యాలు పాడటం-పాఠాలు చెప్పడం,బొమ్మలు చూపటం-బోధలు చేయటం పంతులుగారి పని.మన పని అదికాదు.మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్నాను.ఇదే చివరి సారి.పెడచెవిన పెట్టావంటే .......


  నిన్న మనము చూసిన/మీరు మాట్లాడిన మహాదేవుడు మాయలోడు.మరిన్ని కబురులు చెబుతూ నిన్ను మాయలో పడేస్తాడు.


 అసలేమి వినపడటం లేదు శంకరయ్యకు.ఆ బొమ్మలతో ఏమి చెబుతాడో ఎంతవరకు పిల్లలు అర్థం చేసుకుంటారో  ఏమవుతోందో అంటూ  తదేకముగా చూస్తున్నాడు వాటివైపే.


 పిల్లలు, ఆ చల్లనైన దేవుడు, మనషులనే కాదు,


నర-మానవులను


దేవత్వం-దేవతలను


నగత్వం-పర్వతములను


వనత్వం-అడవులను/ఉద్యానవనములను


మృగత్వం-మృగములను


విహగత్వం-పక్షులను


మసకత్వం-చిన్న చిన్న కీటకములను


   వేటినైనా శివా అని మనస్పూర్తిగా తలచుకుంటే చాలు .సంరక్షించేస్తాడు అని అంటుండగానే


 గణేష్ పంతులుగారు ఒక్కొక్క  పదమునకు  ఉదాహరణము నిస్తారా దయచేసి అని వినయముగా అడిగాడు.


 దానికి నవ్వుతూ ఆయన మీకు చాలా చాలా కథలు వచ్చుకదా.వాటినే పరిశీలిద్దాము.


 ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను.తెలిస్తే జవాబు చెప్పండి అంటూ,


 ఒక బాలుని లేపి నరత్వం అనగానే


 అదే గురువుగారు మొన్ననే మా అమ్మ చెప్పింది అర్జునునికి పాశుపతాస్త్రము నిచ్చి ఆశీర్వదించాడట మహా భారతములో.


 శెభాష్.


 అమ్మా లక్ష్మి నీ ప్రశ్న


 దేవత్వం-శివుడు ఆశీర్వదించిన దేవతలు ఎవరైనా ..


  పక్కనున్న సరస్వతి కిందటి సంవత్సరం నాటకము వేసాము కదండి.


 విష్ణుమూర్తికి సుదర్శన చక్రమిచ్చాడు అంది .


   


 మూడవ ప్రశ్న -నగత్వం


 మాస్టారు గారు,


 మా తాతయ్య రోజు హిమాలయకృత శివ స్తోత్రము...చదువుతారండి అన్నాడు.


  అద్భుతముగా సమాధానాలు చెబుతున్నారు అంటూ ఒక్క క్షణం ఆగారు గురువుగారు కిటికివంక చూస్తూ.




 గురువుగారు మీరు చూపిస్తున్న మిగతా బొమ్మల లథలు అన్నీ నేను చెబుతానండి అంటే నేను చెబుతాను అంటూ ముందుకు వస్తున్నారు.


  వారి ఉరకలేస్తున్న ఉత్సాహానికి అడ్డుకట్టలా  ఆటలాడుసమయపు గంట మోగింది.పిల్లలు బయటకు పరుగులు తీస్తూ వస్తున్నారు.


  గురువుగారు సైతము బయటకు వచ్చి అయ్యా! మీరా,


 శంకరయ్య గారు దూరము నుండి గుర్తుపట్టలేదు,చాలా సేపు నిలబడినట్లున్నారు.రండి కూర్చుని మాట్లాడుకుందాము అన్నారు.


 వెంటనే శివయ్య వద్దులెండి.మేము వెళ్ళిపోవాలి .శంకరయ్య గారు గిరిజను ఒకసారి చూస్తానంటే వచ్చాము అన్నాడు వారిస్తూ.


  ఇంతలో గిరిజ పరుగెత్తుకుంటూ వచ్చి,మీరు నన్ను నిన్న గుడిలో చూసారా శంకరయ్యగారు అంటూ,గురువుగారితో మిగతాబొమ్మల విశేషాలన్నీ గడగడ చెప్పేసి వెళ్ళీపోయింది గుక్కతిప్పుకోకుండా.


 వనము అనగా తిల్లై వనమట-చిదంబరమట.


 మశకం అదిగో సాలెపురుగట.


 మృగము నందిలేదూ-లేడిలేదూ అంటూ,


స్నేహితురాలు పిలిస్తే తూనీగలా పారిపోయింది.


 దిమ్మతిరిగింది శంకరయ్యకు.బొమ్మలా చూస్తుండిపోయాడు.


 వెంటనే గురువుగారు పరమార్థం-పరమానందలహరి వారిముఖాలలో తొణికిసలాడుతోంది కదా  అన్నారు తృప్తిగా. 


  మనమైతే,


 స్థూలమని-సూక్ష్మమని,చరమని-అచరమని-చరాచరమని-ఇంద్రియ సామర్థ్యమని-త్రిగుణాత్మకములని-తురీయమని -స్థిరమని-చంచలమని-తమో యోగమని-తపోయోగమని ఉపాధులని -సాధుత్వమని-కౄరత్వమని వాటికి ఎన్నో పేర్లనే తాళ్ళను ముడివేస్తాము.


 కాని నిజమునకు


 ఉపాధులు వేరు కాని -చైతన్యము ఒక్కటేగా.


   అది చేసే చేష్టలు వేరుగాని చేసేది ఒకటే కదా.


 " నిరాకారము -నిశ్చల సరోవరము


   సాకారము శివానంద లహరీ ప్రవాహము"


  అది,


 నిన్ను నీవు మార్చుకునేంతవరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది.వెన్నుతడుతూనే ఉంటుంది.


  శివుని డమరుకం మ్రోగిందా అన్నట్లుగా గణగణగణ మంటూ బడిగంట మ్రోగింది.


  శంకరయ్య హృదిగంటను సైతము మ్రోగిస్తూ.


  కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.


    'తన్మై మనః శివ సంకల్పమస్తు


     వాచే మమశివపంచాక్షరస్తు


     మనసే మమ శివభావాత్మ మస్తు".


    పాహిమాం పరమేశ్వరా.


    (ఏక బిల్వం  శివార్పణం)








  




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...