కదా త్వాం పశ్యేయం-08
******************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."
"సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిదుర్య జగతా సాంగత్య సంభావతే
సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యనౌ భవానీపతే
సాయుజ్యం మమసిద్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్థోస్యహం."
బహుముఖముల భాసించే భవానీపతిని,మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.
అమ్మపిల్లవాడిని కోప్పడినప్పటికిని వాడు తల్లి ఒడినే కోరుకుంటాడు.అదియే మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము.అదే విధముగాభగవంతుడు పాపకర్మక్షయమునకి ఎన్ని కడగండ్లను జీవులకు కలిగిస్తున్నప్పటికిని వారు భవత్సాన్నిధ్యముననే ఊరటను పొందగలుగుతారు అన్న విషయమును ఆదిశంకరులు అర్థమయ్యేలా అనుగ్రహించారు.
ఆలోచిస్తూ మెల్లగా పాదాలను కదుపుతున్నాడు శంకరయ్య.
ఆక్షేపిస్తూ తాను పావులను కదుపుతున్నాడు శివయ్య.
శంకరయ్యా! నీవు ఈమధ్యన అదోలా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు.చూసిన దానినే మళ్ళీ చూస్తుంటావు.వినిన దానిలో మళ్ళీ వింటుంటావు.పాతవిషయాలే అయినాఎంతో కొత్తగాఉన్నాయంటూ,నీలో నీవే మాట్లాడుకుంటున్నావు.పక్కనున్న నన్నసలు పలకరించడంకాని-పట్టించికోవడంకాని...అబ్బే,,
అదేమిలేదు శివయ్యా.ఎప్పుడో ఎవరో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి.
మంచివారిపక్కన ఉంటే సామీప్య అనుగ్రహమట.అలా నీవు నా పక్కనే ఉంటున్నావు.నన్ను నీలాగా తెలివైనవాడిగా మార్చాలని చూస్తున్నావు.అదే నీవు-నేను ఒకేవిధముగా ఉండేటట్లు-ఒకే విధముగా ప్రవర్తించేటట్లు.అదే అదే సారూప్యమన్నారప్పుడు.
అంతేకాదు నేనెక్కడుంటేనువ్వక్కడుంటున్నావు.నువ్వెక్కడికి వెళుతుంటే నన్నక్కడికి నీతో పాటుగా తీసుకెళుతున్నావు.దానినే సాలోక్యమంటారని వాళ్ళు చెబుతుండేవాళ్ళు.వీడోక మాలోకం.వీడికి సాలోకమెప్పుడొస్తుందో.అంటే ఇదేనా శివయ్యా అడిగాడు అమాయకంగా శంకరయ్య.
ఇవేవి నాకు తెలియదు.మనమిద్దరము కలిసి ఒకమంచిపనిమీద వెళుతున్నామని మాత్రమే తెలుసు .
ఇంకా నయం వాళ్ళు చెప్పిన నాలుగో మాట మరిచిపోయినట్లున్నావు.సాయుజ్యం అంటూ అడిగేవాడివి లేకపోతే.
అయినా అవ్వన్నీ మనకెందుకు చెప్పు.అన్నము తిని హాయిగా పడుకుందాం.రా అంటూ,కడుపునిండా తినిపించి,కంటినిండానిదురకై లాలించాడుశివయ్య.
అదొక పెద్ద విద్వత్సభ.అందరు పండితులే.రాజాశ్రయమును పొందినవారే.ఆ రాజు గారి పుట్టినరోజట.సరదాగా ఒక శ్లోక వివరణను చేసిన వారికి నజరానా లక్షరూపాయిలు ప్రకటించారు.
ఎందరో పండితులు వస్తున్నారు.ఫలకము మీద వ్రాసి యున్న శ్లోకమును ఇలా,
"అంకోలం నిజబీజ సంతతిః అయస్కాంతోపలంసూచికా
సాధ్వీ నైజవిభుం లతాక్షితిరుహం సింధుంసరిత్వల్లభం
ప్రాప్నోతీహ యథాతథా పశుపతేః పాదారవింద
చేతో వృత్తిర్యుపర్త్య తిష్ఠతి 'సదా సాభక్తిరిత్యుచ్యతే."
ఎందరో పండితులునజరానాను ఆశించి వస్తున్నారు-తమకు తోచిన భావముచెబుతున్నారు కాని రాజుగారు ప్రసన్నులగుటలేదు.పెదవి విరుస్తూనే ఉన్నారు.
చక్కటి సమన్వయమును చేసే సమర్థత కలవారిని మా రాజ్యము నోచుకోనేలేదా అనగానే నేను శివార్చనగా భావించి చెప్పటానికి ప్రయత్నిస్తాను.నజరానా నాకు కొన్ని బిల్వపత్రములను బహూకరించండి అన్నాడు ఒక పండితుడు.
ఘొల్లున నవ్వారు.సభలోనివారు.కొన్ని మారేడాకుల కోసము మహాశ్లోక వ్యాఖ్యానమును చేయడానికి ముందుకొస్తున్నాడు.వెర్రిబాగులవాడిలాఉన్నాడు.
వారు మహారాజుతో ,
మహారాజా! కేవలము శ్లోక భావమే కాదు.మేము అడిగిన ప్రశ్నలకు సమాధానమునిచ్చుటకు అంగీకరిస్తేనే అతనికి అవకాశమివ్వండి అన్నారు.
అందులకు ఆ పండితుడు మహారాజుతో వారి షరతులు నాకు అంగీకారమే అన్నాడు.
సభ అంతా నిశ్శబ్దం.సభాపతి వ్యాఖ్యానము వినాలని.
ఈ శ్లోకములో ఆదిశంకరులు నాలుగు విధములైన భక్తులను-అనుగ్రహమును పరిచయము చేసిన తరువాత,మరింత సులభముగా సామాన్యులకు అర్థమగుటకు ప్రత్యక్ష ఉదాహరణములను చొప్పిస్తున్నారు.అవి
1అంకోల వృక్షము-దాని విత్తనము(ఊడుగు చెట్టు)
2సూది-సూదంటురాయి(అయిస్కాంతము-అయిస్-ఇనుము-కాంతము-ఆకర్షించునది)ఇనుమును ఆకర్షించునది
3.సాధ్వీ-భర్త
4.లత-చెట్టు
5.నది-సముద్రము.
ఈ అయిదు ఉదాహరణములతో భక్తుల-భగవంతుని సంబంధమును /అనుగ్రహమును వివరించారు.
అందరికి అర్థమయినదా అన్నట్లు ఒకటే చప్పట్లు.
రాజుగారు దరహాసముచేస్తూ,పండితులవంక చూస్తూ కన్నులతోనే తరువాతి కార్యక్రమమునకు అనుమతినిచ్చారు.
.1. మొదటి పండితుడు సభాపతినిచూస్తూ,మీరు చెప్పిన ఉదాహరణములు అన్నీ ఒకే కోవకు చెందినవా" కావా? అని ప్రశ్నించాడు దర్పముగా.
దానికి సభాపతి వినయముగా మొదటి నాలుగు ద్వైతములు.రెండు వస్తువులు స్పష్టముగా ఉన్నాయి.
కాని ఐదవ ఉదాహరణము అయిన నది-సాగరము అద్వైతము, సాగరములో కలిసిన తరువాత నది తన నామరూపములను-ఉనికిని కోల్పోయి సాయుజ్య భక్తికి కి సంకేతముగా మారినది.
2 రెండవ పండితుడు ఈ శ్లోకము స్తోత్ర విభాగములలో దేనికి చెందినదో చెప్పగలరా అని అడిగాడు గట్టిప్రశ్ననే వేసాననుకుంటూ.
"నమస్కార తథాస్యేశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమః
"విభూతిః ప్రార్థనాచ్యేతి షడ్విధం స్తోత్ర లక్షణం"
అని ఆర్యోక్తి. .ఇది సిద్ధాంత స్తోత్ర విభాగమునకు సంబంధించినది.లోకరీతిని చూపిస్తూ,అదేవిధముగా లోకములను సృజించిన లోకేశుడు భక్తులను అనుగ్రహించుట సహజమే కదా అని చమత్కారము.
3.అంకోల వృక్ష ప్రస్తావనే ఎందుకు అవసరము అని మూడవ పండితుని ప్రశ్న.
అంకోలవృక్ష బీజములు పండి-ఎండి -రాలిపడునప్పుడు వాతావరణము మేఘావృతమై ఉరుములు-మెరుపులతో కూడి వానిని భయపెట్టుచుండును.కనుక రక్షణమునకై అమ్మవడిని చేరునట్లు,సంసారపు జడివానను తప్పించుకొనుటకు పరమాత్మ పాదములను పట్టుకొనుట సముచితమని అంకోలవృక్షమును సంకేతించినారు.
4.వీటి అయిదింటికి అందరకు అర్థమయ్యే రీతిలో ఉదాహరనములను చెప్పగలరా నాల్గవ పండితునిప్రశ్న.
గర్భస్థ శిశువుగా-శిశువుగా అన్ని దశలలోను శ్రీహరిని నమ్ముకున్న ప్రహ్లాదుడు-అంకోలవృక్షబీజము.
కన్నతల్లిద్వారా-నారదబోధనల ద్వారా తారగా ప్రకాశించుచున్న ధృవుడు సూది.
ఆలంబనముగా శివలింగనమును వదలక చిరంజీవి యైన మార్కండేయుడు తీగె.
తన స్వామి అయిన శ్రీకృష్ణునికై ఎదురుచూచి పొందిన రుక్మిణీదేవి -సాధ్వి.
ఇంక అసంఖ్యాక భక్తాగ్రేసరులు ఎందరో స్వామిలో సాయుజ్యమును పొందినవారే.ఎన్నిపేర్లు చెప్పగలము.ఎంతమందని లెక్కింపగలము.
దీనినే నవవిధభక్తుల పట్టికలో " ఆత్మనివేదనమని" అంటారు.
అవాక్కయ్యారు పండితులు.ఆనందించాడుమహారాజు.అర్చనాభావముతో సభలోనికి అడుగుపెడుతున్నాయి "బిల్వపత్రములు"
శంకరయ్య చప్పట్లుకొడుతూనే ఉన్నాడు ఆనందభాష్పాలతో.
ఏం శంకరయ్యా ఏమిటా చప్పట్లు ? అంటూ వాస్తవానికి తెచ్చాడు శివయ్య.
అంటే! నేను చూసినదంతా-విన్నదంతా నిజము కాదా -స్వప్నమా అంటూ లేచాడు శంకరయ్య.
స్వప్నమో/సత్యమో నీకే తెలియాలి అన్నాడు శివయ్య.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment