ఆదిత్య హృదయం-శ్లోకము-05
***********************
ప్రార్థన
******
" జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం
హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."
పూర్వరంగము
***********
స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి రామ చంద్రునకు/మనకు వివరించినారు.
ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును,
"ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు.
నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు.
ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది.
శ్లోకము
******
"రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం"
తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురులచే నంస్కరింపబడుచున్న ,భువనేశ్వరుడైన భాస్కరుని ,
ఓ రామా-పూజింపుము అని అగస్త్యుడు పలుకుచున్నారు.
"స్వామి" వేటిద్వారా సర్వమును-సకలమును అనుగ్రహిస్తున్నాడో అవి "రశ్ములు" పూర్తిగా ఆవరించినచో అది మంతం లేక మయం.
కనుకనే విష్ణుసహస్రనామ స్తోత్రము,
" ఓజస్తేజో ద్యుతిధరః(ప్రకాశమే రూపముగా కలవాడా) ప్రకాశాత్మా-ప్రతాపనః" అని
పరమాత్మను ప్రకాశముగాను-ప్రచండుని గాను స్తుతిస్తున్నది.
స్వామి రశ్ములను అన్నమయ్య సైతము,
" కడలి ఏనుగు మీదు కాచు ఎండయు నొకటె
పుడమి శునకము మీద పొలయు ఎండ నొకటే అని సూర్య రశ్ముల సర్వవ్యాపకత్వమును సన్నుతించినాడు.
ఇప్పుడు కిరణములు అన్న శబ్దమును సమన్వయపరచుకుంటూ ,స్వామి జగద్రక్షణమును కీర్తిద్దాము.
స్వామి భాస్కరుడు అంటున్నది ప్రస్తుత శ్లోకము.
భాసించు-కాంతివంతమైన కరములు కలవాడు.
కరుడు చేయగల చేతులు కలవాడు.
" కరము" మిక్కిలి అన్న అర్థముతో అన్వయించుకుంటే మిక్కిలిగా (తరిగిపోనంతగా)చేయువాడు,దివాకరుడు-దినకరుడు,అహస్కరుడు -పగటిని కలిగించువాడు.
స్వామికరములు కాంతిమయములు కనుక రశ్ములు అనగా కాంతులు అనికూడా అన్వయించుకోవచ్చును.
2. రశ్ములు/కిరణములు అనగా వేదములు.
అందుకే "మేలుకో శ్రీసూర్యనారాయణ-వేద పారాయణా" అని మనము వింటుంటాము.
3. రశ్ములు అనగా ఇంద్రియములు.అచేతనములుగా నున్న
ఇంద్రియములు సౌరకిరణ ప్రసరణముచే చైతన్యభరితములవుతాయి.కనుకనే,
4. రశ్ములను "ప్రాణములు" అని కూడా అంటారు.
అదే విషయమును "మంత్రపుష్పము"
"తిర్యక్ ఊర్థ్వం అథః శాయీ రశ్మయత్ తస్య సంతతాః
సం తాపయతి స్వం దేహం ఆపాద తల మస్తకః"
అడ్దముగా-నిలువుగా-కిందగా అనేకనాడులతో నిర్మితమైన నాడీమండలము లోనికి తన రశ్ములను,శిరమునుండి-పాదము వరకు జ్వాలాయమానముగా ప్రవేశింపచేసి-వ్యాపింపచేస్తున్న ,ప్రత్యక్ష స్వామి,"సూర్యనారాయుణకు" నమస్కారములు.
5. రశ్ములు అంటే పంచభూతములు.వాటిని స్వామి తనకిరణములచే సమన్వయ పరుస్తు,సమర్థవంతముచేస్తున్న పరమాత్మకు వందనములు.
సమ్యక్ ఉదయతీతి-సముద్యంతం
లోకాన్ క్రియా సుప్రవర్తం-సముద్యంతం.
సంపూర్నముగా తన తేజస్సును విస్తరింపచేయుటకు సిద్ధపడుటయే -సముద్యంతం
పూజయంతం -రామా ఆ తేజోమూర్తిని పూజింపుము.
"పూజ" పునీత అర్చనము.ఇది నిత్యము-నైమిత్తికము అని,వ్యక్తిగతము-సామూహికము అని ,బాహ్యము-ఆంతరంగికము అనునవి వ్యవహారములో నున్నవి.పూ-సుమంగళి-తూరుపు దిక్కు.జ-జాజ్వల్యమానమగువేళ సేవింపుము.
ఈ సందర్భములో,/కథనములో,
రాముడు అను వ్యక్తి,రావణ సంహారనిమిత్తము,ఆంతరంగికముగా సూర్యభగవానుని పూజిస్తున్నాడు.ఇది నైమిత్తిక పూజ.ఏకాంత సేవనము.
కాని అదే రాముడు నిత్యకర్మగా,ఏ ప్రతిఫలమును కోరకుండా సూర్యభగవానుని, తన ఇలవేలుపుగా,అర్ఘ్య సమర్పణముతో-నమస్కారములతో బాహ్యపూజను ఆచరించేవాడు.
ఇది నిత్యపూజ.
రామా విజయమునకై వివశ్వంతుడు విస్తరింపచేయుచున్న కిరణములతో అంతకు ముందున్న చీకట్లను కప్పివేయువానిని పూజింపుము అని హితము చెప్పువేళ,
తం సూర్యం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment