కృష్ణం వందే జగద్గురుం
*************************
కృష్ణా నేను
.ముస్తాబు చేయగలుగు కస్తూరిని కాను
వక్షస్థలమందున్న కౌస్తుభమును కానేకాను
సఖ్యత శిఖి చేరగ బర్హిపించమును కాను
ముక్కు చివరి చక్కని ముత్యమును అసలుకాను
.చల్లదనమును అందించగ చందనమును కాను
వేణువునై నినదించగ వెదురును కానేకాను
బెదరగొట్ట సేనల పాంచజన్యమును కాను
చెదరని భక్తిగల పాంచాలిని అసలు కాను
ఆరగింపును అందించిన అరటితొక్కను గాను
అడిగి ఆరగించిన అటుకులు కానేకాను
మిన్నతనము కన్నులుంచ మన్నైనా నేగాను
వెన్నుడవని వెల్లడించ వెన్నపూస అసలుకాను
ఉల్లము ఝల్లనిపించిన గోవర్ధన నగముగాను
గజ్జెలు ఘల్లనిపించిన కాళియమర్దనము కానేకాను
ద్వంద్వ యుద్ధము అందించిన జాంబవంతుడిని కాను
ద్వాదశిఫలమును పొందిన అంబరీషుడిని అసలుకాను
సూచనతో స్తుతియించగ శాంతనవుడిని కాను
సూటిగా కీర్తించ సూరదాసుని కానేకాను
మీరిన భక్తితో కొలిచిన మీరాబాయిని కాను
సంబరముగ సన్నుతింప సక్కుబాయిని అసలుకాను
.కృష్ణశతకమును రచియించిన నరసిమ్హకవిని కాను
కృష్ణగీతను అందుకొన్న అర్జునిడిని కానేకాను
కర్ణామృతమును వ్రాసిన లీలాశుకుని కాను
భాగవతమును అందించిన బమ్మెర పోతన అసలుకాను
.మధురామృతమును అందించు సురభుల గోష్ఠము కాను
మధురభక్తిని అందించు శుక సద్గోష్టి కానేకాను
మాధవలీలలు చాటిన గోదాదేవిని కాను
రాధామాధవ బాంధవ రాసక్రీడ అసలు కాను
. మాయామోహితులను చేయు యమునాతటిని కాను
యమకోరలు పారద్రోలు అష్టాక్షరిని కానేకాను
అష్టమ గర్భముకాను,అష్టమి జననము కాను
అష్ట భార్యలందు లేను,అష్ట పదులు కానేకాను
ఏవికాని నికృష్టుని నిష్ఠూరములను
అష్టకమనుకొని అష్ట దళపద్మము అనుకొని
ఇహపరములు అందించగ ఇష్టము ప్రకటించుతు
అధిష్ఠించి నీ కరుణను సుస్పష్టము చేసుకో
.
కృష్ణార్పణం..
No comments:
Post a Comment