చిదానందరూపా-అనయ నాయనారు
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పశువుల కాపరి అనయ పశుపతి భక్తుడు
తిరుమంగళ సామవేదేశ్వర నామ సేవారక్తుడు
వేదవిహిత పద్ధతిని వేణువును మలచుకొనియె
బూదిపూతల ఉద్ధతిని మందల రక్షించుచునుండె
పున్నమి వెన్నెల నిండిన అమృత బిల్వ వనంబున
అద్భుత మురళీగానము అబ్బురపరచెను జగముల
జాత శతృత్వము పునీతమై జ్ఞానశ్రోతగ మారగ
జన్మరాహిత్యమును పొందగ వేణుపంచాక్షరి కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.
విభూతి అను శబ్దమునకు శివునకు ప్రీతియైన త్రిపుండ్రములు అను అర్థముతో పాటు,శివభక్తులను గౌరవించే సంస్కారము,సర్వ జీవులయందు సర్వేశ్వర దర్శనము,సామగాన సంకీర్తనము,సర్వ జీవులక్షేమమును కోరు స్వభావము,దానివలన లభించు మహిమలు అనికూడా చెప్పుకోవచ్చును.అటువంటి విభూతులు కల అనయ నాయనారు రూపము పశుపతిది.ప్రవృత్తి గోపాలునుది.వేణుగానముతో స్వామికి పంచాక్షరి,నమక-చమకములు వినిపించుచువివశుడయ్యేవాడు.పరశురాముని ప్రఖ్యాతుని గావించిన తిరుమంగళ పురములోని వేద సోమేశ్వర భక్తుడు.పరమేశ్వరార్చనము బాహ్యము.నికృష్టత్వమును నివృత్తి చేయు కృష్ణతత్త్వము ఆంతరంగికము.పశువుల కాపరి వృత్తిలోనే ప్రణవ నాదముతో పంచ భూతములను పరవశమొందించిన ప్రమథుడు.అనయ నాయనారు నాదోపాసనకు పశుపక్ష్యాదులుసైతము సహజ వైరమునుమరచి సాహచర్యముతో పరమేశ్వర పాదసన్నిధిని పరవశమొందినవి.ద్వైతములో అద్వైతమైన అనయ నాయనారును ఆశీర్వదించిన ఆది దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)
No comments:
Post a Comment