చిదానందరూపా-కూట్రువ నాయనారు -15
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కూట్రువనాయనారు ప్రధానాధికారిగ నుండెడి వాడు
పరమ పవిత్ర శివ పంచాక్షరీ జపమును చేయుచు నుండెడివాడు
తొర్రను దాగినవాడు నాయనారు బుర్రను చేరినాడు
తిల్లైలో మూర్ధాభిషిక్తపు వెర్రిని గట్టిగ నాటినాడు
మూడువేలమంది విప్రులను కూట్రువ భక్తితో వేడు కొనియెగ
వీలుకానిరీతి మూడుకన్నులవాడు వానితో ఆడుకొనియెగా
పట్టిన పరమేశ్వర పాదము, శిరమున శివరూపము నిలిపెగ
అర్థనారీశ్వరమును పొందగ మూర్ధాభిషేకము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.
కూత్రువ నాయనారు కాలందై ప్రధానాధికారి.మహాశక్తివంతుడు.శ్రీమంతుడు.ఇది ఐహికము. శివ పంచాక్షరిని అనవరతము చేయు అదృష్టవంతుడు.మహా దేవుని మనస్స్-వచసా-కర్మణా ఆరాధించు అనఘుడు.ఇది పారమార్థికము.
రెండు విభిన్న దారుఢ్యములు కలవాడు కూత్రువ నాయనారు.ఒకటి శారీరక దారుఢ్యము.దీని వలన శత్రువులను జయించగలిగాడు.వారందరిని తన సార్వభౌమాధికారమును అంగీకరిస్తు,తనను మూర్ధాభిషిక్తుని చేయ మన్నాడు.అశోకుని వలె చక్రవర్తిత్వముపై గల వ్యామోహమును తెలియచేయుచున్నది.
తానొకటి తలిస్తే దైవము మరొకటి తలిచింది.సాయి సత్చరిత్రలో ప్రస్తావించినట్లు పీతాంబరములు పొందబోవు కూట్రువ చిరిగిన గుడ్డపీలికలను ఏరుకోవాలనుకుంటున్నాడు.అమాయకత్వమో/అహంకారమో అది.దానినిపటాపంచలు చేయుటయేగ ఆ పంచముఖుని మంచితనము.కాగలకార్యమునకు సూచనగా " కారే రాజులు రాజ్యముల్ కలుగవే అన్న బలిచక్రవర్తి మాదిరి నాయనారు అభ్యర్థన కార్యరూపము దలచలేదు.రాజులు భయపడి పారిపోయారు.ఉన్న ఒక్కరు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.
"మ్రొక్కిన నీకు మ్రొక్కవలె -మోక్షమొసంగగ నీ ఈయవలెను" కనుక తక్కిన మాటల జోలికి వెళ్ళకుండ మనసును శివునిపై కేంద్రీకరించి స్వామిని శరణు కోరాడు నాయనారు.శరణాగత పరిత్రాణుదైన పరమేశ్వరుడు తన పాదమును నాయనారు తలపై ఉంచి,అవ్యాజ కర్ణామృతామును వర్షించినట్లు,మనందరిపై తన కరుణామృత వర్షమును కురిపించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
No comments:
Post a Comment