సౌందర్య లహరి-50
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగా ఆ రుద్రుడుండగా
వ్యాధినిరోధకత్వమైన అతి సున్నితచక్రముగా
పంచభూతములలోని వాయు తత్త్వముగా
పంచాక్షరి నామములోని "న" కారముగ నీవు మారి
క-ఖ-గ-ఘ-ఙ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ
అను అక్షరములు పన్నెండింటిని
పన్నెండు దళములుగల పద్మములో ప్రకటించుచు
హృదయములో నెలకొనిన బీజశక్తి రూపముగా
అనాహత చక్రములో నిన్ను చూచుచున్న వేళ,నీ
మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
" చింతామణి గృహాంతస్థా" గా అమ్మవారు కీర్తింపబడేది ఈ అనాహతచక్రమే.అనాహత చక్రమునే అనంత చక్రము-నిరంతర చక్రము అని కూడ అంటారు.లేతనీలిరంగు పన్నెండు దళములతో ప్రకాశించు అనాహతము అజపామంత్ర స్థానము.సో-హం అను నిరంతర చింతనతో,శాంతి-సహనము.క్షమ-దయ-ప్రేమ-సంతోషముతో అలరారుతు భక్తుని యొక్క పరిపక్వతకు తగినంత స్థానమును కలిపిస్తుంది.యోగిహృద్యాన గమ్యం అయిన పరమాత్మ దర్శన పరిశోధన పటిష్ఠమై,అవ్యక్తానుభూతికి లోనైనను అనాహతము నుండి విశుద్ధివైపుకు శక్తి పయనమును సాగిస్తుంది. అలౌకికానందముతో అనాహతములోని శ్రీమాతను నేను చూచుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment