సౌందర్య లహరి-49
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగ ఆ నారాయణుడుండగ
అవరోధములను అధిగమించి మరికొంచము పైకిపాకుతు
పంచభూతములలోని అగ్నితత్త్వముగ
పంచాక్షరి నామములోని " శి"అక్షరముగ మారి
డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ అను అక్షరములు పదింటిని
పది దళములుగల పద్మములో ప్రకటించుచు
నాభిస్థానము వెనుకనున్న జ్ఞానశక్తి రూపముగా
మణిపుర చక్రములో నిన్ను చూచుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
మణిపుర చక్రమును నాభికమల చక్రము అని కూడ అందురు.తిరోధానముగ నున్న త్రికోణ చిహ్నమును (తలక్రిందులుగ నున్న త్రిభుజము) కలిగి ప్రాణ-అపాన వాయువులకు కలయిక స్థానముగా ఉంటుంది.పసిమి రంగు పది దళములతో ప్రకాశిస్తుంటుంది.సౌర-అగ్నితత్ త్వ మిళితమైన అరోగ్యప్రదాయిని.మంచిగుణములను మణులతో ,లక్ష్మీ-నారాయణ రూపముతో ప్రకాశించుచు,అనుగ్రహించుచున్న శ్రీ మాతను మణిపురచక్రములో నేను దర్శించగలుగుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment