సౌందర్య-పంచలోహ ప్రాకారము
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఇనుము-కంచు-రాగి-సీస-ఇత్తడి ప్రాకారములను దాటి
వసంత-గ్రీష్మ-వర్ష ఋతువుల సగభాగమును దాటి
ఇషలక్ష్మి-ఊర్జ లక్ష్మి శక్తులు గల శరత్తుతో
సృష్టి-స్థిలి-లయ-తిరోధాన-అను గ్రహాదులతో
భక్త మందార మనోసంకల్పిత మందారవాటికల
పంచలోహ ప్రాకారమున నేను సంచరించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" పంచమీ -పంచ భూతేశి,పంచ సంఖ్యోపచారిణి" సంకల్ప నిర్మిత,పంచమ-పంచలోహ ప్రాకారము,ఇషలక్ష్మీ-ఊర్జలక్ష్మీ సమేత శరదృతు నాయక చంద్రికాపాలితమై ,ప్రకాశిస్తూ ఉంటుంది.
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును,నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయగదే. (సహజకవి బమ్మెర పోతన)
తాపస మందార-సేవక మందార-భక్త మందార అను పదములను మనము తరచుగ వింటూనే ఉంటాము.మందార శబ్దము పుష్పజాతినే కాక,కొండజాతి,జలజాతి,వనజాతులను తెలియచేస్తుంది.అంతే కాదు.
దైవ క్షిప్ర ప్రసాద గుణముగా ( అతి త్వరగా అనుగ్రహించు స్వభావముగా) కీర్తింపబడుచున్నది.
మహామహోన్నతమైన మందార వాటికలో నా డెందము చిందులువేయుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment