మార్గళి మాలై-04
**************
నాల్గవ పాశురము
*************
ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్
ఆళియల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
ఊరి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రు అదిరిందు
తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళ్ పోల్
వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
*************************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.
సముద్రగర్భపు నీటిని కడుపు నిండ త్రావి త్రేన్ చు
కారుమబ్బు రూపములో గగనమునకు పయనించు
పద్మనాభ చేతిచక్రకాంతి వలె మెరుపులతో
పెద్ద యుధ్ధపువేళ మ్రోగు శంఖము వలె ఉరుములతో
రామబాణ వరుస వంటి రమ్యమైన జల్లులతో
మార్గళి స్నానము చేయగ వరుణదేవ కనికరించు
జగత్కళ్యాణమునకు జలసమృధ్ధినందించగా
తల్లి తానె తరలివచ్చె తానొక గోపికగా
పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
నప్పిన్నయ్ తిరుప్పావై కు రారాదో? ఓ గోపికలారా!
ఆళిమళై కణ్ణా!అను సంబోధనతో వరుణదేవుని ,వానిచే కర్తవ్య పాలనము చేయించుచున్న స్వామిని కీర్తిస్తున్నది.పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వముగల అర్చామూర్తిని సంకీర్తించుచు వ్రతముచేయుటకు గోపికలను ఉన్ముఖులను చేయుచున్నది.తల్లి ఆచార్యుల జ్ఞానవృష్టిని ,వరుణదేవుని వానలతో బాహ్య-అంతరార్థములతో వివరించుచున్నది.మార్గళి స్నానమును చేయుటకు వర్షములను సమృధ్ధిగా కురిపించమని,మమ్ములను చిన్నబుచ్చనీయని నీ వితరణను ప్రదర్శించమని చెబుతున్నది.వరుణదేవుడు ఏ విధముగా సముద్రగర్భములోనికి ప్రవేశించి,కడుపునిండా నీటిని త్రావి,తేంచి,నల్లని మేఘముగా మారి,ఆకాశమువైపునకు పయనించి అమృతధారలను వర్షించుట,అదియును సుదర్శనచక్రపు కాంతి వంటి కాంతిగల మెరుపులతో,స్వామి పాంచజన్య శంఖనాదము వంటి ఉరుములతో,అంతే కాదు రామబాణ పరంపర వంటి జల్లులతో కురిసి అనుగ్రహహించమని వేడినది.ఇది వాచ్యార్థము.
( శ్రీమాన్ నమ్మాళ్వార్ ఇతర ఆచార్యులతో మనకు అందించిన జ్ఞానోపదేశమని శ్రీవైష్ణవులు విశ్వసిస్తారు. )
ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు
స్వామి శంఖనాద ప్రణవ నాదము శేష-శేషి భావమునకు,శరమళై స్వరూప యాదాత్మ్య జ్ఞానమునకు సూచికలు.ఉపదేశములు-.వారి జ్ఞాన వాగ్వర్షము కాంతిని-విజ్ఞతను మెరుపు ఉరుముల వలె కలిగియుండును.తిరుగులేని రామబాణముల వరుస వలె అనవరతము అనుగ్రహించుచుండును అని అమ్మ పర-వ్యూహ-విభవ మైన ఆచార్య తత్త్వమును " ఆళిమళైకణ్ణా! అని ప్రస్తుతించినది."ముగందు కొడు" అని జ్ఞానమును పూర్తిగా సంగ్రహించిన వారిగా ప్రస్తుతించినది.వారి జ్ఞాన ధారలను"మగిళిందు పెయిదిడాయ్" ఆనందముగా వర్షించమని అభ్యర్థిస్తున్నది.లోక కళ్యాణమునకై గోదమ్మ తనను ఒక సామాన్య గోపికగా భావించుకొని మనందరకు వ్రతవిధానము అతి ముఖ్యమైన అనన్య శరణత్వమును అందించుచున్నది.
(ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
.
No comments:
Post a Comment