మార్ఘలి మాలై07
***************
ఏడవ పాశురం
************
కీశు కీశెన్రు ఎంగుం ఆనైచ్చాత్తం కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే!
కాశుం పిరప్పుం కలగల ప్పక్కై పేర్తు
వాశ నరుం కుళల్ ఆయ్ చ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త త్తయిర్ అరవం కేట్టిలైయో?
నాయగపెణ్ణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో?
లేశముడయాయ్! తిర్ ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము
భరద్వాజ పక్షుల సత్సంగములు వినబడుటలేద
భావతాదాత్మతతో బాహ్యము విడనాడినావు
చల్లచిలుకు గొల్లల కవ్వడి సవ్వడులు వినలేద
నల్లనయ్యా తలపులో తలమునకలవుతున్నావు
నీ తలుపు సందునుండి ప్రసరించు నీ మోము కాంతి
మా కేశవ స్మరణమును ప్రతిబింబిస్తున్నది
నాయికవై మా అందరికి,నారాయణ మహిమ పంచు
తల్లి తానె తరలి వచ్చె తానొక గోపికయై
పాశురములు పాడుచు,పాశములన్నింటిని విడిచి
నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో?ఓ నాయికా! .
" ఏకమేవం బ్రహ్మం న అద్వితీయము" అను పరమార్థమును గోదమ్మ భరద్వాజ పక్షులు-చల్ల చిలుకు భామలు -గోపిక ముఖ తేజస్సు అను మూడు విషయములను ఉపకరణములుగా మలచి మనలను చైతన్యవంతులను చేయుచున్నది.
ఏ విషయమునకైన స్పందించకున్న లేక సందేహమును వెలిబుచ్చకున్న ఆ విషమును వారు పూర్తిగా అర్థము చేసికొనిన వారైనా కావచ్చును లేదా ఏమాత్రమును అర్థము కాని వారైనను కావచ్చును.
ఆరవ పాశురములో పుళ్ళుం అని పక్షులను సామాన్యవాచ్యముగా వాని ధ్వనులను అర్థగ్రహణ దుర్లభముగా ప్రస్తావించినది.అది శ్రవణ భక్తి మొదటి దశ అని అనుకొన్నాము.ఈ పాశురములో గోదమ్మ వాటిని "ఆనైచ్చాతం" భరద్వాజ పక్షులు అను విశేష నామధారులు గాను,అవి అన్ని ఒకచోట అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్త్వముగాను,అంతటను వ్యాపించి యున్నప్పటికిని కలిసి ఏక కాలమున ధ్వనించు శృతి-స్మృతి విచారణముగా ప్రత్యేకించి చెప్పినది.
పూర్వము భరద్వాజ ముని బ్రహ్మాండ విశేషములను అధ్యయనము చేయగోరి భగవానునిచే రెండు పూర్ణ జన్మల 200 సంవత్సరముల ఆయుర్దాయమును పొందినాడట.అయినను తాను నేర్చుకొన్నది పరమాత్మ రచనలోని పరమాణువు మాత్రమే నని,దాని కన్న పరమాత్మ మూలతత్త్వమైన బ్రహ్మమును తెలిసికొనుట పరమానంద భరితమని గ్రహించినాడట.భగవంతుని సేవకన్న భగవద్భక్తుల సేవభాగ్యమును గొప్పదిగా భావించేవాడట.అందులకు నిదర్శనముగా తన దగ్గరకు వచ్చిన శ్రీరాముని కన్న భరతుని సేవించి మిక్కిలి ఆనందపడినాడట.
" బ్రహ్మము అంటే ఏమిటి? అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రళయకాలమునందు దేనిలో మనము నామరూపరహితులమై దాగి ఉంటామో,ప్రస్తుత కాలములలో నామరూపరహితముగా ఏది మనలో దాగి ఉంటుందో అదేబ్రహ్మము అన్న విషయము కొంచకొంచముగా అర్థమవుతుంటుంది.అవియే బ్రహ్మము యొక్క స్థూల-సూక్ష్మ రూపములను విషయము తెలుస్తుంటుంది."
భారద్వాజ పక్షులు "బ్రహ్మమును అనుసరించు" అని తెలియచేయువిధానమే "కీశుకీశు" అను అనుకరణ శబ్దములు. నిరాకర నిర్గుణ పరబ్రహ్మమును అను తెలియ చేయు
జ్ఞానశృతి-రైకుల కథ.జ్ఞానశృతి చేసిన అన్నదాన ఫలిత తేజము ఆకసమున వ్యాపించి యున్న సమయమున ఒక భరద్వాజ పక్షి తన జంట పక్షితో అటువైపు వెళ్లవద్దు ప్రమాదము అని చెప్పగానే మరొక భరద్వాజము రైకుని బ్రహ్మత్వమును తెలియచేసి శృతజ్ఞానిని సంస్కరించినది.
పరిధిని దాటిన భావము కాని పనికాని పిచ్చిగా గుర్తించుట లోక సహజము.(శ్రీమాన్ కులశేఖర ఆళ్వారులుగా కీర్తించబడే )ఈ గోపిక భ్రాంతి మోహితురాలై,గోపికల పిలుపునకు సమాధానమును ఇచ్చుటలేదు.భారద్వాజ పక్షుల వృత్తాంతమునమును వినినదో లేదో అని గోదమ్మ పిచ్చి పిల్లా భగవద్గుణామృతపానమను భ్రాంతిలో (పిచ్చిలో) ఉన్న దానా మేల్కొను.తెల్లవారినదనుటకు నీకు ఇంకొక ఉదాహరణమును చెబుతాము అంటున్నారు గోపికలు.
ఏవిధముగా భరద్వాజ పక్షులు అన్ని కలిసి అంతట వ్యాపించి ఏక కాలమున కీశు కీశు అను నిర్దిష్ట ధ్వనినిచేస్తున్నాయో,అదేవిధముగా గోకులములోని గొల్లెతలు శుచులై-సుముఖులై నిత్యకృత్యమైన చల్ల చిలుకుట అను పనిని క్షీరసాగర మథనమంత పవిత్రముగా భావించి చేయుచున్నారట.అప్పుడు మూడు ప్రదేశముల నుండి ధ్వనులు త్రికరణశుధ్ధములై హరి నామమును కీర్తిస్తున్నవా అన్నట్లుండెనట.
కృష్ణ పరిష్వంగమును పొందిన గోవుల క్షీరము లభించిన పెరుగు చిలుకుటకు వారు పట్టుకున్న "మత్తి" కవ్వము సాక్షాత్తు స్వామి వలె కనిపిస్తు వారిని చేతులు చాచి ముందుకు రమ్మని కవ్విస్తున్నదట.కట్టిన తాడు చటుక్కున జారిపోతుందేమనని గట్టిగా పట్టుకొని చల్లచిలుకుతున్న సమయమున వారి మనస్సు తమ యెదపై నున్న "కాశొ-పిరప్పులు" మంగళసూత్రములు మంగళధ్వనులను చేస్తు మైమరచుచున్నవట.చాచిన చేతుల కంకణములుకాయకర్మకు ప్రతీకలై కణ్ణా-కణ్ణ-కణ్ణాఅంటున్నవట.కవ్వపుచప్పుడు వాక్కుతో జతకలిపి వాని వైభవమునవర్ణించుచున్నదట.
."మనో వాక్కాయ కర్మలు అతిపవిత్రరూపమును దాలిచి చేయుచున్న"
కైంకర్య సవ్వడి(మత్తినాల్ ఓశై)వారి కేశము ముడిని విడదీసి వాని నుండి వచ్చు సుగంధ పరిమళములను(వాశనరుం కుళల్) రేపల్లెనంతా వ్యాపింపచేస్తున్నదట.
ఇది వాచ్యార్థమైనప్పటికి అంతరార్థము యోగులు-జ్ఞానులు గొల్లెతలు చేతులు చాచినట్లు తమ అపారకరుణను అందించుటకు చేతులనువిశాలముగా చాచినట్లున్నది.ఆ మూడు సవ్వడులు వేద-వేదాంత రహస్యములను ప్రీతితో వెల్లడించునట్లున్నది.తద్వారా వారినుండి జాలువారిన జ్ఞానధారలు వడివడిగా రేపల్లెను అంతటను సుసంపన్నము చేసిన పరిమళము వలె శోభిల్లుచున్నది.
.
గోదమ్మ ఈ పాశురములో నిదురిస్తున్న గోపికను " పేయ్ పెణ్ణా" భ్రాంతిలో ఉన్నదానా అని మొదట సంబోధించినది. ఆమె పిచ్చిదని గోపికలు భ్రమపడినారు.భ్రాంతి పడినారు.కాని నిజమునకు ఆమె,
దివ్య తేజోరాశి " నడిపించగల సామర్థ్యము కలది.నాయకుని కూతురు.కనుక "నయతి ఇతి నాయికా"గోదమ్మ ఆమెను నిద్ర లేపుతు రెండవసారి "
"నాయగన్ పెణ్ణ్ పిళ్ళాయ్"" అంటూ నువ్వేమా నాయికవు అని తెలిపినది. మరియొక విశేషమేటంటే సంకీర్తనలో స్వామిని నారాయణుడు-కేశవుడు) సర్వజీవులకు ఆధారమైన నారాయణుడు,"కేశి" అను అసురుని సమ్హరించి క్లేశములను తొలగించిన కేశవుడు అని నామములతో కీర్తించు టచే నామసంకీర్తనము నూతనత్వమును సంతరించుకున్నది.నామ సంకీర్తనమును చేస్తూ గోదమ్మ ఈ గోపికను నాయకురాలిని చేసి గోష్టికి వేరొక గోపికను మేల్కొలుపుటకు బయలు దేరుచున్నది.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..)
.
No comments:
Post a Comment